బురుజు.కాం Buruju.com : తెలంగాణలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ( సెర్ప్) ఉద్యోగులకు త్వరలో ఇతర ఉద్యోగులకు మాదిరిగానే వేతన స్కేళ్లు వర్తించబోతున్నాయి. సెర్ప్ ఉద్యోగుల చిరకాల వినతిని సాకారం చేస్తున్నట్టుగా నూతన బడ్జెట్ వెల్లడించింది. పేస్కేళ్లు.. 2023, ఏప్రిల్ నుంచే అమల్లోకి రానున్నట్టు సెర్ప్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని 3,974 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
పేస్కేళ్ల కోసం సెర్ప్ ఉద్యోగుల నాయకులు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావును కలసినప్పటి చిత్రం
రాష్ట్రంలో.. గ్రామీణ ప్రాంతాల్లోని పేదరిక నిర్మూలనలో సెర్ప్ ఉద్యోగుల పాత్రే కీలకం. డ్వాక్రా సంఘాలను సమన్వయం చేసి సంఘాల్లోని దాదాపు 50 లక్షల మంది మహిళలు బ్యాంకు రుణాల ద్వారా వివిధ రకాల ఆర్ధిక ఆసరా పనులను చేపట్టుకొనేలా వీరే పర్యవేక్షిస్తుంటారు. మహిళల సంక్షేమంలోను, గ్రామీణ పథకాల అమల్లోను వీరు కీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. 23 ఏళ్లగా చాలీచాలని వేతనాలతోనే జీవితాలను నెట్టుకొంటూ వస్తున్నారు.
వీరికి పే స్కేళ్లను వర్తింపజేస్తామని 2018 ఎన్నికల సందర్భంగా.. తెరాస తన ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపర్చి, ఆ తర్వాత ఉభయ సభల్లోను గవర్నరు ప్రసంగంలోను ఆవిషయం ప్రస్తావనకు వచ్చినా వేతన పెంపుదల ఆచరణలోకి రాలేదు. దీంతో ఉద్యోగ సంఘాల నాయకులు పలు సార్లు విన్నవించుకొన్న మీదట 2022, మార్చి 15వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్.. వారికి హామీ ఇచ్చారు. ఎట్టకేలకు ఫిబ్రవరి6 వ తేదీన ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్ లో ఉద్యోగులకు సానకూల ప్రకటన వెలువడింది.
ఆర్థిక మంత్రిహరీశ్ రావుకు సెర్ప్ ఉద్యోగులు విన్నవించుకొన్నప్పటి చిత్రం
ఆలస్యంగానైనా తమ సేవలను ప్రభుత్వం గుర్తించిందని ఉద్యోగులు షంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత వేతనాలకు బడ్జెట్ లో రూ.192 కోట్ల కేటాయింపు ఉండగా పేస్కేళ్ల ద్వారా ప్రభుత్వానికి మరో రూ.42 కోట్ల అదనంగా ఖర్చవుతుందని సెర్ప్ ఉద్యోగుల ఐకాస (ఐక్య కార్యాచరణ సమితి-జేఏసీ) ప్రతినిధులు కుంట గంగాధర్ రెడ్డి, నరసయ్య, సుదర్శన్, వెంకట్, సురేఖ, మహేందర్ రెడ్డి, సుభాష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తమకు తగిన గుర్తింపు దక్కుతున్నందుకు ఆనందిస్తున్నామని వారు తెలిపారు. మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర రావులను కలసి ధన్యవాదాలను తెలియజేయనున్నట్టు కుంట గంగాధర రెడ్డి ‘బురుజు’కు వెల్లడించారు.