హైదరాబాదులో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పశుమిత్రలు
బురుజు.కాం Buruju.com : తెలంగాణలోని పశువులకు తక్షణం ప్రాధమిక చికిత్స అందించే ‘పశుమిత్ర’లకు ప్రభుత్వం సముచిత వేతనాన్ని ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతానికి మాత్రం వారితో సంవత్సరాల తరబడి చికిత్సలు చేయిస్తూ ఒక్క రూపాయినైనా వారికి ముట్టజెప్పటంలేదు. వైద్యాన్ని అందించినందుకు గాను రైతు నుంచి సేవా రుసుం వసూలు చేసుకోవాలనే ప్రభుత్వ విధానం బంగారు తెలంగాణ ఆశయ సాధనకు పూర్తి విరుద్ధం. ఇక నైనా తమ మొరను వినాలంటూ తాజాగా పలువురు పశు మిత్రలు హైదరాబాదుకు వచ్చి ప్రభుత్వానికి విన్నవించుకొన్నారు.
నిరసన కార్యక్రమంల మాట్లాడుతున్న సంఘ ప్రధాన కార్యదర్శి కాసు మాధవి. గౌరవ అధ్యక్షులు జె.వెంకటేష్ తదితరులు వేదికపై ఉన్నారు
పశువులకు తక్షణం వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో పశు మిత్ర విధానాన్ని ప్రభుత్వం చాలా కాలం క్రితమే అమల్లోకి తెచ్చింది. మండల కేంద్రంలోని పశువుల ఆసుపత్రి వరకు వెళ్ల నవసరం లేకుండా గ్రామ స్థాయిలోనే దాదాపు 20 రకాల వ్యాదులకు పశు మిత్రలు చికిత్సలు అందజేస్తూ ఉండటంతో రైతుకు వ్యయ, ప్రయాసలు తప్పుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గల డ్వాక్రా సంఘాలకు చెందిన 2,500 మంది నిరుపేద మహిళలు ప్రస్తుతం పశుమిత్రులుగా కొనసాగుతున్నారు. మండల కేంద్రంలో ఇవే తరహా చికిత్సలు చేసే పశు సంవర్ధక శాఖ సిబ్బందికి వేలల్లో వేతనాలు ఉంటుండగా.. పశుమిత్రలకు మాత్రం ఒక్క రూపాయి కూడా వేతన రూపంలో అందకపోవటం దారుణం. అందువల్లనే తమది వెట్టి చాకిరీ అని వారంతా వాపోతున్నారు. మిగతా రంగాల్లోని చిరుద్యోగులకు ఎంతో కొంత మొత్తాన్ని ఇస్తున్నట్టుగానే తమకూ ఇవ్వాలంటూ వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
పశుమిత్రల సమస్యలపై సెర్ప్ డైరక్టరుకు వినతి పత్రాన్ని అందజేస్తున్న సంఘ ప్రతినిధులు
తెలంగాణ రాష్ట్ర పశుమిత్ర వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఫిబ్రవరి 22 తేదీన హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి తరలి వచ్చిన పశుమిత్రలు పాల్గొన్నారు. సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జె.వెంకటేష్, అధ్యక్షురాలు కె.శారద, ప్రధాన కార్యదర్శి కాసు మాధవి ఇక్కడి సభలో మాట్లాడుతూ.. పశుమిత్రలకు ప్రభుత్వం వెంటనే సముచిత వేతనాన్ని ఇవ్వాలని కోరారు. వారు ప్రభుత్వానికి చేసిన మరికొన్నివిజ్ఞప్తులు ఇలా ఉన్నాయి ‘‘ పశుమిత్రలకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. అందరికీ యూనిఫారాలు, గ్లౌజులు, మాస్కులు , మందుల కిట్ లు అందజేయాలి. ఈఎస్ఐ, పీఎఫ్, ప్రమాద బీమా సదుపాయాలను కల్పించాలి. కృత్రిమ గర్భాధారణలో శిక్షణ ఇవ్వాలి. సబ్సిడీలపై ఎలక్ట్రిక్ బైక్ లను సమకూర్చాలి’’ అని కోరారు.
పశువులకు చికిత్సలు చేసే సమయంలో పలువురు పశు మిత్రలు అస్వస్తతకు గురవుతుంటారని, అయినప్పటికీ వారు రైతులు పిలిచిన వెంటనే వెళ్లి సేవలను అందజేస్తున్నారని సంఘ ప్రధాన కార్యదర్శి కాసు మాధవి.. ‘బురుజు’ ప్రతినిధికి తెలిపారు. కనీసం వైద్య కిట్లు, మందులనైనా ఇవ్వకుండా వారితో ప్రభుత్వం ప్రాధమిక చికిత్సలను చేయిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి సేవా రుసుములను రైతు ఇవ్వాలనటం భావ్యంకాదని, ఇది రైతుపై భారం మోపీనట్టే కదా? అని ఆమె వ్యాక్యానించారు. పశుమిత్రలకు ప్రభుత్వం వేతనాలను ఇస్తుందని రైతు భావించి సేవా రుసుములను ఇవ్వని పరిస్థితి కూడా ఉంటుందన్నారు. అసలు పశు మిత్రలు ఏ శాఖ పరిధిలోకి వస్తారో తెలియని విచిత్ర పరిస్థితి నెలకొందని, వీరు డ్వాక్రా గ్రూపులకు చెందిన వారు కావటంతో పేదరికి నిర్మూలన సంస్థ ( సెర్ప్ ) లోని డైరక్టరును కలసి ఒక వినతి పత్రాన్ని అందజేశామని ఆమె తెలిపారు.