సచివాలయం భేష్.. మరి జర్నలిస్టుల గత వైభవం మాటేమిటి? (రెండోవ భాగం)
personBuruju Editor date_range2022-12-05
కొత్త భవనం పూర్తయ్యాక ఈశాన్య దిశ నుంచి ఇలా కనిపిస్తుంది
బురుజు.కాం Buruju.com ( తెలంగాణ నూతన సచివాలయ Telangana new secretariat నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. 2023, జనవరి 18వ తేదీ మొదలుకొని అక్కడి నుంచే విధులను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ యోచిస్తున్నారు. పాత సచివాలయంలో మాదిరిగా తమకు స్వేచ్ఛ ఉంటుందా? అనే మీమాంస జర్నలిస్టుల్లో నెలకొన్న నేపథ్యంలో.. పాత సచివాలయంలోని పరిస్థితులను వివరిస్తూ ‘బురుజు’ అందిస్తున్న కథనాల్లో ఇది రెండోవది) సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశాలను 2014 వరకు విలేకర్లు పెద్ద సవాలుగా భావించేవారు. ప్రభుత్వం అధికారికంగా వెలువరించే సమాచారానికి అదనంగా ఎన్ని అంశాలను సేకరిస్తే అంత గొప్పగా విలేకర్లు పరిగణించేవారు. దీని కోసం పొలిటికల్ బ్యూరోల విలేకర్లు రంగంలోకి దిగేవారు. అప్పట్లో ‘ఈనాడు’తో సహా కొన్ని పత్రికలకు పొలిటికల్ విలేకర్లు ప్రత్యేకంగా ఉండేవారు. జనరల్ రిపోర్టరు కంటే పొలిటికల్ రిపోర్టరుతో మంత్రులకు ఎక్కువ చనువు ఉండటం సహజం. దీంతో మంత్రి వర్గ భేటీల తర్వాత.. పొలిటికల్ విలేకర్లు తమకు బాగా పరిచయం ఉండే మంత్రుల వద్దకు వెళ్లి మంత్రి వర్గ సమావేశంలో ఇంకా ఏయే అంశాలు చర్చకొచ్చిందీ రహస్యంగా తెలుసుకొనే ప్రయత్నం చేసేవారు. అలా ఒక్కో మంత్రి నుంచి సేకరించిన ఒక్కో అంశాన్ని జోడిస్తే అదొక ప్రత్యక కథనం అయ్యేది.
ఆనాడు మంత్రి వర్గ సమావేశాలను నిర్వహించిన ‘సి’ బ్లాకు భవనాలు ఇవే. దీనిలోనే ముఖ్యమంత్రి కార్యాలయం ఉండేది
ఇటువంటి పూర్వపు పద్దతులను తెరాస ప్రభుత్వం పూర్తిగా మార్చివేసింది. సమావేశాలు సచివాలయానికి బదులు ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ లో నిర్వహించటం అలవడింది. కేవలం అధికారికంగా వెలురించే సమాచారం తప్పిస్తే మంత్రులు ఎవరూ నోరువిప్పని పరిస్థితి వచ్చింది. తెలంగాణ ఆవిర్భవించిన మూడో రోజున.. మంత్రివర్గ సమావేశంలోని పంట రుణాల మాఫీ అంశాన్ని పత్రికల వారికి చెప్పినందుకు ..అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఎన్ని ఇబ్బందులు పడిందీ ఇప్పటికే Buruju.com వెల్లడించింది. మరో వైపు.. ‘ఈనాడు’ తదితర పత్రికలు పొలిటికల్ బ్యూరోల విధానానికి స్వస్తి పలికి జనరల్ రిపోర్టర్లకే రాజకీయ పార్టీలనూ అప్పగించే విధానాలను తెచ్చాయి. దీంతో మంత్రులతో రిపోర్టర్లకు సంబంధాలు తగ్గిపోయాయి. ప్రభుత్వం ఒక్కో మంత్రికి ఒక్కో పీఆర్వోను నియమిస్తూ రావటంతో ఇక మంత్రి తాలూకు విషయాలన్నింటినీ అతనే వాట్సప్ ద్వారా పంపటం అలవడింది. ఇప్పుడు కొత్త సచివాలంలోను ఇక ఇదే పద్దతి ఉంటుంది కనుక మంత్రివర్గ సమావేశాల్లోని అంతర్గత విషయాల సేకరణ అనేది గత వైభవంగానే నెమరవేసుకోవాలి.
చెట్ల మాటున ఒదిగిపోయి.. ఇటీవల వరకు నిలిచి ఉన్న నిజాంకాలంనాటి భవనాన్ని చిత్రంలో చూడొచ్చు. దీనితో పాటు.. వెనుక కనిపిస్తున్న భవనాలన్నీ నేలమట్టమయ్యాయి
సచివాలయ ఆవరణలోని నిజాం కాలంనాటి భవనాలను ఒక్కొక్కటిగా కూల్చివేస్తూ కొత్తవాటిని కడుతూ రావటం సినియర్ జర్నలిస్టులకు తెలిసిందే. అటువంటి పాత భవనాల్లో ఇటీవల వరకు ఒకటి మాత్రం మిగిలి ఉంది. అదే.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటూ విధులను నిర్వర్తించిన భవనం. ఇది సచివాలయంలోని అమ్మవారి ఆలయానికి ఎదురుగా ఉండేది. పురాతన భవనాలను కూల్చివేయవద్దంటూ దాఖలైన కేసు కారణంగానే అది ఇటీవల వరకు మిగిలి ఉండగలిగింది. ఎన్టీఆర్ తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయం ‘సమత’ పేరుతో గల ‘సి’ బ్లాకులోకి మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ముఖ్య పౌర సంబంధాల అధికారి కార్యాలయం ‘సి’ బ్లాకులోని పై అంతస్తులోనే ఉండేది. ఇప్పటి మాదిరిగా కంప్యూటర్లు, వాట్సప్ సదుపాయాలు అప్పటికింకా అందుబాటులోకి రాలేదు కనుక ఐఏఎస్ అధికారుల బదిలీలు వంటి ముఖ్యమైన జీవోలను విలేకర్లు సీపీఆర్వో వద్ద నుంచే సేకరించుకొనేవారు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకనే సీపీఆర్వో కార్యాలయం అదే సీబ్లాకులోని దిగువ అంతస్తులోకి మారింది.
ఇటీవల వరకు గల తెలంగాణ సచివాలయంలోని బయటకు వెళ్లే దారి ఇది
అప్పట్లో జీవోలను సంపాదించుకోవటమూ ఒక సవాల్ గానే ఉండేది. అయినప్పటికీ ఎక్కడికైనా వెళ్లి ఎవరితోనైనా మాట్లాడగలిగే స్వేచ్ఛ విలేకర్లకు, పత్రికలంటే భయపడే తత్వం అధికారగణాలకు ఉండటం వల్ల అన్ని పనులు దిగ్విజయంగా పూర్తయ్యేవి. పత్రికల్లో వచ్చే కథనాలను ప్రభుత్వం పట్టించుకొన్నప్పుడే అధికారగణాలు అప్రమత్తంగా వ్యవహరిస్తాయి. వారిలో జవాబుదారీ తనం పెరుగుతుంది. ఇప్పుడా పరిస్థితులు లేవు. ఎలక్ట్రానిక్ మీడియా విస్తరణతో విలేకర్ల కట్టడికి ప్రభుత్వాలు నడుంకట్టాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే వార్తలపై వివరణలు ఇవ్వటానికి బదులు.. ప్రభుత్వ పెద్దలే పత్రికల యాజమాన్యాలను నేరుగా ప్రశ్నించే కొత్త రకం పోకడలు ఉద్భవించాయి. పలనా వివరాలను సేకరించినా.. వాటి ఆధారంగా కథనం రాయటం సాధ్యంకాదేమోన్న సందేహం విలేకర్లను వెంటాడటం మొదలయ్యింది. దీంతో సచివాలయంలో సేకరించే వివరాలతో కుంభకోణాలను స్వేచ్ఛగా రాయటమూ గత వైభవంగానే మిగిలిపోయింది (మూడో భాగం వచ్చేవారం)