తెలంగాణలో.. ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు తిరిగి విధుల్లోకి
personBuruju Editor date_range2022-08-09
తెలంగాణలో 67 లక్షల మంది గ్రామీణులు ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తుంటారు
బురుజు.కాం Buruju.com తెలంగాణలో ఉపాధి హామీ పథకంలోని 7,561 మంది క్షేత్ర సహాయకులు ( ఫీల్డు అసిస్టెంట్లు) తిరిగి విధుల్లోకి రానున్నారు. దీంతో వారి విధులను అదనంగా నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శులకు ఇక ఆ మేరకు భారం తగ్గుతుంది. క్షేత్ర సహాయకులకు తిరిగి బాధ్యతలను అప్పగించాల్సిందిగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి యర్రబెల్లి దయాకరరావు.. తాజాగా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఏళ్ల తరబడి తాత్కాలిక పద్దతిలో పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ.. తమ ఉద్యోగాలను ఖాయం చేయాలని, జీతాలను ఖజానా శాఖ ద్వారా చెల్లించాలని వంటి విన్నపాలతో 28 నెలల క్రితం క్షేత్ర సహాయకులు సమ్మెకు పిలుపు ఇవ్వటం వారిని రోడ్డున పడేసేటట్టు చేసింది. వారు ఇలా సమ్మెకు దిగటాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టుగా 2021, మార్చి 18వ తేదీన ప్రకటించింది. వారి బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని క్షేత్ర సహాయకులు అప్పటి నుంచి ప్రాధేయపడుతూ రాగా.. ఎట్టకేలకు ప్రభుత్వం కనికరించింది.
ఏడాదికి వంద రోజులు పని కల్పించాలని చట్టం చెబుతుండగా.. తెలంగాణలో సగటున 50 రోజులు మాత్రమే పని దొరుకుతోంది. తిరిగి నియమితువుతున్న క్షేత్ర సహాయకులు .. కూలీల పనిదినాల పెంపునకు నడుంకట్టాలి
ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీలకు రోజువారీ హాజరును నమోదు చేయటం, వారి పనులను పర్యవేక్షించటం, సాధ్యమైనంత ఎక్కువ మందికి ఉపాధి కల్పించటం వంటివి క్షేత్ర సహాయకులు చేసే విధుల్లో ప్రధానమైనవి. వీరి వ్యవస్థ 2007లో అమల్లోకి వచ్చింది. తొలుత వీరి వేతనం రూ.1,200 కాగా అది క్రమేణా పెరుగుతూ ప్రస్తుతం రూ. 10వేలకు చేరింది. తెలంగాణలో ఉపాధి హామీ పథకం కింద ఒక కోటి 21 లక్షల మంది గ్రామీణులు తమ పేర్లను నమోదు చేసుకోగా.. వారిలో 67 లక్షల మంది పనులకు వెళ్తుంటారు. పేర్లను నమోదు చేసుకొన్నవారికి ఏడాదిలో 100 రోజుల పాటు పనులను చూపించాలని చట్టం చెబుతుండగా.. ప్రస్తుతం తెలంగాణలో సగటున 50 రోజులు మాత్రమే పని దొరుకుతోంది. చేసిన పనికి అనుగుణంగా రోజువారి వేతనం సగటున రూ. 172 లభిస్తోంది. కందకాలు, కుంటల తవ్వకం, మొక్కలను నాటటం వంటివి ఉపాధి హామీ పథకం కింద చేపడుతుంటారు.