బురుజు.కాం Buruju.com : ఆత్మ విశ్వాాసాన్ని నింపే మాటలను చెబుతూ కొందరు సినీ తారలు అబ్బురపరుస్తున్నారు. వివిధ వేదికలపై వీరు చెప్పే జీవిత సత్యాలను వినేవారికి.. సినిమాల్లో కనిపించే హీరోయిన్లు వీరేనా? అనే భావన తప్పక కలుగుతుంది. ముఖ్యంగా.. హాలీవుడ్ సినిమాల్లోను నటిస్తున్న హిందీ నటి ప్రియాంక చోప్రా చేసే ప్రసంగాలు.. సోషల్ మీడియా ద్వారా నిత్యం పలువురిని ఆకట్టుకొంటున్నాయి. నెల రోజుల క్రితం న్యూయార్కులోని ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి సైతం ఆమె మాట్లాడారు. విద్యకు సంబంధించి ఎన్నో విషయాలను ఆమె వెల్లడించారు.
ప్రపంచంలో ఎవరు ఏ విషయంపై అడిగినా.. వెంటనే సమాధానాన్ని ఇచ్చే సద్గురు జగ్గీవాసుదేవ్ కు.. కంగానా రానౌత్ ప్రశ్నలు
సినీ నటులంటే.. దర్శకుడు చెప్పే నాలుగు మాటల్ని తిరిగి వల్లెవేయటం తప్ప వారికి ఇంకేమీ తెలియదనే అభిప్రాయం గల వారు ఇప్పుడు దానికి తప్పక సవరణలు చేసుకోవాలి. ప్రవచనకారులకు ఏమాత్రం తీసిపోని రీతిలో.. కొందరు తారలు విజయ సోపానాల గురించి చక్కగా చెబుతున్నారు. సినీ తారలంటే ప్రజలు మరింత ఆసక్తిని చూపిస్తారు కనుక వారు చెప్పే విషయాలు సులువుగా ప్రచారంలోకి రాగలుగుతున్నాయి. కలలకు రెక్కలు తొడిగితే ఎలా ఉంటుందో తెలుసుకోవటానికి తానే ఒక ఉదాహరణ అంటూ ప్రియాంక చోప్రా ఒక వేదికపై చెప్పారు. వివిధ రంగాల్లో తాను రాణిస్తున్నతీరును విశిదీకరించారు. విద్య అనేది కనీస మానవ హక్కు అని అంటారామె.
దీపికా పడుకోణె
ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రసంగాలు చేస్తున్నవారిలో ఇంకా.. దీపికా పడుకోణె, రాశీకన్నా, గెనేలియా , కంగానా రానౌత్ , పూజా హెగ్డే, సారా అలీఖాన్, ఆనుష్క శర్మ, ప్రితి జింట, ఖత్రినా ఖైఫ్, సుష్మితా సేన్ , రష్మి దేశాయ్ వంటివారు ఉన్నారు. టాలీవుడ్ లో నటులకంటే కొందరు ధర్శకులు అటువంటి వర్గీకరణలో కనిపిస్తారు. వీరిలో ప్రధానంగా.. త్రివిక్రం ఉపన్యాసాలు పలువురిని ఆకట్టుకొంటూ ఉంటాయి. పూరీ జగన్నాధ్ మంచి మాటల వీడియోలూ వెలువడుతుంటాయి.
విషయాన్ని బాగా అర్ధమయ్యే విధంగా త్రివిక్రం చెబుతుంటారు
కొందరు సినీ తారలు ప్రముఖ ప్రవచన కారుల్ని సైతం వివిధ అంశాలపై ప్రశ్నిస్తూ చూపరులను ఆశ్చర్యచికితుల్ని చేస్తున్నారు. ముఖ్యంగా.. సద్గురు జగ్గీ వాసుదేవ్ తో సినీ నటి సమంత, కంగానా వంటి వారు మాట్లాడిన తీరు చూస్తే.. చిరు ప్రాయం నుంచి వివిధ రకాల పుస్తకాలను చదవటం, అదే సమయంలో లోకం పోకడలను పరిశీలిస్తుండటం వీరు అలవర్చుకొన్నారని అనిపిస్తుంది. నటుడు నానీ కూడా ఒక సారి సద్గురుతో భేటీ అయ్యారు.