బురుజు.కాం Buruju.com : సముద్రంలో 110 ఏళ్ల క్రితం మునిగిపోయిన టైటానిక్ Titanicనౌకను ఇక ఎవరైనా సరే దగ్గర నుంచి వీక్షించవచ్చు. సముద్రం అడుగున ఉన్న నౌక వద్దకు తీసుకెళ్లేందుకు ‘ఓషెన్ గేట్ ’ అనే సంస్థ చిన్న సైజు జలంతర్గామిని ( సబ్మెర్సిబుల్ ) అందుబాటులోకి తెచ్చింది. సందర్శనలు 2023, మే 11 వ తేదీ నుంచి జూన్ 23వ తేదీ వరకు అయిదు విడతలుగా ఉంటాయి. టిక్కెట్టు కనీస ధర మన కరెన్సీలో రూ.రెండు కోట్లు. నౌకను వీక్షించ దలచిన వారు తొలుత కెనడాకు వెళ్లాల్సివుంటుంది.
టైటానిక్ సినిమా 1997లో విడుదలయ్యి ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రేమ కావ్యంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. ప్రేమికులు రోజ్, జాక్ లు .. నౌక చివర చేతులు చాచి నిలబడిన ప్రాంతాన్ని స్వయంగా చూడాలన్నంతగా అభిమానులపై ఆ సినిమా ప్రభావాన్ని చూపించింది. ఇటువంటి ఆదరణ వల్లనే.. ఆ ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో ఇప్పటికే ప్రకటించింది. మరో వైపు.. సందర్శకులను నౌకలోకి తీసుకెళ్లేందుకు ఓషెన్ గేట్ ocean gate సంస్థ ముందుకొచ్చి ఇప్పటికే కొందరిని అక్కడికి తీసుకెళ్లింది. ఆ సంస్థ వెబ్ సైటులోని తాజా వివరాల ప్రకారం.. తదుపరి సందర్శనలు 2023, మే నెలలో మొదలవుతాయి. జలాంతర్గామిలో అయిదుగురు వెళ్లవచ్చు. వీక్షకులు కెనడా తీర ప్రాంతమైన జోహన్స్ న్యూ ఫౌండ్ ల్యాండ్ వద్ద ఎనిమిది రోజుల పాటు ఉండాల్సివుంటుంది. వారికి తగిన శిక్షణ ఇచ్చి..వాతావరణం అనుకూలిస్తే మూడో రోజున అసలైన సందర్శనకు తీసుకెళ్తారు.
సినిమాలో ప్రేమికులు రోజ్, జాక్ లు ఇలా నౌక చివరిలో నిలబడే సన్నివేశం ప్రేక్షకులకు హత్తుకుపోయింది
తీరం నుంచి దాదాపు 650 కి.మీటర్లు నౌకలో తీసుకెళ్లి .. అదే నౌకపై ఉండే జలాంతర్గామిలోకి ఎక్కిస్తారు. జలంతర్గామి.. నౌక నుంచి వేరుపడి సముద్రంలోని 3,800 మీటర్ల దిగువకు వెళ్తుంది. ఇలా సముద్రం కిందకు వెళ్లటానికి రెండు గంటల సమయం పడుతుంది. మునిగిపోయిన టైటానిక్ వివిధ భాగాలకు దగ్గరగా జలాంతర్గామి వెళ్తుంది కనుక దాని కిటికీల నుంచి వాటన్నింటిని వీక్షించవచ్చు. కొన్ని గంటల పాటు అక్కడ గడిపిన తర్వాత తిరిగి రెండు గంటల సేపు ప్రయాణించి జలాంతర్గామి సముద్రం పైకి వస్తుంది. దిగువ అనుభవాలను , అనుభూతులను ఇతరులతో పంచుకోవటం కోసం మరో నాలుగు రోజుల పాటు సంస్థ ఆతిధ్యంలోనే సందర్శకులు ఉంటారు. టైటానిక్ నౌకను చూడదలచుకొన్నవారికి 18 ఏళ్ల వయస్సు నిండి.. ఆరు అడుగుల నిచ్చెనను ఎక్కే సామర్ధ్యం కలిగి ఉండాలి. జలంతర్గామిలో చిన్న టాయలెట్ ఉంటుంది.
సినిమాలో ప్రేమికులు నిలబడిన భాగం నిజమైన నౌకలో ఇదే. సముద్రం అడుగున గల టైటానిక్ గురించి చెప్పగానే అందరికీ ఈ భాగమే కళ్లముందు కదలాడుతుంది
జలాంతర్గామి ఇటీవల వెళ్లినప్పుడు ఇంతవరకు ఎవరి కంటా పడని కొన్ని యంత్ర పరికరాలను, వస్తువులను తాము చిత్రీకరించినట్టు సంస్థ వెల్లడించి, ఆ వీడియోలను తన వెబ్ సైటులో పొందుపర్చింది. టైటానిక్ నౌక 1912, ఏప్రిల్ 15వ తేదీన కేవలం 2గంటల 40 నిముషాల వ్యవధిలోనే రెండు ముక్కలయ్యి మునిగిపోయింది. ప్రమాదం జరిగే సమయానికి నౌకపై 2,224 మంది ఉండగా వారిలో 1,500 మందికి పైగా జల సమాధి అయ్యారు. మిగతా వారిని మరో నౌక వచ్చి కాపాడింది.