ఒకే ఇంటి పేరు గలవారు ఇద్దరు తారస పడితే ఒకర్నొకరు ఆప్యాయంగా పలకరించుకొంటారు. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గమనే విషయం బయటపడితే ఆ ఆప్యాయత మరింత తియ్యదనాన్ని ఆపాదించుకొని.. సెల్ నెంబర్లు ఇచ్చిపుచ్ఛుకొనేవరకు వెళ్తుంది. ఒకే ఇంటిపేరుగలవారు వందల సంఖ్యలో ఒక చోట సమావేశమైతే ...? ఆ ఆనందానుభూతి అనిర్వచనీయం. ఒకే ఇంటిపేర్లవారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి భేటీకావటమనే కొంగ్రొత్త ప్రక్రియ ఇటీవలే మొదలయ్యింది. కొద్ది నెలల క్రితం తూర్పుగోదావరి జిల్లాలోని పూల మొక్కలకు ప్రసిద్ధి చెందిన కడియపులంకలో ‘బొరుసు’ ఇంటి పేరు గలవారు ఏకంగా అయిదు వేల మంది హాజరయ్యి ఇటువంటి ఆలోచన గలవారందెరికో స్పూర్తి కల్పించారు. విదేశాల్లో ఉన్నవారు సైతం తమ మూలాలను వెదుక్కోవాలనే ఉత్సుకతతో రెక్కలు కట్టుకొని ఇక్కడికి వాలారు. దైనందిన వ్యాపకాల్లో పడి ఇంటిపక్కవారి గురించే పట్టించుకోని ప్రస్తుత పరిస్థితుల్లో.. ఇటువంటి వేదికలు తప్పక సత్ఫలితాలను ఇస్తాయి. నివసించిన ఊర్లు, చేసిన వృత్తులు , రాజస్థానాల్లోని కొలువులు తదితరాలను బట్టి ఇంటి పేర్లు వస్తుంటాయి. ఒకే గ్రామం ఇంటి పేరుగా గల వారు తరాల క్రితమే వేరైపోయి.. ఇప్పుడు తమ వారి కోసం అన్వేషించుకొంటుండగా.. తెలంగాణలోని కల్వకుర్తి మండలంలోని ముకురాల గ్రామంలో ఇప్పటికీ ముకురాలవారు ఎక్కడికీ వెళ్లిపోకుండా గ్రామాన్నే అంటిపెట్టుకొని ఉండటం విశేషం. ఇక్కడి 72 కుటుంబాల ఇంటి పేరు ప్రస్తుతం ముకురాల గానే ఉంది. వీరంతా రెండు సామాజిక వర్గాలకు చెందినవారు. తెలంగాణలోనే మక్తల్ మండలంలోని లక్ష్మీపురం గ్రామం కాలగర్భంలో కలసిపోయినా.. ఆ గ్రామం ఇంటపేరుగా గలవారు అదే మండలంలోని చిట్యాల అనే ఊరిలో నివసిస్తున్నారు. దాదాపు వందేళ్లక్రితం లక్ష్మిపురం గ్రామంలో కొన్ని పరిణామాలు చోటు చేసుకోవటంతో గ్రామం మొత్తం ఖాళీ అయిపోయింది. లక్ష్మిపురంలో ప్రస్తుతం శిధిల బురుజులు, వాటిని ఆనుకొని ప్రహారి కనిపిస్తున్నాయి.మరో వందేళ్ల తర్వాత లక్ష్మిపురం ఎక్కడ ఉండేదని ఆ ఇంటిపేరుగల వారు మూలాల కోసం వెదుక్కోవచ్చు. అందుకే.. ఇంటిపేర్ల నిఘంటువులను ఒక్కో జిల్లాలోను కనీసం రెండేసి పట్టణాలను కేంద్రంగా చేసుకొని ప్రారంభిస్తే తెలుగు ప్రజల సమగ్ర చరిత్రలో సామాన్య ప్రజల ప్రాధమిక విషయాలు తెలుస్తాయని ప్రముఖ రచయిత ఆరుద్ర ఒక వ్యాసంలో పేర్కొన్నారు. విశ్వ విద్యాలయాల్లో ఈ రకం పరిశోధనలను చేపట్టాలని ఆయన సూచించారు. ఒకే ఇంటి పేరుగలవారు భేటీ అయినప్పుడు.. అసలు తమకా పేరు ఏవిధంగా వచ్చిందీ చరిత్రకారులతో పరిశోధన చేయించేందుకూ నడంకట్టాలి. కొన్ని ఇంటిపేర్ల పట్టుపూర్వోత్తరాలను తవ్వుతున్నప్పుడు అద్భుత చారిత్రక విషయాలూ వెల్లడికావచ్చు. ఉదాహరణకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రగిరిలోని ‘సోడావారు’ అనే ఇంటిపేరును కొన్నేళ్ల క్రితం పరిశోధించినప్పుడు ‘సోఢ’ అనే సాంస్కృత పదం నుంచి అది వచ్చినట్టుగా తేలింది. గోలీసోడాలు అమ్మేవారు కనుక ఆపేరు స్థిరపడి ఉంటుందని భావించినవారు కాస్తా.. అది ఏకంగా వందల ఏళ్లనాటి
సాంస్కృత పదంగా తెలిసే సరికి పలువురు అశ్చర్యపోయారు. సోఢ అంటే సమర్ధులు, సహనం కలవాడు అనే అర్ధాలు ఉన్నాయి. విజయనగర రాజుల మలిరాజధానిగా చంద్రగిరి ఉండేది కనుక మరికొంత పరిశోధన చేస్తే ఆనాడు సోఢవారి పాత్ర ఏమిటనేదీ వెల్లడవుతుంది.