పోలింగ్ కేంద్రాల నిర్వహణ బోలెడు ఖర్చుతో కూడుకొన్న వ్యవహారం
బురుజు.కాం Buruju.com శాసన సభ్యులు తమ పదవీ కాలంలో మృతి చెందినప్పుడు మాత్రమే గతంలో ఆయా స్థానాల్లో ఉప ఎన్నికలు ఉత్పన్నమయ్యేవి . అటువంటిది.. ఇప్పుడు పార్టీల బల ప్రదర్శనకు ఉప ఎన్నికలు వచ్చిపడుతున్నాయి . రాజకీయ నాయకుల ప్రకటనలను చూస్తుంటే.. భవిష్యత్తులో ఇటువంటి పోకడలు మరింత ఉద్ధృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయా పార్టీలు ఇష్టానుసారంగా ప్రకటిస్తున్న ఉచిత పథకాలపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ మొదలైనట్టుగానే.. ఉప ఎన్నికలపైనా అర్ధవంతమైన చర్చ జరగాలి. రాజకీయ పార్టీల బలప్రదర్శనల కోసం అనివార్యమవుతున్న ఉప ఎన్నికలకు.. ప్రజా ధనాన్ని ఖర్చుపెట్టటం ఎంత వరకు సమంజసమో కేంద్ర ఎన్నికల సంఘం సమాధానమివ్వాలి.
సీటు కోసం అన్ని పార్టీలు సొమ్మును వెదలజల్లాల్సిందే
ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గతంలో అధికార పార్టీకి విజయావకాశాలు మెండుగా ఉండేవి. పాలనా పగ్గాలు గల పార్టీకి ఆర్థిక అండదండలతో పాటు అధికార యంత్రాంగమంతా చేతుల్లో ఉంటుంది కనుక ప్రత్యర్ధులను ముప్పుతిప్పలు పెట్టేందుకు వీలయ్యేది. దీంతో ఉప ఎన్నికలు అంటే ప్రత్యర్ధులు భయపడేవారు. ఉప ఎన్నికల్లో అధికార పార్టీయే నెగ్గగలుగుతుందనే వాదనలు ఇటీవల కాలంలో నీరుగారుతున్నాయి. తెలంగాణను తీసుకొంటే.. సిటింగ్ ఎమ్మెల్యే మృతి కారణంగా అనివార్యమైన సిద్దిపేట జిల్లా దొమ్మాట ఎన్నికలోను, రాజకీయ కారణాలతో ఉత్నన్నమైన కరీంనగర్ జిల్లా హుజారాబాదు ఎన్నికలోను అధికార పార్టీ అభ్యర్ధులను భారతీయ జనతా పార్టీ ఓడించగలిగింది. అధికార పార్టీవారి పాలనా తీరు ప్రజా రంజకంగా లేనప్పుడు ప్రతిపక్షాలు పుంజుకోవటం సహజం. రెండు ఉప ఎన్నికల్లో విజయం ఊపుతో ఉన్న భాజపాకు ఇప్పుడు అటువంటి ఎన్నికలంటే మరింత మక్కువ ఏర్పడినట్లుంది. అందువల్లనే.. తాజాగా నల్గొండ జిల్లా మునుగోడులో ఉప ఎన్నికలకు ఉవ్విళ్లూరుతోంది. అక్కడి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటం, రాజీనామాను స్పీకరు వెంటనే ఆమోదించటం చకాచకా జరిగిపోయాయి. అక్కడ తిరిగి రాజగోపాల రెడ్డే పోటీ చేయబోతున్నారు. ఇప్పుడు మాత్రం ఆయన భాజపా నుంచి బరిలోకి దిగుతారు. అంటే కేవలం రాజకీయ క్రీడ కోసమే మునుగోడు ఉప ఎన్నిక చోటు చేసుకొంటోంది.
ఉప ఎన్నిక అంటూ జరిగిన చోటనే ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తోందని , అందువల్ల ఇంతవరకు పాలక పక్షం నిర్లక్ష్యానికి గురైన మునుగోడు.. ఇప్పటికైనా అభివృద్ధి చెందుతుందని రాజగోపాల రెడ్డి అంటున్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాదు ఉప ఎన్నికల సమయంలో ప్రభుత్వం దళిత బంధు కార్యక్రమాన్ని చేపట్టటం వల్లనే ఆయన ఇలా అనగలుగుతున్నారు. మరిన్ని ఉప ఎన్నికలకూ అవకాశాలు లేకపోలేదని భాజాపా నాయకులు అంటున్నారు. మరో వైపు.. మునుగోడులో అసలు ఉప ఎన్నికలు ఎందుకొచ్చాయో ప్రజలకు వివరించి చెప్పాలని తెరాస అధిష్ఠానం యోచిస్తోంది. అంటే ఇప్పుడు ఎన్నికలకు వెళ్లటం సరికాదన్నది అధికార పార్టీ భావన. మునుగోడు నియోజకవర్గం ఇంతవరకు కాంగ్రెస్ ఖాతాలో ఉన్నందునే ఆ పార్టీ అగ్రనాయకత్వం ఇటువంటి యోచనకు వచ్చొండొచ్చు. మునుగోడు ఉప ఎన్నికకు అధికార పార్టీ సన్నిద్దతపై భాజపా కేంద్ర కార్యవర్గ సభ్యుడు ఇంద్ర సేనా రెడ్డికి అనుమానం వచ్చింది కాబోలు.. మునుగోడు ఉప ఎన్నికకు బదులు తెలంగాణలో ఏకంగా ముందస్తు ఎన్నికలే జరగవచ్చని వ్యాఖ్యానించారు. ముందస్తు ఎన్నికలు అంటూ అసెంబ్లీకి మాత్రమే జరిగితే మళ్లీ త్వరలోనే పార్లమెంటు ఎన్నికలకూ సిద్ధంకావాల్సివుంటుంది. అంటే ఖర్చు రెట్టింపు అవుతుంది
రాజకీయ కారణాలతో ఉత్పన్నమయ్యే ఉప ఎన్నికలకు తాను పెట్టే ఖర్చుపై కేంద్ర ఎన్నికల సంఘం చర్చను మొదలు పెట్టాలి
ఎన్నికల సంఘం తాజా సవరణ ప్రకారం.. తెలంగాణలోని ఒక్కో అసెంబ్లీ అభ్యర్ధి గరిష్టంగా రూ.40 లక్షలు ఖర్చుపెట్టుకోవచ్చు. ఎన్నికల సంఘం నిర్ధిశించిన పరిమితులు కేవలం కాగితాలకే పరిమితం. ఆయా పార్టీలు భారీగా ఖర్చుపెట్టాల్సివుంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఆయా పార్టీలు ఉప ఎన్నికలు, ముందస్తు ఎన్నికలంటూ ముందుకు ఉరుకుతున్నాయంటే వాటి వద్ద ఎంతటి ఆర్థిక వనరులు ఉన్నదీ గ్రహించవచ్చు. ఉప ఎన్నికలు జరిగే చోట ప్రభుత్వం అమలు చేసే పథకాల మాటెలా ఉన్నప్పటికీ.. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ప్రభుత్వం ఆయా నియోజకవర్గాల్లో ఎటువంటి కొత్త కార్యక్రమాలను చేపట్టనే కూడదు.