తెలుగు రాష్ట్రాలు మినహా.. పలు రాష్ట్రాల ఉద్యోగులకు వెంటవెంటనే డీఏ
personBuruju Editor date_range2023-01-24
పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను ఎదొర్కొనటానికి ఇచ్చే కరవు భత్యాన్ని.. పండగ, నూతన సంవత్సర కానుకలని పాలకులు ప్రకటించటం ఇటీవల పరిపాటయ్యింది
బురుజు.కాం Buruju.com : ప్రభుత్వ ఉద్యోగుల కరవు భత్యాన్ని(డీఏ) పలు రాష్ట్రాలు వెంటవెంటనే మంజూరు చేస్తుండగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తీవ్ర జాప్యం చోటు చేసుకొంటోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడు డీఏలను.. తెలంగాణ ప్రభుత్వం మూడు డీఏలను ఇవ్వాల్సివుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఏను కొద్ది రోజుల పాటు ఆలస్యం చేస్తే రోడ్ల పైకి వచ్చి ధర్నాలను సైతం చేసిన ఉద్యోగ సంఘాలు.. ఇప్పుడు మాత్రం వేడికోళ్లకే పరిమితమవుతుండటం విశేషం. దీంతో.. ప్రభుత్వం తలచుకొన్నప్పుడు మాత్రమే డీఏను మంజూరు చేసే విధానం తెలుగు రాష్ట్రాల్లో అలవడింది.
డీఏ బకాయిలపై ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశంలో ప్రస్తావిస్తున్న ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి
నిత్యావసర వస్తువుల ధరలు (ద్రవ్యోల్భణం) పెరుగుతూ ఉంటాయి కనుక అందుకు ధీటుగా ఏటా జనవరి, జూలై నెలల్లో ఉద్యోగులకు అందజేసేదే కరవు భత్యం. వీరితో పాటుగా విశ్రాంత ఉద్యోగులకు ఇచ్చేది డీఆర్. కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ఏటా జనవరి, జూలై నెలల డీఏ శాతాన్ని ప్రకటించగానే అన్ని రాష్ట్రాలు దాన్ని అనుసరిస్తాయి. తెలుగు రాష్ట్రాల వేతన సవరణ సంఘాలు ప్రతి అయిదేళ్లకోసారి వేతనాలను పెంచుతుంటాయి కనుక ఇక్కడ ఇచ్చే డీఏ కేంద్రం ప్రకటించిన శాతానికంటే కాస్త తక్కువగా ఉంటుంది. పెరిగిన ధరలను తట్టుకోవటానికి అందజేసే డీఏను కూడా ఇప్పుడు ప్రభుత్వాలు ఏదో దయతలచి ఇస్తున్నట్టుగా పరిగణిస్తుండటం విశేషం.
ద్రవ్యోల్భణం పెరుగుదలలో గత కొన్ని నెలలుగా తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. తదుపరి స్థానాల్లో ఏపీ నిలుస్తోంది. అందువల్ల నైనా ఇక్కడ డీఏను వేగంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది
తెలంగాణ ప్రభుత్వం 2021, జూలై నెల డీఏను 2023, జనవరి 23వ తేదీన ప్రకటించింది. అంటే.. ఇంకా 2022లోని జనవరి, జూలై డీఏలను, కేంద్ర ప్రకటించిన తర్వాత 2023 జనవరి డీఏ కలిపి మొత్తం మూడు డీఏలను ఇక్కడ ఇవ్వాల్సివుంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. ఇక్కడ డీఏల బకాయిలు మరీ ఆందోళన కలిగించే రీతిలో ఉన్నాయి. మొత్తం ఏడు డీఏల సొమ్ము ఉద్యోగులకు రావాల్సివుంది. వీటిలో నాలుగు డీఏలను పీఆర్సీసి వేతన స్థిరీకరణ సమయంలో కలిపినట్టుగా ప్రభుత్వం చెప్పినప్పటికీ.. అవి ఇంతవరకు ఉద్యోగుల ఖాతాల్లో జమకాలేదని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ‘బురుజు’ ప్రతినిధికి తెలిపారు. డీఏ బకాయిలపై ఆయన ఇటీవల శాసన మండలిలో ప్రశ్నించినా ఫలితం లేకుండా పోయింది. కరవు భత్యాన్ని తెలంగాణ ప్రభుత్వం జాప్యం లేకుండా ఇవ్వాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం ఛైర్మన్ ఎ.పద్మాచారి పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యోగుల సంఘం గౌరవ ఛైర్మన్ ఎ.పద్మాచారి
తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ.. ఇతర రాష్ట్రాలు మాత్రం డీఏ, డీఆర్ లను వెంటవెంటనే ఇస్తూ ఉద్యోగులను , విశ్రాంత ఉద్యోగులను సంతోష పరుస్తున్నాయి. కేంద్రం తన ఉద్యోగులకు 2022, జూలై నెల డీఏను అదే ఏడాది సెప్టెంబరులో ప్రకటించగా.. ఆ మరుసటి నెలలోనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ .. అక్కడి ఉద్యోగులకు మంజూరీ ఉత్తర్వులను వెలువరించారు. కేంద్రం ప్రకటించాక ప్రస్తుత 2023, జనవరి డీఏను ఇవ్వాల్సివుంటుందే తప్ప పాత డీఏల బకాయిలేవీ అక్కడ లేనేలేవు. కర్నాటక కూడా అక్టోబరులోనే డీఏను అందజేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. 2022, జూలై ఏడీను డిసెంబరులో అందజేశారు. ఇంకా.. ఒడిశా, హర్యానా, రాజస్థాన్, దిల్లీ, పంజాబ్ తదితర రాష్ట్రాలూ కేంద్ర ప్రకటన వెలువడిన కొద్ది రోజులకే డీఏలను ఇచ్చాయి ( ఇంకా ఉంది)