డాక్టరు గారు.. నితిన్ సార్ మాదిరిగా మందుల చీటీని రాయరూ..
personBuruju Editor date_range2022-11-06
కేరళ వైద్యుడు నితిన్ నారాయణన్.. ఆణి ముత్యాలు వంటి అక్షరాలతో ఆయన రాసిన మందుల చీటి
బురుజు.కాం Buruju.com : తెలుగు రాష్ట్రాల్లోని వైద్యులు ఇప్పుడు కేరళలోని ప్రభుత్వ వైద్యుడు నితిన్ నారాయణన్ ను ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన రాసే మందుల చీటీలోని అక్షరాలు ఆణి ముత్యాల్లా.. సామాన్య రోగికి సైతం స్పష్టంగా అర్ధమవుతాయి. దీంతో.. మందుల షాపుల్లో పొరపాటుగా.. ఒక ఔషధానికి బదులుగా మరొకదాన్ని ఇచ్చేయటమనేదే ఉత్పన్నంకాదు. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం.. వైద్యుల్లోని అత్యధిక మంది రాసి ఇచ్చే మందుల చీటీల్లోని అక్షరాలు.. ఆయా వైద్యుల సొంత మందుల షాపుల వారికి తప్ప ఇతరులకు అంత సులువుగా అర్ధం కావు. డాక్టరు రాసింది పలానాది కావచ్చని ఊహించి ఇచ్చిన మందు వికటించటంతో ఇటీవల కడప జిల్లా రాజంపేటలోని నర్సమ్మ అనే మహిళ ప్రాణాలను కోల్పోయింది. మందుల పేర్లను ఆంగ్ల క్యాపిటల్ అక్షరాల్లో స్పష్టంగా రాయాలంటూ న్యాయస్థానాలు స్పష్టం చేసి ఏళ్లు గడుస్తున్నా.. మన తెలుగు వైద్యుల ధోరణిలో మార్పేకనిపించటంలేదు.
కేవలం మందుల పేర్లను స్పష్టంగా రాసినందుకు ఇలా టీవీ రిపోర్టరు ఇంటర్వ్యూ చేస్తున్నారంటే దేశంలోని మందుల చీటీలు ఎంత అధ్వాన్నంగా ఉంటున్నదీ తేటతెల్లమవుతోంది
కేరళలోని పాలక్కడ్ సామాజిక వైద్య కేంద్రంలో చిన్న పిల్లల వైద్యుడైన నితిన్ నారాయణన్ Nitin Narayanan.. ఎండీ చేశారు. పిల్లలను పరీక్షించిన తర్వాత తన పేరుతో గల చీటిపై మందుల పేర్లను ఆయన చాలా పొందికగా రాస్తుంటారు. ఇటీవల సోషల్ మీడియాలో ఆయన మందుల చీటీ బాగా ప్రచారంలోకి వచ్చింది. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. వైద్యులు రాసే మందుల పేర్లను తెలుసుకొనేందుకు దుకాణాల్లోని సిబ్బంది కంప్యూటర్లతో కుస్తీ పడుతుంటారు. మందుల పేర్లలోని తాను కనుగొన్న అక్షరాలను కంప్యూటరులో నమోదు చేసి.. అక్కడ ప్రత్యక్షమయ్యే పేరు ఆధారంగా మందును అందజేస్తుంటారు. కార్పోరేట్ కంపెనీల మందుల షాపుల్లోను ఇదే పరిస్థితి. కడప జిల్లా రాజంపేట సంఘటనను పరిశీలిస్తే.. మందుల చీటిలో వైద్యుడు రాసింది ‘యాంటీ థైరాక్సిన్ 10 ఎంజీ’. రోగికి మందుల షాపులో అమ్మింది మాత్రం‘ థైరాక్సిన్ సోడియం 100 ఎంజీ.’ ఔషధం మొతాదు మరీ ఎక్కువై పోవటంతో రోగి ప్రాణాలను కోల్పోవలసివచ్చింది. తాను ఎంత పనివత్తిడిలో ఉన్నప్పటికీ.. మందుల పేర్లను మాత్రం స్పష్టంగా రాయటం అలవర్చుకొన్నానని నితిన్ నారాయణన్ పేర్కొన్నారు.
ఇలా నిలబడి గబగబా.. గొలుసుకట్టు అక్షరాలతో రాసి ఇచ్చే చీటీల్లోని అక్షరాలు అర్ధంకాక.. ఒక్కో సారి ఆనేక మందుల షాపులను తిరగాల్సివస్తోంది
మందుల పేర్లను పొడి అక్షరాల్లో.. అదీ జనెటిక్ పేర్లను రాయాలంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్, కేంద్ర వైద్య మండలి దాదాపు ఏడేళ్ల క్రితం రాష్ట్రాలకు సూచనలు చేశాయి. వైద్యుల రాతలపై దాదాపు ఏడేళ్ల క్రితం నల్గొండకు చెందిన చిలుకూరి పరమాత్మ అనే ఆయన అప్పట్లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేయటంవల్లనే ఇటువంటి ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో.. తెలంగాణ వైద్య విద్య డైరక్టరేట్ కూడా పొడి అక్షరాలను రాయలంటూ ప్రభుత్వాసుపత్రుల వైద్యులకు సూచించింది. కోర్టులోని వాజ్యం నుంచి బయటపడేందుకు అప్పటికప్పుడు ఇలా ఉత్తర్వులైతే జారీ అయ్యాయేతప్ప.. వైద్యులు పొడి అక్షరాలను రాస్తున్నదీ లేనిది ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అధికారులు ఇంతవరకు పరిశీలించిన దాఖలాలైతే లేవు. ఏదైనా దుకాణానికి వెళ్లి పది నిముషాలు సేపు నిలబడ్డా విషయం ఇట్టే తెలుస్తుంది. మందులను వినియోగించేవారంతా ప్రత్యేకంగా రోగుల సంఘాలను ఏర్పాటు చేసుకొని వత్తిడి చేస్తే తప్ప ఉభయ రాష్ట్రాల్లోని ప్రభుత్వాల్లో చలనం వచ్చేలా కనిపించటంలేదు.