భక్త రామదాసు శాసనాన్ని ఎందుకు ధ్వంసం చేసినట్టు? ( రెండో భాగం)
personBuruju Editor date_range2022-10-27
భద్రాచలం ఆలయం
బురుజు.కాం Buruju.com : ( భక్త రామదాసుగా పేరు పడ్డ కంచర్ల గోపన్నకు సంబంధించిన వాస్తవ విషయాలను తెలుసుకోవటానికి పరిశోధనలను చేపట్టాల్సిన అవసరం ఉంది. ఆయన గోల్కొండ కోటలోని బంధీఖానా నుంచి విడుదలైనట్టుగా చెబుతున్నప్పటికీ.. ఆ తర్వాత ఆయన ఉనికిని తెలియజేసే ఆధారాలేవీ ఇంతవరకు వెల్లడికానందునే ఒక్కో చరిత్రకారుడు ఆయన గురుంచి ఒక్కో రకంగా రాస్తూ వచ్చారు. భక్త రామదాసుకు సంబంధించి కొంగ్రొత్త విషయాలతో Buruju.com అందిస్తున్న కథనాల్లో ఇది రెండోవది) రామదాసు చారిత్రకతను తెలుసుకొనేందుకు 1920లో భద్రాచలం ఆలయంలో కొంత పరిశోధన చేసిన నాటి పురావస్తు శాఖ అధికారి వెంకోబారావు.. తన నివేదికలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. దాదాపుగా 1832 ప్రాంతంలో.. భద్రాద్రి రాముడికి సేవలు చేసేందుకు కంచి నుంచి కుటుంబ సమేతంగా వచ్చి.. భద్రాచలంలో స్థిర నివాసం ఏర్పరచుకొన్న వరద రామదాసుకు చెందిన సమాచారం మాత్రమే అప్పట్లో ఆయనకు లభించింది. వరద రామదాసు పేరుతో గల ఒక శాసనం ఆయనకు కనిపించింది. అప్పటికే అక్కడ ఒక పాత శాసనం ధ్వంసమయ్యిందనే సంగతిని వరద రామదాసు పేరుతో గల శాసనం తెలియజేసింది.
భక్త రామదాసు , వరద రామదాసు పేర్లు దాదాపుగా ఒకేరీతిలో ఉండటంతో పాటు.. వారి భక్తి, ఉద్యోగం వంటి ఘట్టాలూ ఒకే మాదిరిగా ఉండటం వల్ల కొంత గందరగోళం కూడా నెలకొంటోంది
పాత శాసనంలోని అక్షరాలను ధ్వంసం చేసినవారు, వారి కుటుంబ సభ్యులు నాశనం అయిపోయినట్టుగా అదే పాత శాసనంపై వరద రామదాసు తిరిగి రాయించారు. ఎవరు? ఎందువల్ల పాత శాసనాన్ని ధ్వంసం చేసిందీ దానిలో ఆయన పేర్కొనలేదు. నిజాం పాలనలో అనేక గ్రామాల నుంచి వచ్చే బహుమతులను వరద రామదాసు స్వీకరించేవారని శాసనంలో ఉంది. రాముడి కైంకర్యాల గురించీ దానిలో వివరించారు. తొలి శాసనంపైన అక్షరాలు ధ్వంసం కావటం వల్ల భక్త రామదాసు (కంచర్ల గోపన్న) గురించి ప్రజలకు తెలిసే అవకాశం లేకుండా పోయిందని పురావస్తు శాఖ అధికారి వెంకోబారావు తన నివేదికలో వాపోయారు. పాత శాసనాన్ని భక్త రామదాసు రాయించినట్టుగా భావించినట్లైతే.. అది భద్రాచలానికి వరద రామదాసు రావటానికి 180 ఏళ్ల ముందే జరిగి ఉండాలి.
రామదాసు చెరశాలగా ప్రచారంలో ఉన్న గొల్కొండలోని సామాగ్రిని భద్రపర్చే గది
పురావస్తు శాఖ అధికారి వెంకోబారావు తన నివేదిలో ఇలా రాశారు.. ‘‘ వరద రామదాసు తాను భక్త రామదాసు అవతారంగా భావిస్తూ.. కంచి నుంచి కుటుంబ సమేతంగా భద్రాచలానికి వచ్చారు. ఆయన, ఆయన భార్య తమ నగలు, సొమ్మునంతటినీ ఆలయానికి ఇచ్చారు. కుటుంబంలోని మహిళా సభ్యులు.. ఆలయాన్ని శుభ్రపరస్తూ ఉంటే రాముడిపై వరద రామదాసుతో సహా మగవారంతా పాటలు పాడుతుండేవారు. నాటి నసరుదౌల సంస్థానంలోని ప్రముఖుడైన చందూలాల్ సిఫార్సుతో హసనాబాద్ పరగణం పాలన బాధ్యతలు వరద రామదాసుకు లభించాయి. హసనాబాద్ ఆదాయం బ్రాహ్మణ గ్రామాలు తప్ప మిగతా వాటి నుంచి రూ. 71వేలు కాగా అందులో రూ.32వేలు సర్ధారుకు ఇచ్చి మిగతా మొత్తాన్ని ఆలయానికి వినియోగించేవారు. ఇటువంటి విషయాలు రాతి శాసనంలో నమోదయ్యాయి’’ అని ఆయన వెల్లడించారు ( నివేదికలోని మరికొన్ని వివరాలు వచ్చేవారం Buruju.comలో )