తెలంగాణలో అత్యధిక ద్రవ్యోల్భణానికి డీజిల్ పన్నే కారణం?
personBuruju Editor date_range2022-11-23
బజారులో విక్రయించే ప్రతి వస్తువు డీజిల్ తో నడిచే వాహనాలపై రావాల్సిందే . అందువల్లనే.. వస్తువుల ధరలపై డీజిల్ ధర ప్రభావాన్ని చూపిస్తుంది
Buruju.com బురుజు.కాం : దేశం మొత్తం మీద ప్రతి నెలా తెలంగాణలోనే అత్యధిక ద్రవ్యోల్భణం inflation నమోదవుతోంది. ఆర్థిక రంగ నిపుణుల విశ్లేషణలను బట్టి చూస్తే.. ఇక్కడ డీజిల్ పై అత్యధికంగా.. 27 శాతం మేర వ్యాట్ విధిస్తుండటం అధిక ద్రవ్యోల్భణానికి ఒక ప్రధాన కారణం. అధిక పన్ను వల్ల.. డీజిల్ ధర మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువయ్యి.. వస్తువుల రవాణా ఖర్చులు తడిసిమోపుడవుతున్నాయి. దీంతో.. పప్పుదినుసులు, కూరగాయలు , చేపలు, మాంసం తదితరాలన్నీ వినియోగదారుడికి చేరే సరికి వాటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
పెట్రోలియం కంపెనీలు 2021-22లో తెలంగాణలో అమ్మిన పెట్రోల్ , డీజిల్ పై వ్యాట్ రూపేణా ప్రభుత్వానికి రూ.13,171 కోట్లను చెల్లించాయి
ఒక వస్తువు ప్రస్తుత నెల ధరతో.. గత ఏడాది ఇదే నెలలోని ధరను పోల్చి ఎంత్తైతే పెరుగుదల ఉంటుందో దాన్ని ద్రవ్యోల్భణంగా పరిగణిస్తారు. ఆయా రాష్ట్రాల్లోని ధరల పెరుగుదల అంచనాకు ద్రవ్యోల్భణం రేటు ఒక కొలబద్దగా ఉంటుంది. కేంద్ర గణాంకాల శాఖ తాజా వివరాల ప్రకారం.. 2022, అక్టోబరు నెలలో ద్రవ్యోల్భణం తెలంగాణలో 8.82 శాతంగా నమోదయ్యింది. అంటే.. గత ఏడాది అక్టోబరులో రూ.100కు లభించిన వస్తువుకు ఇప్పుడు రూ.108.82 చెల్లించాల్సివస్తోంది. దేశంలోని మరేఇతర రాష్ట్రాల్లోను ఇంతటి స్థాయిలో ధరలు పెరగలేదు. దేశం సగటు ద్రవ్యలోల్భణం రేటు 6.77 మాత్రమే ఉంది. టోల్ ప్లాజాలు ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడి పన్నులూ ధరలపై ప్రభావాన్ని చూపిస్తాయి.
ద్రవ్యల్భోణం పెరుగుతున్నప్పుడు సగటు జీవి విలవిల్లాడాల్సిందే
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. అక్కడి 2022, అక్టోబరు ద్రవ్యోల్భణం 7.93 శాతంగా ఉంది. ఇక్కడ డీజిల్ పన్ను రేటు తెలంగాణ అంతటి స్పష్టంగా కాకుండా గజిబిజిగా ఉంటుంది. అదెలా అంటే.. ప్రతి లీటరు డీజిల్ పైనా 22.25 శాతం వ్యాట్, దీనికి అదనంగా మరో నాలుగు రూపాయాలు , అదనంగా మరో రూపాయి రోడ్డు సెస్సు, విదేశాలకు వస్తువులను తీసుకెళ్లే ఓడలకైతే ప్రతి లీటరు డీజిలుపైన మరో 0.5 శాతం వ్యాట్ ఇక్కడ రాబడుతున్నారు. ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు డీజిల్ పై విధిస్తున్న వ్యాట్ ను కొంత తగ్గిస్తే ఆమేరకు ద్రవ్యోల్భణం తగ్గే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో ప్రతి లీటరు డీజిల్ పైనా ఒక రూపాయిని రోడ్లను బాగు చేయటానికి తీసుకొంటున్నారు. మళ్లీ టోల్ గేట్ల వద్దా రుసుములు వసూలు చేస్తున్నారు. ఇవన్నీ ధరలపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి