గిడుగు రామమూర్తి వద్దా అవే సెక్సు పుస్తకాలు! ( రెండవ భాగం)
personSai Kumar Pilla date_range2022-08-29
గురజాడ అప్పారావు, ఆయన మిత్రుడు గిడుగు రామమూర్తి.. ఇద్దరూ హవెలాక్ ఎల్లీస్ పుస్తకాలను చదివారు. అంతేకాకుండా.. వాటిలోని అంశాలకు అనుగుణంగా మనషుల ప్రవర్తలనూ అధ్యయనం చేశారు. ఇటువంటి అధ్యయన అంశాలు గురజాడ రచనలకు ఉపకరించాయి
పిళ్లా సాయికుమార్ Buruju.com : ( గురజాడ ఇంటిని ప్రభుత్వం 1989లో స్వాధీనం చేసుకొన్న సమయంలో హవెలాక్ ఎల్లీస్ రాసిన ఆరు సెక్సు పుస్తకాలు బయటపడ్డాయి. ఇలా సెక్సు పుస్తకాలు దొరకటం తప్పు పట్టాల్సిన విషయమేమి కానప్పటికీ.. అప్పట్లో గురజాడ మనవడు మాత్రం విషయాన్ని వెల్లడించిన ఈనాడు విలేకరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాత గారి పరువు తీశారంటూ ఆగ్రం వ్యక్తం చేశారు. ఆసక్తిని కలిగించే నాటి పరిణామాలను పేర్కొంటూ.. గురజాడ సెక్సు పుస్తకాలను చదివే వాడా? అనే శీర్షికతో మొదటి భాగం ఇప్పటికే బురుజు.కాంలో వెలువడింది) మహాకవి గురజాడ అప్పారావు వద్ద లభించిన సెక్సు పుస్తకాలు.. గురజాడ మిత్రుడు, తెలుగు వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడు అయిన గిడిగు రామమూర్తి పంతుల వద్ద కూడా ఉండేవా? గిడుగు రామమర్తి తన అభిమానులతో ముచ్చడించేటప్పుడు ఒక సందర్భంలో సెక్స్ అంశాలపైనా మాట్లాడుతూ.. సరిగ్గా గురజాడ వద్ద గల పుస్తకాలను రాసిన రచయిత హవెలాక్ ఎల్లీస్ పేరును ప్రస్తావించారు. ఎల్లీస్ రాసిన పుస్తకాలను తాను చదివానని చెప్పారు.
విజయనగరంలో నేను ‘ఈనాడు’ ప్రతినిధిగా ఉంటూ 1989లో రాసిన కథనం గురజాడ అప్పారావు మనవడైన గురజాడ అప్పారావుకు ( ఇద్దరి పేర్లూ ఒక్కటే) ఆగ్రహం తెప్పించటంతో.. అసలు ఆ సెక్సు పుస్తకాలు మహాకవికి ఎలా వచ్చిందీ తెలుసుకోవటానికి ప్రయత్నిస్తూ వచ్చాను. ఇటువంటి క్రమంలో. . ఇటీవల భారతి మాస పత్రిక 1940, మార్చి నెల సంచికను పరిశీలిస్తున్నప్పుడు.. దానిలోని ‘గిడుగు రామమూర్తి పంతులు.. నా అనుభవాలు’ అనే శీర్షికతో గల వ్యాసం ఒకటి కనిపించింది. దీనిని శ్రీనివాస శిరోమణి రాశారు. ఒకసారి గిడుగు రామమూర్తిని .. రాజమండ్రిలో తాను, తన మిత్రుడు శివశంకర శాస్త్రి కలిశామంటూ ఆ రోజునాటి ముచ్చట్లను శ్రీనివాస శిరోమణి తన వ్యాసంలో పొందుపర్చారు. ‘‘ఆ రోజున గిడుగు రామమూర్తి గారు .. వ్యాకరణంపై అదే పనిగా మాట్లాడుతుండటంతో మా ఇద్దరికి విసుగొచ్చి.. ఆయన్ని సెక్సు విషయాలవైపునకు మళ్లించాం. దీంతో ఆయన సెక్సు విషయాలను అందుకొన్నారు. ఇంగ్లీషులోని హవెలాక్ ఎల్లీస్ రాసిన పుస్తకాలను తాను చదివానని, ఇంకా అయివాన్ బ్లాకు, క్రాప్టు యెల్బింగ్ రాసిన సెకో పాతియా, సెక్స్ యాలిస్ చదివానని, ఆయా రచయితలు తమ పుస్తకాల్లో చెప్పిన విషయాలు ఎంతవరకు వాస్తవమో తెసుకొనేందుకు తాను మనష్యులను పరిశీలిస్తూ వచ్చానని గిడుగు రామమూర్తి మాకు చెప్పారు’’ అని శ్రీనివాస శిరోమణి తన వ్యాసంలో వివరించారు. ఆయా రచయితలు రాసిన విషయాలు చాలా వరకు అనుభవంలోకి వచ్చాయనీ గిడుగు వివరించినట్టుగా రాశారు.
హవెలాక్ ఎల్లీస్ రాసిన సెక్సు పుస్తకాలను చదివానంటూ గిడుగు రామమూర్తి చెప్పినట్టుగా 1940 , ఫిబ్రవరి నెల భారతి మాసపత్రికలో శ్రీనివాస శిరోమణి రాసిన వ్యాసం ఇదే
విజయనగరంలో గురజాడ కుమారుడు రామదాసు వేరేవారికి అమ్మేయగా 1989లో ప్రభుత్వం రూ.5వేలను చెల్లించి స్వాధీనం చేసుకొన్న 128 పుస్తకాల్లో.. హవెలాక్ ఎల్లీస్ రాసినవి ఆరు ఉన్నాయి. అంటే వ్యవహారిక భాష ఉద్యమ కారుడు గిడుగు రామమూర్తి .. గురజాడ అప్పారావు ఇద్దరూ హవెలాక్ ఎల్లీస్
సెక్సు పుస్తకాలను చదివినట్టు స్పష్టమవుతోంది. మానవ లైంగికతపై వివిధ కోణాల్లో విశ్లేషించిన రచయితగా ఎల్లీస్ కు అప్పట్లో మంచి గుర్తింపు ఉండేది. ఇప్పటికీ ఆయన రచనలకు ఆదరణ ఉంది. ఎల్లీస్ రాసిన పుస్తకాలను ఇద్దరూ తెప్పించుకొన్నారా? లేక ఒకరి నుంచి మరొకరికి వెళ్లాయా? అనేది తెలియదు. బాల్యం నుంచీ గిడుగు రామమూర్తి , గురజాడ అప్పారావు మంచి స్నేహితులు. ఇద్దరూ విజయనగరం పాఠశాలలో చదువుకొన్నారు. ఇద్దరూ ఒకే సారి మెట్రిక్యులేషన్ లో ఉత్తీర్ణులయ్యారు. చరిత్రను చదవటం, శాసనాలను చదివి పరిష్కరించటం అంటే ఇద్దరికీ మక్కువే.
మానవ లైంగికత అంశాలపై పలు పుస్తకాలను రాసిన హవెలాక్ ఎల్లీస్
ఉద్యోగ రీత్యా గురజాడ విజయనగరంలోను, గిడుగు.. శ్రీకాకుళం జిల్లా సరిహద్దులోని పర్లాకిమిడిలోను నివాసముంటూ.. తరచు కలుసుకొనేవారు. గిడుగు 48 ఏళ్ల పాటు ఉపాధ్యాయునిగా పనిచేసి.. పదవీ విరమణ చేశాక.. విజయనగరం సంస్థానంలోని రాజకుటుంబీకులకు కొంత కాలం పాటు పాఠాలు చెప్పారు. తాను సెక్సు పుస్తకాలను చదివి.. వాటిలోని విషయాలకు అనుగుణంగా మనుష్యులను పరిశీలించేవాడినని గిడుగు రామమూర్తి .. రాజమండ్రీలోని తన అభిమాని శిఖామణికి వెల్లడించగా.. మరో సందర్భంలో వేరేవారి వద్ద గురజాడ అప్పారావూ ఇటువంటి వ్యాఖ్యలే చేయటం గమనార్హం. అందుకే.. రచయిత, సినీ కవి ఆరుద్ర తన ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ నాలుగో సంపుటిలో ఇలా రాశారు.… ‘‘ఆనందగజపతి మహారాజా వారి సొంత నౌఖరిలో ఉన్న భోగం పాపలందరినీ అప్పారావు చాల నిశితంగా పరిశీలించేవారు. వారి కళ్లల్లోనే వారి శీలాన్ని చదవటానికి ప్రయత్నించేవారు. ఇటువంటి సంగతులు ఇతరులకు తెలియకూడదని ఆయన తాపత్రయపడేవారు’’ అని విశ్లేషించారు( మూడో భాగం వచ్చేవారం)