మేజర్ సినిమాలో సందీప్ ఉన్నికృష్ణన్ గా నటించిన అడవి శేషు, తల్లితండ్రులుగా ప్రకాశ్ రాజ్, రేవతి
బురుజు.కాం Buruju.com : దేశభక్తిని ప్రభోదించే సినిమాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ రాయితీలను ప్రకటించాలి. ఇలా చేస్తే.. ఆ మేరకు టిక్కెట్ల ధరలు తగ్గి ప్రేక్షకులు అటువంటి సినిమాలను బాగా ఆదరించగలుగుతారు. కేవలం థియేటర్లకు మాత్రమే కాకుండా.. అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ వేదికలకు సైతం ఇటువంటి రాయితీలు వర్తించేలా ప్రభుత్వాలు ఏర్పాట్లు చేయాలి. జీఎస్టీ రాయితీకి అర్హమైన చిత్రంగా ఇటీవల విడుదలయ్యి.. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్న ‘మేజర్’ సినిమాను చెప్పుకోవచ్చు. ముంబాయిలో.. 2008, నవంబరు 26వ తేదీన పాకిస్తాన్ ముష్కరులు తాజ్ మహలు హోటల్ తో సహా వివిధ ప్రాంతాల్లో విద్వంసం సృష్టించి.. ఊచకోతలకు పాల్పడ్డారు. అటువంటి సమయంలో.. అత్యంత ధైర్య సాహసాలతో వారిని ఎదుర్కొని నేలకొరిగిన యువ కిశోరం మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత గాథే ఈ చిత్రం. తెలుగుతో పాటు హిందీలోను ఇది విడదలయ్యి ప్రేక్షకాదరణ పొందింది.
సందీప్ ఉన్నికృష్ణన్ , ఆయన తల్లితండ్రులు
ప్రముఖ కథా రచయిత అడవి బాపిరాజు మనవుడైన అడవి శేషు.. మేజర్ ఉన్నికృష్ణన్ గా అద్భుతంగా నటించాడు. ఉన్నికృష్ణన్ బాల్యం మొదలు కొని ప్రేమ, మిలట్రీలోకి ప్రవేశం తదితర అంశాలను దీనిలో చక్కగా చూపించారు. యుద్ధ వాతావరణం అలుముకొన్నప్పుడు శతృ మూకలను చీల్చిచెండాలని యువ సైనికులు ఉవ్విళ్లూరతారు. పాకిస్థాన్ సేనలు 1999లో కార్గిల్ వైపునకు చొచ్చుకొచ్చినప్పుడు మన యువకిశోరాలు కొందరు ఇలా ముందుకురికే అమలరులయ్యారు. ముంబాయి దాడుల సమయంలోనూ మేజర్ ఉన్నికృష్ణన్ ఇదే మాదిరిగా ఉగ్రవాదుల వైపునకు దూసుకెళ్లి వారి తుపాకీ గుళ్లకు నేలకొరిగారు. మేజర్ సినిమాలో ఇటువంటి సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించారు. సినిమాలోని ఉన్నికృష్ణన్.. తన పై స్థాయి అధికారి వద్దని వారిస్తున్నప్పటికీ.. ఉగ్రవాదులను మట్టికరిపించి.. వారిచెరలో ఉన్న వారిని రక్షించటమే సైనికుడి విధిగా భావిస్తాడు. మేజర్ ఉన్నికృష్ణన్ 1977లో జన్మించారు. తండ్రి ఇస్రోలో పనిచేసేవారు. ఆయన కేరళకు చెందినవారు అయినప్పటికీ బెంగళూరులో స్థిరపడ్డారు. వీరమరణం పొందేనాటికి సందీప్ ఉన్నికృష్ణన్ వయస్సు కేవలం 31 సంవత్సరాలు. ఆయన కార్గిల్ యుద్ధంలోనూ పాల్గొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో కీలకంగా వ్యవహరించే నేషనల్ సెక్యురిటీ గార్డు ( ఎన్ ఎస్ జి), స్పెషల్ ఏక్షన్ గ్రూపు ( ఎస్ ఏ జి )లలో ఆయన భాగస్వాములయ్యారు. మేజర్ ఉన్నికృష్ణన్ కు 2009లో భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆశోక చక్ర పురస్కారాన్ని ప్రకటించింది.
ఉగ్రవాదుల దాడి సమయంలో తాజ్ మహలు హోటలు బయటి పరిస్థితి
ముంబాయిలోని పాకిస్తాన్ ఉగ్రవాడుల దాడులపై 2013లో రామ్ గోపాలవర్మ.. ది ఎటాక్ చిత్రాన్ని, ఆ తర్వాత 2018లో వేరేవారు వెబ్ సీరీస్ ను నిర్మించినా తాజాగా వెలువడిన మేజర్ చిత్రం మాత్రం ఆనాటి సంఘటనలను కళ్లకు కట్టింది. ఆ రోజున తాజ్ మహలు హోటల్ బయటి పరిస్థితులను ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు.. లైవ్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రపంచానికి చూపిస్తూ వచ్చారు. అప్పటి దృశ్యాలకు అనుగుణంగా ఇప్పుడు చిత్రీకరించటంలో మేజర్ దర్శకుడు శశి కిరణ్.. సఫలీకృతులయ్యారు. నేపథ్య సంగీతం.. ప్రేక్షకుడిని సినిమాలో పూర్తిగా నిమగ్నమయ్యేలా చేస్తుంది. ‘సరిలేరు నీకెవ్వరు’ అనే చిత్రం ద్వారా సైనికుడి గొప్పతనాన్ని చాటి చెప్పిన హీరో మహేష్ బాబు.. ఈ మేజర్ సినిమా నిర్మాతల్లో ఒకరుగా ఉన్నారు.
2008లో సందీప్ ఉన్నికృష్ణన్ కు నివాళులు
కాశ్మీరి పండిట్లపై ఉగ్రమూకల ఊచకోతలను వివరించిన ‘కాశ్మీర్ ఫైల్స్’ సినిమాకు కర్నాటక, గోవా తదితర రాష్ట్రాలు ఇటీవల జీఎస్టీని మినహాయించాయి. అయితే ఆ రాష్ట్రాలు ఇచ్చిన రాయితీ కేవలం రాష్ట్ర జీఎస్టీకి మాత్రమే పరిమితం. కేంద్రం అటువంటి రాయితీని ఇవ్వనందున కేంద్ర జీఎస్టీ మాత్రం టిక్కెట్లపై పడుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినిమా టిక్కెట్టు ధర రూ.100 లోపు ఉంటే ఆ విలుపై 6 శాతం రాష్ట్ర జీఎస్టీ , మరో 6 శాతం కేంద్ర జీఎస్టీని ప్రేక్షకుడు కట్టాలి. టిక్కెట్టు ధర రూ.100 దాటితే ఉభయ ప్రభుత్వాల జీఎస్టీలు కలపి 18 శాతం మేర కట్టాలి . దేశ భక్తిని, సంస్కరణలను, న్యాయ పరమైన అంశాలను చాటి చెప్పే సినిమాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ పన్ను రాయితీలను ప్రకటించాలి. ఇక ఇలా మినహాయించిన పన్ను ప్రేక్షకుడికి చేరేలా చూడటం కూడా అవసరం. ఓటీటీ వేదికలు ప్రస్తుతం నెలవారి రుసుములను వసూలు చేస్తున్నాయి. నెలవారి రుసుమును చెల్లించని వారి నుంచి ఒక్కో సినిమాకు నిర్ణీత మొత్తాన్ని ఇవి రుసుముగా నిర్ధేసిస్తున్నాయి. ఓటీటీ వేదికలకు కూడా పన్ను రాయితీలను వర్తింప జేసినట్లైతే విడిగా సినిమా చూసే వారంతా కొంత తక్కువ రుసుమును చెల్లిస్తే సరిపోతుంది. దేశ సరిహద్దుల్లో.. గడ్డ కట్టే శీతల ప్రాంతాల్లో మనం ఎలాగు పహారా కాయటంలేదు. కనీసం మేజర్ వంటి సినిమాలను ఆదరించైనా అటువంటివి మరిన్ని రావటానికి తోడ్పడదాం.