జూనియర్ పంచాయతీ కార్యదర్శుల వేతన స్కేళ్లకు రూ. 1,000 కోట్లు
personBuruju Editor date_range2023-02-05
శాసన సభలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రసంగం
బురుజు.కాం Buruju.com : తెలంగాణలోని జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు త్వరలోనే ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగా వేతన స్కేళ్లు వర్తించనున్నాయి. రానున్న.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వీరినందరిని క్రమబద్ధీకరించటం కోసం బడ్జెట్ లో ప్రభుత్వం రూ. 1,000 కోట్లను కేటాయించింది. దీంతో 2024, ఏప్రిల్ నుంచి జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ స్కేళ్లలోకి తీసుకొనేందుకు మార్గం సుగమం అయ్యింది.
నియామకాల కోసం రూ.1,000 కోట్లను పొందిపర్చినట్టు పేర్కొంటున్న బడ్జెట్ పుట ఇది
ఒక్కో పంచాయతికి ఒక్కో కార్యదర్శిని నియమించాలని భావించిన తెలంగాణ ప్రభుత్వం.. దీనికోసం 2018లో 9,335 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను ఏర్పాటు చేసింది. వీటికి పోటీపడిన 5.62 లక్షల మంది ధరఖాస్తుదారులకు అదే ఏడాది అక్టోబరు నెలలో రాత పరీక్షను నిర్వహించి ఎంపికైన వారికి 2019, ఏప్రిల్ 12వ తేదీన నియామక ఉత్తర్వులు అందజేసింది. వీరిలో కొంత మంది విధుల్లో చేరకపోవటం, మరికొందరు వైదొలగటం తదితర కారణాల వల్ల మళ్లీ 1,300 ఖాళీలు ఏర్పడగా వాటినీ ఆ తర్వాత భర్తీ చేసింది. విధుల్లో చేరినప్పుడు వీరికి మూడేళ్ల ప్రొబేషన్ వ్యవధిగా నిర్దేశించి నెలకు రూ.15వేల చొప్పున వేతనాన్ని ఇస్తూ వచ్చింది. ఆ తర్వాత ప్రొబేషన్ వ్యవధిని మరో ఏడాది పెంచింది.
2023-24 బడ్జెట్.. పల్లెకు పట్టం కట్టిందని కొనియాడిన మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు
ప్రభుత్వం పేర్కొన్న నాలుగేళ్ల ప్రొబేషన్ 2023, ఏప్రిల్ కు పూర్తి కానుండటంతో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇటువంటి నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 6వ తేదీన శాసన సభలో ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ లో ‘నూతన నియామకాలు’ కోసం రూ. 1,000 కోట్లను పొందుపర్చింది. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను శాశ్వత ప్రాతిపదికన నియమించేందుకు బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులను కేటాయించటం పట్ల రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షులు పి.మధుసూదన్ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. అంతే కాకుండా వివిధ రకాల గ్రాంట్ల రూపేణా వచ్చే నిధులను నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమచేస్తామని వెల్లడించటం స్వాగతించాల్సిన విషయమని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘
తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షులు పి.మధుసూదన రెడ్డి
‘ఇలా నేరుగా వేయటం వల్ల ఇక నిధులను పొందటంలో జాప్యమంటూ ఉండబోదు. గ్రామ పంచాయతీలు తీర్మానం చేసుకొని.. చెక్కులు ఇచ్చిన వెంటనే నిధులను డ్రా చేసుకొనే అవకాశం ఉంటుంది. ఇది సాహసోపేత నిర్ణయం. స్థానిక ప్రజా ప్రతినిధులకు , స్థానిక సంస్థలకు శుభ పరిణామం. రాష్ట్రంలో 9,935 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శుల కోసం బడ్జెట్ లో నిధులను పొందుపర్చటంతో పాటు, వివిధ గ్రాంట్ల నిధులను నేరుగా పంచాయతీలకు ఇవ్వనున్నట్టుగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీశ్ రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావులకు కార్యదర్శుల సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాం’’ అని మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు.
తాజా బడ్జెట్.. పల్లెకు పట్టం కట్టిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఒక ప్రకటనలో కొనియాడారు. గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా పల్లె ప్రగతిని చేపట్టి, పల్లెలను ప్రగతి కేంద్రాలుగా మారుస్తున్నట్టు ఆయన తెలిపారు. తెలంగాణ పల్లెలు దేశానికి రోల్ మోడల్ గా తయారవుతున్నాయన్నారు.