ఇటువంటి జానపద కళారూాపాలు తెలుగు నేలపై జరిగే జాతరల్లో కనిపిస్తూనే ఉంటాయి
బురుజు.కాం Buruju.com :కన్నడ దర్శకుడు రిషభ్ శెట్టి మాదిరిగా.. మనస్సు పెడితే తెలుగు నేలపై గ్రామగ్రామాన కాంతారా kantara సినిమాలోని ‘భూతకోల’ వంటి కళారూపాలెన్నో కనిపిస్తాయి. కాంతారా సినిమా ప్రేరణతోనైనా మన తెలుగు దర్శకులు నడుంకట్టి మన రూపాలనూ ప్రపంచానికి చాటి చెప్పాలి. ఇలా చేస్తే.. ఆయా కళలు మరికొంత కాలం బతికి బట్టకడతాయి. కాంతారా సినిమా కారణంగా ఇప్పుడు భూత కోల కళాకారులు కర్ణాటక ప్రభుత్వం నుంచి నెలకు రూ.2వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందుకోబోతున్నారు. ఇటీవల పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ద్వారా కిన్నెర వాయిద్యంతో పరిచయమైన మెుగులయ్య.. ఏకంగా పద్మశ్రీ పురష్కారాన్ని అందుకొన్నారు. సినిమా ప్రభావం అలా ఉంటుంది.
కాంతారా సినిమాలోని భూతకోల రూపం
కాంతారా సినిమాలో చూపించిన భూతకోల Bhuta kola అనేది కర్ణాటకలోని కరావళి ప్రాంతంలోని ఒక ప్రాచీన కళారూపం. ఉత్సవాల సమయంలో భూతకోల కట్టి కథలు చెబుతుంటారు. భూతకోల కట్టేవారిని పంజర్లీ దైవం ఆవహించినట్టుగా భక్తులు భావిస్తారు. వేల సంవత్సరాల నాటి ఇటువంటి కళా రూపం చుట్టూ ఒక మంచి కథను అల్లి తీసిందే కాంతారా సినిమా. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్ ద్వారా ఇంటింటా అందుబాటులో ఉంది. ఎప్పుడో రెండు వందల ఏళ్ల క్రితం తమ వంశీకులు గ్రామస్తులకు అందజేసిన భూమిని బలవంతంగా వెనక్కి తీసుకోవటానికి ఇప్పటి తరం వ్యక్తి చేసే ప్రయత్నాలను చివరికి దైవం ఆవహించిన భూతకోల అడ్డుకోవటం సినిమా కథ.
శవున్ని ఆవాహన చేసుకొని కథను చెప్పే వీరనాట్య కళాకారులు ఆంధ్ర ప్రదేశ్ లో కనిపిస్తారు
భూత కోల మాదిరిగానే దైవాన్ని ఆవాహన చేసుకొని మంచిచెడ్డలను చెప్పే కళారూపాలెన్నో తెలుగు రాష్ట్రాల్లోనూ విరివిగా ఉండేవి. వాటిలో చాలా వరకు ఇప్పటికే అంతర్ధానమైపోయాయి. తరతరాల నుంచి వారసత్వంగా వస్తున్న రూపాలను విడిచిపెట్టలేక కొంతమంది మాత్రం ఇప్పటికీ గ్రామాల్లో ప్రదర్శిస్తున్నారు. గ్రామస్తులు హైదరాబాదుకు వలస రావటం వల్ల ఇటువంటి కొన్ని కళా రూపాలు హైదరాబాదు జాతర్లలోను కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని ఉభయ గోదావరి మరికొన్ని జిల్లాల్లోని వీరభద్ర విన్యాసాలు.. వాటిని చూడటానికి వచ్చేవారిని సైతం పూనకం వచ్చి ఊగిపోయేలా చేస్తుంటాయి. దేవతల పేర్లు ప్రస్తావిస్తూ.. ఎరుకల సాని చెప్పే జోస్యానికి పూర్వకాలం నుంచీ ఎంతో ఆదరణ ఉంది.
హైదరాబాదులోని బోనాల జాతరలో బోనాలతో వస్తున్న యువతులు.. భూతకోల మాదిరి రూపం
పాత తరం సినీనటులు, జానపద పరిశోధకులు డా.మిక్కిలి నేని రాధాకృష్ణ మూర్తి రాసిన తెలుగువారి ‘జానపద కళారూపాలు ’గ్రంధాన్ని పరిశీలిస్తే మన అద్భుత జానపద వారసత్వం ఎంత ఘనమైనదో ఇట్టే తెలుస్తుంది.చెప్పేతీరు కనుక బాగుంటే జానపద రూపాలను ఇప్పటి తరాలు తప్పక ఆదరిస్తాయి. మెట్ల కిన్నెర అనే శతాబ్ధాల నాటి వాయిద్యంపై ఇప్పటికీ కథాగానం చేసే కర్నూలు జిల్లా గుట్టురావిపాకుల గ్రామానికి చెందిన దర్శనం మెుగులయ్య.. ఇటీవల భీమ్లా నాయక్ సినిమా వల్ల అందరికీ తెలిశారు. ఆ సినిమాలోని ‘ సెభాష్.. ఆడాగాదు.. ఈడాగాదు’ అంటూ ఆయన పాడిన పల్లవి ఎందరినో ఆకట్టుకొంది. కనీసం ఇటువంటి ప్రయోగాలనైనా మన దర్శకులు సాధ్యమైన చోటల్లా చేపడుతుండాలి.