(‘బురుజు’ ప్రతినిధి)
బుద్ధ భగవానుని దివ్వ రూపం ఎదుట అమరావతి కన్నీరు పెడుతోంది. సాక్షాత్తూ బుద్ధుడే నడయాడి పావనం చేసినట్టుగా దేశవిదేశాల వారు విశ్వసించే నేలపై ఇప్పుడు రైతు కుటుంబాలు విలవిల్లాడుతున్నాయి. భారత ప్రధాన మంత్రి మోదీ శంకుస్థాపన చేసిన అమరావతికి Amaravati ఇంతటి దుస్థితి ఎందుకొచ్చిందీ తెలుసుకోవాలంటే ‘ అమరావతి విషాదం ’ పేరుతో వెలువడిన ఒక డాక్యుమెంటరీని చూడాలి. దీన్ని చూసినవారికి కళ్లు చెమ్మగిల్లక మానవు. రాష్ట్రం చీలిపోయి ఏడేళ్లైనా ఇదీ తమ రాజధాని అని చెప్పుకోలేని దుస్తుతి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి విముక్తి ఎప్పటికోనని దీనిని వీక్షించిన ఇతర రాష్ట్రాలవారూ బరువెక్కిన హృదయాలతో భారంగా నిట్టూర్చుతారు. ఏడాదికి మూడు పంటలు పండే సస్యశ్యామల భూములను రాజధాని కోసం ఇచ్చిన రైతులు.. మూడేళ్లగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్న వైనాన్ని చూసిన వారికి తీవ్ర ఆవేదన కలుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేసిన డా.పరకాల ప్రభాకర్.. అమరావతి Amaravati పై 60 నిముషాల నిడివిగల డాక్యుమెంటరీని రూపొందించి 2020 డిసెంబరులో విడుదల చేశారు. ఇది యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. మాజీ సలహాదారు కనుక నాటి ప్రభుత్వానికి అనుకూలంగా దీన్ని తీసుంటారనే అనుమానాలను ఆయన పటాపంచలు చేశారు. దీనిలో అన్ని కోణాలను సృశించారు. వివిధ పార్టీల నాయకులు, న్యాయకోవిదులు, భూములను ఇచ్చిన రైతుల అభిప్రాయాల సమాహారమే ఈ డాక్యుమెంటరీ. పరకాల ప్రభాకరే వ్యాఖ్యాత. ఆయనే ఆయా ప్రాంతాలను సందర్శించి మనకు వాటి గురించి వివరిస్తారు. ఒక్కో ప్రశ్నను లేవనెత్తి దానికి సమాధానాలను రాబట్టిన పద్దతి కారణంగా ఇది అమరావతికి వ్యతిరేకంగా ఉన్నవారిని సైతం ఆలోచింపజేస్తుంది. దక్షిణాఫ్రికాలో మూడు రాజధానులు ఉన్నాయంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ చెప్పటాన్ని చూపించి.. ఆ వెంటనే దక్షిణాఫ్రికాలోని ప్రముఖులతో పరకాల సంభాషిస్తారు. మూడు రాజధానుల వల్ల పెద్దగా ప్రయోజనాలు లేవని, పనుల కోసం రాజధానుల చుట్టు తిరిగేందుకు ప్రజలకు , వాటి నిర్వహణకోసం ప్రభుత్వానికి ఖర్చులు బాగా పెరిగాయని వారు చెబుతారు.
అమరా
బుద్ధుడు నడయాడిన నేల అమరావతి
అమరావతిలో ఏమీ లేవనే విమర్శలను ఈ డాక్యుమెంటరీ సాక్ష్యాధారాలతో సహా కొట్టి పడేస్తుంది. పార్లమెంటు సభ్యులు రఘురామ కృష్ణం రాజు ఇదే డాక్యుమెంటరీలో చెప్పినదాని ప్రకారం.. అమరావతిలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు చేసిన ఖర్చు రూ.52వేల కోట్లు. భవనాలు, రోడ్లు తదితర మౌలిక వసతులు డాక్యుమెంటరీలో స్పష్టంగా కనిపిస్తాయి. ఇంత ఖర్చుపెట్టిన ప్రాంతాన్ని కాదని, పరిపాలన రాజధానిగా విశాఖపట్టణాన్ని ఎందుకు ఎంచుకోవలసి వచ్చిందోననే ప్రశ్న డాక్యుమెంటరీని చూసినవారికి ఉదయిస్తుంది. రాజధాని ప్రకటించకముందే ఆవిషయాన్ని తెలుసుకొన్న కొంతమంది అమరావతిలో భూములను కొనేశారంటూ అధికారపార్టీ వారు చెప్పటం సహేతుకంగా లేదని తేలుతుంది. ఒక వేళ ఏ కొద్ది మందో అలా కొన్నారే అనుకొన్నా.. వారికి శిక్షగా ఏకంగా రాజధానినే తరలించేయాలా? అనిపిస్తుంది. ఒకప్పుడు చెన్నపట్నం, తర్వాత కర్నూలు, అనంతరం హైదరాబాదు, ఆ తర్వాత అమరావతి.. ఇప్పుడు మరొకట చోట.. అంటూ ఆంధ్రప్రదేశ్ పూర్వపరాలను సంక్షిప్తంగా చెబుతూ వీక్షకులకు పరకాల ఆలోచనలు రేకిత్తించారు. తలుపులను మూసివేసి.. కెమేరాలను నిలిపివేసి.. ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియ ఆనాటి పార్లమెంటులో ఎలా చేపట్టందీ ఆయన గుర్తు చేసినప్పుడు.. నాటి సంఘటనలన్నీ మళ్లీ కళ్లముందుకొస్తాయి. ప్రధానమంత్రి మోదీ మొదలుకొని ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా.. ఈ విషాదానికి అందరూ బాధ్యులేనని పరకాల తేల్చారు.
భూములిచ్చిన రైతుల ప్రస్తుత దుస్తితి ఇదీ
అంధ్రప్రదేశ్ పునరవ్యవస్థీకరణ చట్టం ప్రకారం విభజిత ఆంధ్రప్రదేశ్ కు హైదరాబాదు పదేళ్లపాటు రాజధానిగా ఉంటుంది. అయినప్పటికీ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాదును విడిచిపెట్టటానికి ‘ఓటుకు నోటు’ కేసే కారణమనే ప్రచారం ఉంది. పరకాల ఈ విషయాన్నీ పరోక్షంగా వెల్లడించటంతో ఈ దృశ్యరూపకం నిష్పక్షపాతంగా రూపొందిందనే భావన ఏర్పడుతుంది. ‘నీకు ఏసీబీ ఉంటే నాకూ ఏసీబీ ఉంది. అదీ హైదరాబాదులోనే ఉంది’ అని చంద్రబాటు అనటాన్ని, ‘ నిన్ను బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు .. ఇంకా ఎక్కువగా మాట్లాడితే ఏ శాస్తి కావాలో ఆ శాస్తి జరుగుతాది జాగ్రత్త’ అని కేసీఆర్ హెచ్చరించటాన్ని దీనిలో చూపించటంతో ఇంత వేగంగా హైదరాబాదును వదిలివేయటానికి ఇటువంటి గొడవలే కారణం కాబోలు అనే అభిప్రాయం ప్రేక్షకుడికి ఏర్పడుతుంది. అమరావతికి దాదాపు 34వేల ఎకరాల భూములను ఇచ్చిన రైతుల మనోగతాలనూ దీనిలో పొందుపర్చారు. అభివృద్ధి వికేంద్రీకరణకు ఎంతమాత్రం తాము వ్యతిరేకం కాదని, పాలన వికేంద్రీకరణ పేరుతో రాజధానిని తరలించవద్దన్నదే తమ విన్నపమని వారు చెప్పిన తీరు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. పరిపాలన అంతా అమరావతి నుంచేనని వారు విశ్వసించబట్టే ప్రపంచంలో ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా.. ల్యాండ్ పూలింగ్ విధానంలో ప్రభుత్వానికి భూసేకరణ ఖర్చంటూ లేకుండా 34 వేల ఎకరాల భూములను ఇచ్చారు. ప్రభుత్వం ప్రకటించిన వాణజ్య ప్లాట్ల కోసం ఎన్నో కలలు కంటూ వచ్చిన రైతు కుటుంబాలపై రాజధాని తరలింపు ప్రకటన పిడుగులు పడేటట్టు చేసింది. దాదాపు 29వేల మంది రైతులతో నాటి ప్రభుత్వం ఒప్పందాలను చేసుకొని వారి నుంచి నయానో, భయానో భూములను తీసుకొంది. మరి ఆ ఒప్పందాల మాటేమిటనే ప్రశ్నకూ దీనిలో సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు. వీటి వల్ల రైతులకు న్యాయపరమైన సానుకూలత ఉంటుందని దీనిలో సమాధానం వచ్చింది.
అమరావతిలో నిలిచిపోయిన నిర్మాణాలు
కేవలం నాటి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాలనే భావనే తప్ప రాజధాని తరలింపుపై మరో సహేతుక కారణం కనిపించటంలేదని పరకాల చేసిన వ్యాఖ్యానం అలోచింపజేసేదిగా ఉంది. ఇన్ని రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తుంటే వారిని ప్రభుత్వం పిలిచి మాట్లాడకపోవటమనే వాస్తవాన్ని ఆయన లేవనెత్తుతారు. అసలే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం.. మిగతా చోట్ల రాజధానులను ఏలా నిర్మిస్తుందనే సందేహాలూ డాక్యుమెంటరీలో వ్యక్తమయ్యాయి. అమరావతి రైతులు ఇంతకాలంగా ఆందోళనలను చేస్తున్నా బయటి నుంచి వచ్చే మద్దతు అంతంత మాత్రమేనని, అందువల్లనే ప్రభుత్వం కూడా రైతులను పట్టించుకోవటంలేదని డాక్యుమెంటరీ చివరిలో పరకాల వ్యాఖ్యానిస్తారు. చెన్నపట్నం మొదలుకొని ఒక రాజధాని అంటూ లేకుండా తిరుగుతూనే ఉన్నామని, ఇక రాజధాని కథ ముగిసే దెప్పుడు ? అని పరకాల ప్రశ్నిస్తారు. ఎందుకీ దుస్థితి? ఎవరిదీ నేరం? రాజధానిలేని రాష్ట్రంగా ఎన్నాళ్లీ బతుకులు? అని ప్రశ్నిస్తారు. ఆయా సంభాషణలు వినిపించేటప్పుడు ఇతర భాషలవారికీ విషయం తెలిసేలా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ వస్తుంటాయి. అభిప్రాయాలను చెబుతున్నవారి వివరాలను కూడా టైటిల్స్ ద్వారా చూపించి ఉంటే మరింత సమగ్రత వచ్చేది. నేపథ్య సంగీతం కొన్ని సందర్భాల్లో విషాద భరితంగా ఉంటుంది.