బురుజు.కాం Buruju.com : విశాఖపట్నం దగ్గరలోని భీమిలిలో.. 160 ఏళ్ల క్రితం చోటు చేసుకొన్న ఒక ప్రేమ కథ.. త్వరలో చలన చిత్రంగా రాబోతోంది. ప్రముఖ కథా రచయిత పొత్తూరు రాజేంద్ర ప్రసాద్ వర్మ వెలుగులోకి తెచ్చిన హ్రుదయాలను ద్రవింపజేసే అప్పటి ప్రేమ కథను.. చలన చిత్రంగా రూపొందించాలని దర్శకులు పీసీ ఆదిత్య నిర్ణయించారు. పాత్రదారుల అన్వేషణను సైతం ఆయన మొదలు పెట్టినట్టు సమాచారం.
అందాలి భీమిలి తీరంలోనే లూసీ, సుబ్రహ్మణ్యంల మధ్య ప్రేమ మొగ్గతొడిగింది
ప్రేమ కథలు ఎన్నొచ్చినా అన్నింటిలోనూ ఏదో ఒక కొత్త దనం తొణికిసలాడుతూనే ఉంటుంది. వాటిలో సినిమాగా తీయతగ్గవాటిని దర్శకులు ఎప్పుడూ విడిచిపెట్టరు. అటువంటి కోవకు చెందిన కథే ఇప్పుడు తెరపైకి రాబోతోంది. మన దేశంలో.. బ్రిటీష్ వారి హయాంలో ఏర్పాటైన మొదటి మున్సిపాలిటి సూరత్ కాగా.. రెండోవది భీమిలి (భీమునిపట్నం) . అప్పట్లో.. ఉన్నత స్థాయి పోస్టులన్నింటిలోను బ్రిటీష్ వారే ఉండేవారు. భీమిలి పురపాలక సంఘానికి 1861లో శ్యాంసన్.. కమిషనరుగా వ్యవహరించారు. ఆయన కుమార్తె లూసీకి, భీమిలికి చెందిన సుబ్రహ్మణ్యానికి భీమిలి సముద్రతీరంలో ఏర్పడిన పరిచయం.. ఒక అద్భుత ప్రణయ గాథకు దారితీసింది.
లండన్ నుంచి వచ్చి.. అనేక సంవత్సరాల నిరీక్షణ తర్వాత భీమిలోనే లూసీ కన్ను మూయగా ఇప్పటికీ కనిపిస్తున్న ఆమె సమాధి
వారిద్దరి మధ్య ప్రేమ అంకురించిన విషయాన్ని పసిగట్టిన బ్రిటీష్ అధికారి.. వారిని విడదీయటానికి ఎత్తు వేస్తాడు. ఇటువంటి నేపథ్యంలో.. సుబ్రహ్మణం అకస్మాత్తుగా కనిపించకుండా పోతాడు. మరో వైపు.. తనకు బదిలీ అయ్యిందని చెప్పి లూసీని ఆమె తండ్రి తిరిగి లండనుకు తీసుకెళ్లిపోతాడు. తండ్రి బలవంతంగా తీసుకెళ్లగలిగాడే కాని.. నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉన్న ఆమె ప్రేమను ఏమీ చేయలేకపోయాడు. ఒక రోజు ఎవరికీ చెప్పా పెట్టకుండా లూసీ తిరిగి భీమిలిలో వాలిపోతుంది. సుబ్రహ్మణ్యం కోసం సంవత్సరాల తరబడి గాలిస్తుంది. చివరికి అక్కడే తుది శ్వాస విడుస్తుంది.
పొత్తూరు రాజేంద్ర ప్రసాద్ వర్మ.. ‘ మన భీమిలి’ పత్రికలో బయటపెట్టిన లూసీ, సుబ్రహ్మణ్యం ప్రణయగాథ
ఇదంతా జరిగిన కథే అయినప్పటికీ కాలగర్భంలో కలసిపోయింది. అటువంటి కథను రచయిత పొత్తూరు రాజేంద్ర ప్రసాద్ వర్మ వెలుగులోకి తెచ్చారు. ఇప్పటికే ఆయన భీమిలి నేపథ్యం గల 25 కథలను రాయగా.. అవన్నీ వివిధ పత్రికల్లో వెలువడ్డాయి. ప్రస్తుతం సినిమాగా రూపొందించబోతున్నది ఆయన రాసిన 26వ కథ. భీమిలిలో.. లూసీ సమాధి ఇప్పటికీ ఉంది. సుబ్రహ్మణ్యం కోసం అది ఇంకా ఎదురు చూస్తున్నట్టుగా ఉంటుంది. సుబ్రహ్మణ్యం కనిపించకుండా పోవటంతో అతని కుటుంబీకులంతా ఎక్కడికో వెళ్లిపోయారని, అతని ఇల్లు, అప్పట్లో లండన్ నుంచి వచ్చాక లూసీ నివసించిన ఇల్లు ఇప్పటికీ ఉన్నాయని వర్మ తన కథలో ఫొటోలతో సహా వెల్లడించారు. ఫొటోల కారణంగా ఆయన రాసిన కథకు మరింత నిండుదనం వచ్చింది. బ్రిటీష్ పాలన నేపథ్యం కావటంతో సినిమాలో ఆనాటి మరిన్ని అంశాలను జోడించేందుకు వీలవుతుంది. ఇంతకీ.. సుబ్రహ్మణ్యం ఏమయ్యాడు? నాటి బ్రిటీష్ అధికారి శ్యాంసన్ ఎటువంటి పన్నాగాలతో అతన్ని మాయం చేశాడు? వంటి విషయాలు వర్మ రాసిన కథలో లేవు కనుక వాటన్నింటినీ దర్శకుడే చిత్రంలో వెల్లడిస్తారు. భీమిలిలో.. 1978లో కల్పిత కథతో చిత్రీకరించిన ‘మరోచరిత్ర’ అప్పట్లో ఒక సంచలనం. అదే భీమిలికి చెందిన లూసీ, సుబ్రహ్మణ్యాలది మాత్రం నిజమైన ప్రణయగాథ.