మీకు తెలుసా? వంటగ్యాస్ డీలరుకు మనం కమీషన్ ఇస్తాం..! దానిపై జీఎస్టీనీ చెల్లిస్తాం !!
personBuruju Editor date_range2022-11-26
ఇప్పుడు కిరోసిన్ స్టౌ అనేదే కనిపించటంలేదు
బురుజు.కాం Buruju.com : వంట గ్యాస్ సిలిండరును సరఫరా చేసే డీలరుకు మనం కమీషను, దానిపై జీఎస్టీ సైతం చెల్లిస్తున్న విషయం చాలా మందికి తెలియదు. అయిల్ కంపెనీలు మన నుంచి వీటన్నింటిని ధరలో కలిపి వసూలు చేస్తుంటాయి. డీలరుకు కమీషను చెల్లిస్తున్నందున .. ఇక సిలిండరును ఇంటికి తీసుకొచ్చే వ్యక్తికి మనకు ఇష్టమైతే ఏ పది రూపాయలో ఇవ్వొచ్చు తప్పిస్తే.. అతను అడిగినంతా అందించాల్సిన అవసరమే లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోను గ్యాస్ కనెక్షన్లు బాగా పెరుగుతున్న నేపథ్యంలో.. ఇవన్నీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు.
ధర ఎంత పెరిగినా గ్యాస్ కొనితీరాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు పట్టణాల్లో.. కిరోసిన్ స్టౌలకు, కట్టెల పొయ్యిలకు కాలం చెల్లింది
హైదరాబాదులో 2022, నవంబరు నెలలో వంట గ్యాసు domestic gas 14.2 కిలోల సిలిండరుకు వినియోగదారుడు చెల్లించిన ధర రూ.1,105. దీని నుంచి డీలరుకు కమీషన్ రూపేణా 61 రూపాయల 84 పైసలు వెళ్లాయి. ఇది కాకుండా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్టీ GST (5శాతం) రూపేణా చెరో 27 రూపాయల 62 పైసలు చొప్పున జమయ్యాయి. ఇలా కమీషను, జీఎస్టీలను మినహాయిస్తే మిగిలిన రూ.987.91 వంట గ్యాసు అసలు ధర. విశేషమేమిటంటే.. డీలరుకు చెల్లించిన కమీషను పైనా మన వద్ద నుంచి ఆయిల్ కంపెనీలు 5శాతం జీఎస్టీని రాబట్టాయి. మనం చెల్లించిన జీఎస్టీ మొత్తంలో ఇదీ కలిసింది. ఇళ్లల్లో ఉపయోగించే వంట గ్యాసుపై కేంద్రం.. కస్టమ్స్ సుంకాన్ని విధించటంలేదు కనుక ఆ మేరకు కొంత ఉపశమనమేనని మనం సరిపెట్టుకోవాలి.
గ్యాస్ పంపిణీ రెండు రోజులు ఆలస్యమైనా ఇప్పుడు కుటుంబమంతా విలవిల్లాడల్సిన పరిస్థితి
గ్యాసు ధర పెరుగుతున్నందున గ్రామాల్లో కొంత మంది తిరిగి కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నప్పటికీ.. గడచిన ఆరేళ్లలోను ఆంధ్రప్రదేశ్ లో 29 లక్షలు, తెలంగాణలో 25 లక్షల మేర వంట గ్యాస్ కనెక్షన్లు పెరిగాయి. ప్రస్తుతం ఏపీలో ఒక కోటీ 47 లక్షలు, తెలంగాణలో ఒక కోటీ 17 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఏపీలో 1083 మంది, తెలంగాణలో 791 మంది డీలర్లు ఉన్నారు. దేశంలోని మొత్తం వంట గ్యాస్ వినియోగంలో ఏపీ వాటా 4.7 శాతం, తెలంగాణ వాటా 3.8 శాతంగా నమోదయ్యింది.
గ్యాస్ ధర పెరినప్పుడు ఇలా రాజకీయ పార్టీల వారి నిరసనలు సర్వ సాధారణ ప్రక్రియగా మారిపోయింది