రుషి దేశంలో.. క్యాబేజిని కోసిపెడితే రూ.63 లక్షల జీతం!
personBuruju Editor date_range2022-10-24
బ్రిటనులో హిందూ సంప్రదాయ వేషధారణతో గేదెకు దాణా తినిపిస్తున్న ఆ దేశ ప్రధాని రిషి సునాక్. అక్కడి వ్యవసాయం, పాడి సమస్యలను పరిష్కరించటం ఇప్పుడాయన తక్షణ కర్తవ్యం
బురుజు.కాం Buruju.com : బ్రిటన్ దేశంలో ఇప్పుడు వ్యవసాయ కూలీల కొరత తీవ్రంగా ఉంది. క్యాబేజీ, బ్రొకోలి పంటల పెంపకం, వాటిని కోయటం పనులను చేసేవారికి ఏడాదికి దాదాపు రూ.63 లక్షలను చెల్లిస్తామంటూ అక్కడి ఒక కంపెనీ తాజాగా ముందుకొచ్చింది. పొలాల్లోని కూరగాయలు, పండ్లు తదితరాలను సేకరించేవారు లేక లక్షల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు నేలపాలవుతున్నాయి. వ్యవసాయ కూలీల సమస్య పరిష్కారానికి ఇప్పుడక్కడి రిషి సునాక్ సారధ్యంలోని కొత్త ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది . బ్రిటన్ అంతటి స్థాయిలో కాకున్నా.. కూలీల కొరతను ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని రైతులు చాలా కాలంగా ఎదుర్కొంటూనే ఉన్నారు . కూలీల కొరత, గిట్టుబాటు ధర రాకపోవటం వంటి కారణాలతో కోనసీమలోని కొందరు రైతులు పంట విరామాలతో వార్తలకు ఎక్కుతుండటం తెలిసిందే.
బ్రిటన్ దేశంలో.. కరోనా కారణంగా ఇతర ప్రాంతాల నుంచి వ్యవసాయ కార్మికుల వలసలు నిలిచిపోయాయి. దీనికి తోడు.. స్థానికంగా ఉంటున్నవారిలో పలువురు వ్యాదుల బారిన పడటం, మరికొంత మంది తక్కువ వయస్సులోనే ఆయా పనుల నుంచి నిష్క్రమించటం వంటి కారణాల వల్ల పొలాల్లోకి దిగి పనిచేసేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది. దీంతో పండ్లు, కూరగాయలను సేకరించి సూపర్ మార్కెట్లకు అందజేసే కంపెనీల వారు అధిక జీతాలను ఇస్తామంటూ ప్రకటనలు ఇవ్వాల్సిన అవసం ఏర్పడింది. టీహెచ్ క్లెమెంట్స్ అనే కంపెనీ ఇలా ఎక్కువ మొత్తాలను చెల్లిస్తామంటూ ఇటీవల ఇచ్చిన ప్రకటనలతో అక్కడి పరిస్థితి ఇతర దేశాలకు బాగా తెలిసింది. సేకరించిన కూరగాయలను బట్టి జీతం గంటకు 30 పౌండ్ల చొప్పున ఇస్తామంటూ ఆ కంపెనీ చెబుతూనే ఉద్యోగం ఏడాది పొడవునా ఉంటుందని పేర్కొంది. ఇలా అందజేస్తే అది ఏడాదికి దాదాపు రూ.63 లక్షలవుతుంది.
వ్యవసాయ క్షేత్రంలో పనిచేయటానికి నిర్వాహకులు కావాలంటూ టిహెచ్ క్లెమెంట్స్ కంపెనీ ఇచ్చిన పలు ప్రకటనల్లో ఇదొకటి
ఇటువంటి సమస్య జటిలం కాకముందే మన దేశంలోను చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే కూలీల సమస్య ఉండదని ఇక్కడి రైతులు చాలా కాలంగా కోరుతున్నప్పటికీ కేంద్రం మాత్రం ఆ కోణంలో ఇంతవరకు స్పందించలేదు.