భూమి శిస్తే లేనప్పుడు.. బ్రిటీష్ కాలం నాటి ఆ పేరెందుకు?
personBuruju Editor date_range2023-01-27
విశాఖపట్నంలోని విశాఖజిల్లా కలెక్టర్ కార్యాలయం ఇది. కలెక్టరు పేరేకాదు.. భవనం కూడా బ్రిటీష్ కాలం నాటిదే
బురుజు.కాం Buruju.com : బ్రిటీష్ వారి పరిపాలనలో.. భూమి శిస్తే ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది. అంతటి ప్రాధాన్యంగల శిస్తు వసూళ్లను పర్యవేక్షించే ప్రధాన అధికారి పేరే కలెక్టరు . తెలుగు రాష్ట్రాల్లో భూమి శిస్తు విధానం ఎప్పుడో రద్దైపోయింది. బ్రిటీష్ కాలం నాటి కలెక్టరు పేరు మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కలెక్టరు పేరును ఇప్పటికైనా మార్చాల్సిన అవసరం ఉందికదా? భారత రాష్ట్ర సమితి ( బి.ఆర్.ఎస్) పేరుతో దేశ వ్యాప్తంగా నూతన విధానాలను తేవాలని తెలంగాణ పాలకులు సంకల్పిస్తున్నందున.. కలెక్టరు పేరు మార్పును తొలుత స్వరాష్ట్రంతో మొదలు పెట్టొచ్చు. కలెక్టరు పేరు మారితే.. జాయింట్ కలెక్టరు, సబ్ కలెక్టరు, డిప్యూటీ కలెక్టర్లకు కూడా కొత్త పేర్లు వస్తాయి.
తెలంగాణలో.. కొత్తగా ఏర్పాటైన వనపర్తి జిల్లా కలెక్టరు కార్యాలయం ఇది
ఇప్పటికి 250 ఏళ్ల క్రితం.. అంటే 1772లో అప్పటి బ్రిటీష్ అధికారి ఒకరు.. నాటి జ్యుడీషియల్ ప్రణాళికలో తొలిసారిగా కలెక్టరు పేరును ప్రస్తావించారు. జిల్లా స్థాయిలో పన్నులను వసూలు చేయటమే అతని బాధ్యత.అప్పట్లో అతన్నే దివాన్ అనీ వ్యవహరించారు. ఆ తర్వాత 1858లో బ్రిటీష్ పార్లమెంటు.. కలెక్టర్ల పాలనను దేశంలో అమల్లోకి తెచ్చింది. స్వాతంత్య్రం సిద్ధించాక.. కొన్ని రాష్ట్రాలు కలెక్టరు పేరును మార్చుకొన్నాయి. కర్నాటక, అస్సాం*లలో డెప్యూటీ కమిషనరు అని, దిల్లీ, త్రిపురలలో జిల్లా మెజిస్ట్రేట్ కం డెప్యూటీ కమిషనరు అని వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ‘కలెక్టరు కం జిల్లా మెజిస్ట్రేట్’ అని అంటుండగా.. గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కలెక్టరు అని పిలుస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని కలెక్టరు ఇప్పుడు ఏ రకమైన పన్ను రాబడులనూ పర్యవేక్షించకపోయినా పేరు మాత్రం పాతదే కొనసాగుతోంది. ఆంగ్ల పదాలను సాధ్యమైంత వరకు విస్మరించాలని సంకల్పించిన ‘ఈనాడు’ పత్రిక.. కలెక్టరు పేరును కొన్ని సందర్భాల్లో ‘జిల్లా పాలన అధికారి’ అని రాస్తున్నప్పటికీ.. అది అంతగా ప్రచారంలోకి రాలేదు. ప్రస్తుతం ల్యాండ్ రెవెన్యూ అనేదే లేనప్పుడు రెవెన్యూ శాఖ అనే పేరు అనసవరమని ముఖ్యమంత్రి కేసీఆర్.. కొంత కాలం క్రితం ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. ఆ శాఖ పేరుతో పాటు కలెక్టరు పేరును కూడా మార్చినట్లైతే బ్రిటీష్ వారి విధానాలను మరికొన్నింటిని ఇప్పటికైనా మనం వదిలించుకొన్నట్లవుతుంది.