శ్రద్ధాను 35ముక్కలు చేసిన ఘొరంతోనైనా.. సహజీవనం సినిమాలను ఆపండి
personBuruju Editor date_range2022-11-16
కుటుంబ సభ్యులను కాదని వచ్చి సహజీవనం చేస్తూ 35 ముక్కలైపోయిన శ్రద్ధా.. నమ్మించి కిరాతకానికి ఒడిగట్టిన అస్తాబ్
బురుజు.కాం Buruju.com : సహజీవనం.. ఇప్పుడు తెలుగు సినిమాల్లో హీరోయిజంగా మారిపోతోంది. ప్రముఖ నటులు నాగార్జున, నాగచైతన్య వంటివారు ఇటీవల నటించిన చిత్రాలు సహజీవనం కథాంశంతో కూడుకొన్నవే. పెళ్లి కాకుండానే సహజీవనంతో కాపురాలు చేసుకోవచ్చనే సందేశాలతో కూడిన ఇటువంటి సినిమాలు యువతను తప్పుదారి పట్టించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి . దేశ రాజధాని దిల్లీలో.. తనను నమ్ముకొని వచ్చిన యువతిని అత్యంత కిరాతకంగా.. 35 ముక్కలు చేసిన సంఘటనతోనైనా సహజీవనం సినిమాలకు మన దర్శకులు స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది.
అమెజాన్ ప్రైమ్ వంటి.. ఎప్పుడు పడితే అప్పుడు అందుబాటులో ఉండే ఓటీటీ వేదికల కారణంగా.. ఇప్పుడు సినిమాల ప్రభావం మునుపటికంటే బాగా పెరిగింది. ఇటువంటి నేపథ్యంలో..‘ సరిలేరు నీకెవ్వరు ’ వంటి మంచి సందేశాలతో కూడిన చిత్రాలను తీయటం దర్శకులు, నిర్మాతల బాధ్యత. అందుకు భిన్నమైన చిత్రాల్లో కొన్నింటిని థియేటర్లకు వెళ్లకుండా ప్రేక్షకులు తిరస్కరిస్తున్నప్పటికీ.. అవి తిరిగి ఓటీటీ వేదికలపై ప్రత్యక్షమవుతున్నాయి.పెళ్లి కాకుండానే హీరో, హీరోయిన్ ఒకే ఇంటిలో ఉంటూ సహజీవనం చేయటం, ఆ తర్వాత అభిప్రాయ భేదాలు రావటం, మళ్లీ ఏకం కావటం వంటి అంశాలతో సినిమాలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో వచ్చిన నాగచైతన్య ‘థ్యాంక్యూ’, నాగార్జున ‘ఘోష్ట్’, ఇంకా అల్లు శిరీష్ నటించిన ‘ఉర్వశివో.. రాక్షసివో’ వంటి సినిమాలు సహజీవనం అంశంతో కూడుకొన్నవే.
ఇలా.. ఇద్దరూ కలసి జీవించినప్పుడు ఎవరు ఏమిటనేది స్పష్టమవుతుంది కనుక ఆ తర్వాత ఇష్టమైతే దాంపత్యాన్ని కొనసాగించుకోవటం, లేదంటే ఎవరి దారిని వారు చూసుకోవటం మంచిదే కదా? అని వాదించేవారు ఉండొచ్చు. మన దేశంలోని వివాహ వ్యవస్థను ఇటువంటి పోకడలు విఘాతం కలిగిస్తాయి. ఒకరితో సహజీవనం చేసినవారు వేరొకరిని వివాహం చేసుకొన్నప్పుడు ఎప్పటికైనా విషయం బయటపడుతుంది. అప్పుడు ఆ దాంపత్యం సజావుగా ఉంటుందని చెప్పగలమా? దీల్లీ సంఘటనను తీసుకొంటే.. శ్రద్ధా వికాస్.. తన ఇంట్లోవారిని వ్యతిరేకించి అఫ్తాబ్ తో సహజీవనం చేసింది. రెండేళ్లకే గొడవులు ముదిరి ఆమెను అతను 35 ముక్కలుగా నరికి అర్ధరాత్రుల వేళ వాటిని దిల్లీ అటవీ ప్రాంతాల్లో పడేస్తూ వచ్చినట్టు బయటపడింది.
అమె అందరినీ వదులుకొని తనతోనే ఉంటున్నందున ఆమెను ఏమి చేసినా ఎవరికీ తెలియదన్నదే అతని ధీమా. ఇద్దరికి వివాహం అయ్యింటే వారు దీల్లీకి వెళ్లిపోవాల్సిన అవసరమే ఉండేదికాదు. ఆమెను చంపటానికి అతను సాహసించేవాడు కాదని భావించొచ్చు.
ఇంతకీ.. ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చటానికి అప్తాబ్ కు ‘డెక్సటర్’ అనే ఇంగ్లీషు సినిమా బాగా ఉపయోగపడింది. సినిమాల ప్రభావం ఎంత బలీయంగా ఉంటుందో చెప్పేందుకూ ఈ కేసు ఒక ప్రభల నిదర్శనం.ఇటీవలే గుజరాత్ లో మరొక సంఘటన చోటు చేసుకొంది. అక్కడి పటేలు నగర్ కు చెందిన రాహుల్ సింగ్.. సోనమ్ అలి సహజీవనం చేసేవారు. అతనికి ఇష్టంలేని గొడ్డు మాంసం కూరలను వండి వాటిని తినాలంటూ ఆమె వత్తడిచేసేది. ఇది భరించలేక అతను ఒక లేఖను రాసి ఆత్మహత్య చేసుకొన్నాడు. సహజీవనంలో ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చకపోతే వేరుకావచ్చనే వాదనలను పై రెండు సంఘటనలు కొట్టిపడేస్తున్నాయి.