భారత్-శ్రీలంకల మధ్య కనిపించే వారధిని శ్రీరాముడు నిర్మించినట్టుగా కోట్లాది మంది భక్తులు విశ్వసిస్తారు
బురుజు.కాం Buruju.com : రామసేతుకు స్పష్టమైన ఆధారాలంటూ లభించలేదని కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రకటించింది. అక్కడేదో కట్టడం ఉన్నట్టుగా సూచనలు మాత్రం ఉన్నాయని పేర్కొంది. హిందీ నటుడు అక్షయకుమార్ నటించిన ‘రామసేతు’ Ram setu movie చిత్రం ఒటీటీ వేదికపై విడుదల కావటానికి ఒక రోజు ముందు.. ( 2022,డిసెంబరు 22వ తేదీన) కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో పై ప్రకటన చేసింది. సినిమాలో మాత్రం.. పురావస్తు నిపుణుడు అక్షయకుమార్.. అష్టకష్టాలు పడి రామసేతు మానవ నిర్మితమేనని తేలుస్తాడు . రామసేతు సినిమా నిర్మాణాన్ని తలపెట్టినప్పటి నుంచి వారధి నిర్మాణం మరో సారి దేశవ్యాప్తంగా చర్చల్లోకి వచ్చింది. తాజాగా రాజ్యసభలో ఒక సభ్యుడి ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చి.. రాముడి వారధిపై చర్చను తీవ్రతరం చేసింది. మోదీ సర్కారు ఇప్పుడే ఇలా ఎందుకు ప్రకటించిందో తెలియాల్సివుంది.
రామసేతు వల్ల ప్రస్తుతం ఓడలు శ్రీలంకను చుట్టి వెళ్తున్నాయి. వారధిని కొంతమేర పగలగొట్టి సేతు సముద్రం ప్రాజెక్టును నిర్మించాలని గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత ఓడలు పయనించే రూటును, నూతన ప్రతిపాదిత ప్రాజెక్టును వివరించే చిత్రమిది
లంకలో రావణుడి బంధీగా ఉన్న సీతను తీసుకొచ్చేందుకు శ్రీరాముడు, ఆయన సైన్యం కలసి సముద్రంలో వారధిని నిర్మించినట్టుగా వాల్మీకి తన రామాయణంలో పేర్కొన్నారు. ప్రస్తుతం తమిళనాడులోని పంటన్ దీవి, శ్రీలంకలోని మన్నార్ దీవికి మధ్య గల సముద్రంలో 56కి.మీ పొడవునా రామసేతు ఉన్నట్టుగా చెబుతారు. దీని కారణంగా ఓడల రాకపోకలకు చాలా ఆలస్యమవుతోందని, అందువల్ల దీనిని కొంతమేర పగల కొట్టాలని 2007 లో.. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించటంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న అంశం కావంతో సుప్రీం కోర్టు.. నూతన ప్రాజెక్టు నిర్మాణానికి అంగీకరించలేదు. ఆ తర్వాత మోదీ ప్రభుత్వం రామసేతుపై అధ్యయనానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పుడు రామసేతుపై సినిమా రావటం, అదే సమయంలో కేంద్రం ప్రకటన చేయటంతో ఇప్పుడిదో రాజకీయాంశంగాను మారిపోయింది.
రామసేతు సినిమాలో పురావస్తు అధికారి అక్షయకుమార్ కనుగొన్న నీటిలో తేలియాడే రాయి
సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం ఒటీటీ వేదికైన అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో అందుబాటులో ఉన్న ‘రామసేతు’.. ప్రేక్షకుడిని రంజింపచేయలేకపోయింది. . ఓడలు సులువుగా వెళ్లటానికి వీలుగా రామసేతను పగలగొట్టించటం కోసం పారిశ్రామిక వేత్త నాజర్ ప్రయత్నిస్తుంటాడు. రామసేతు అనేది మానవ నిర్మితం కాదని, అది సహజసిద్ధంగా ఏర్పడిందని నిరూపిస్తూ నివేదికను ఇవ్వాల్సిందిగా నాస్తికుడైన పురావస్తు శాఖకు చెందిన ఆర్యన్ ను ( అక్షయకుమార్) అడుగుతాడు.
రామసేతు
సముద్రంలోకి వెళ్లి అక్కడ నీటిలో తేలే ఒక రాయిని , మరికొన్ని ఆధారాలను కనుగొన్న తర్వాత ఆర్యన్ లో మార్పు వస్తుంది. శ్రీలంకలో రావణుడిని ఆధారాలను వెలికితీయగలిగితే రామసేతు, రాముడు ఉన్నట్టే అవుతుందనే ఒక సూత్రీకరణతో శ్రీలంకలో పరిశోధలను చేపడతాడు. చివరికి రామసేతు మానవ నిర్మితమేనని తేలుస్తాడు. కథాంశం బాగున్నప్పటికీ.. దానిని చిత్రంగా మలచిన తీరు ప్రేక్షకుడికి రుచించలేదు. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుడికి ఉత్కంఠ అనేది ఉండదు. అందువల్లనే సినిమా వియవంతం కాలేకపోయింది. రామసేతుకు ఆధారాలు లేవని కేంద్రం ప్రకటించటంతో.. సినిమాలో అక్షయకుమార్ చేసిన పరిశోధనలన్నీ సముద్రం పాలయినట్లయ్యింది.