విశాఖలో ఉండేది సీఎం క్యాంపు ఆఫీసంటూ భాజపా ఎంపీ వింత భాష్యం
personBuruju Editor date_range2023-02-07
సీఎం జగన్ క్యాంపు కార్యాలయం ఎక్కడైనా ఉండొచ్చని వ్యాఖ్యానించిన భాజపా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు
బురుజు.కాం Buruju.com : ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని camp office ఎక్కడపడితే అక్కడ ఏర్పాటు చేసుకోవటానికి వీలుకాదు. ఎందువల్ల నంటే.. ముఖ్యమంత్రి పిలిచిన వెంటనే నిముషాల వ్యవధిలో ఆయన వద్దకు వెళ్లేలా ఐఏఎస్, ఐపీఎస్ తదితర క్యాడర్లలోని అధికారులంతా అక్కడ అందుబాటులో ఉండితీరాలి. అందువల్ల విశాఖపట్నంలో ఏర్పాటయ్యేది సీఎం క్యాంపు కార్యాలయం మాత్రమేనని, దానిని రాష్ట్రంలో ఎక్కడ పెట్టుకొన్నా ఎవరికీ అభ్యంతరాలు ఉండబోవని భారతీయ జనతా పార్టీ (BJP) రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్దంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పాలకుల పట్ల సానుకూల వైఖరితో ఉంటారనే పేరు పడ్డ ఆ ఎంపీ.. రాజధాని వివాదాన్ని తేలికపర్చాలనే భావనతోనే అటువంటి వ్యాఖ్యలు చేసుండొచ్చనేది పరిశీలకుల విశ్లేషణ.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలి వెళ్తుందంటూ .. 2023, జనవరి31వ తేదీన దిల్లీలో వెల్లడిస్తున్న ముఖ్యమంత్రి జగన్
ముఖ్యమంత్రి నివాసం ఉండే భవనాన్నే సీఎం క్యాంపు కార్యాలయంగా వ్యవహరిస్తారు. సచివాలయం ఎక్కడైతే ఉంటుందో సీఎం నివాసం కూడా అక్కడే ఉంటుంది కనుక అదే క్యాంపు కార్యాలయంగానూ కొనసాగుతుంది. అంటే.. క్యాంపు కార్యాలయం రాజధానిలోనే ఉంటుంది. కొన్ని సార్లు సీఎం అసలు సచివాలయానికి వెళ్లకుండా తన క్యాంపు ఆఫీసు నుంచే అన్ని వ్యవహారాలను చేపడుతుంటారు. ఉదాహరణకు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. గత కొన్నేళ్లుగా అసలు సచివాలయానికే వెళ్లటంలేదు. హైదరాబాదు బేగంపేటలోని తన నివాసమైన ప్రగతి భవన్ నుంచే ఆయన పాలనంతా కొనసాగుతూ వస్తోంది. సచివాలయంలో ఆయన చూడాల్సిన దస్త్రాలన్నీ ఎప్పటికప్పుడు క్యాంపు కార్యాలయానికి వెళ్తుంటాయి. ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు.. సీఎంను కలిసి అవసరమైన అనుమతులను పొందుతుంటారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నివాసానికి తెల్లవారు జామునే అదికారులు వెళ్తుండేవారు . అప్పటికే ఎన్టీఆర్ సిద్దంగా ఉండేవారు. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనారోగ్య కారణాల వల్ల వేసవిలో కొద్ది రోజులు ఊటిలో ఉండి పరిపాలన కొనసాగించారు. ఏపీ సీఎంలు ఎవరూ ఇంతవరకు తమకు తోచిన చోట క్యాంపు కార్యాలయాలను నిర్వహించుకోలేదు.
విశాఖనగరం
ఏపీ రాజధాని విశాఖపట్నమేనని ముఖ్యమంత్రి జగన్..2023, జనవరి 31వ తేదీన దిల్లీలో నిర్వహించిన ఒక సదస్సులో పునరుద్ఘాటించారు. ఆయన ప్రకటనకు తగ్గట్టుగా సీఎం నివాసానికి విశాఖ సముద్ర తీరంలో ఏర్పాట్లు జరుగుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. అంటే.. రాజధాని, సీఎం నివాసం ఒకే చోట ఉండేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందోని స్పష్టమవుతోంది. ఇటువంటి నేపథ్యంలో.. ఫిబ్రవరి 5వ తేదీన జీవీఎల్ నరసింహారావు.. విశాఖలో విలేకర్లు అడిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఏపీ రాజధానిగా ఉండేందుకు విశాఖకు అర్హత ఉన్నప్పటికి అమరావతిని రాజధానిగా తమ పార్టీ ఇప్పటికే గుర్తించిందని అన్నారు. సీఎం నివాసం కోసం విశాఖలో ఏర్పాట్లను చేస్తుండటాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ సీఎం క్యాంపు కార్యాలయాన్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చని, దీనిలో ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. అంటే.. విశాఖలో జగన్ నివాసం కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసినా అది కేవలం ఆయన క్యాంపు కార్యాలయంగానే ఉంటుంది తప్ప అంతమాత్రన విశాఖ రాజధాని కాబోదన్నది ఆయన విశ్లేషణ. క్యాంపు కార్యాలయం అంటే ముఖ్యమంత్రి అప్పుడప్పుడు వచ్చి కొంత సేపు కూర్చుని వెళ్లిపోయేది కాదు. అధికారులను ఎవరిని కలవకుండా.. కుటుంబంతో ఒకటి, రెండు రోజుల పాటు ఉండేదాన్ని గెస్టు హౌస్ అంటారేతప్ప క్యాంపు కార్యాలయంగా పిలవరు. ఇటువంటి విషయం జీవీఎల్ కు తెలియందేమీకాదు.