మంత్రి అమరనాథ్ ‘కోడిగుడ్డు’.. మళ్ళీ తెరపైకి ‘గాడిద గుడ్డు’ !
personBuruju Editor date_range2023-02-19
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమరనాథ్
బురుజు.కాం Buruju.com : ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ ఇటీవల కోడిగుడ్డుపై చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు ‘గాడిద గుడ్డు’పై సామాజిక మాధ్యమాల్లో మళ్లీ చర్చలకు ఊతమిచ్చాయి. గాడిద పిల్లల్ని కంటుందే తప్ప గుడ్లను పెట్టదు కనుక అసలు ‘గాడిద గుడ్డు’ నానుడి ఎలా ఉద్భవించిందో వివరించే పోస్టింగులు వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నాయి. మరో వైపు కోడిగుడ్డుపై అమరనాథ్ చేసిన వ్యాక్యలు సరదా ట్రోల్స్ కు మంచి ముడి సరుకుగా మారిపోయి.. అటువంటి ట్రోల్స్ కు వేల సంఖ్యలో వీక్షణలు నమోదవుతున్నాయి.
మంత్రి అమరనాథ్ కోడిగుడ్డు వ్యాఖ్యలపై యూట్యూబులో కనిపిస్తున్న ట్రోల్స్ లో ఇదొకటి
హైదరాబాదులో ప్రతిష్ఠాత్మక ఫార్ములా ఈ రేసింగును నిర్వహించనుండటంతో అటువంటి క్రీడను ఆంధ్రప్రదేశ్ లోను చూడాలని అక్కడి వారు ఆశించటం సహజం. ఇదే విషయంపై ఒక విలేకరి అక్కడి మంత్రి గుడివాడ అమరనాథ్ ను అడగ్గా.. అందుకు ఆయన ఇచ్చిన సమాధానం ఇప్పుడు ప్రతిపక్షాలు విరుచుకు పడేందుకు అవకాశం కల్పించింది. కోడి.. గుడ్డును మాత్రమే పెడుతుందని, ఆ గుడ్డును పెట్టగా చేయటానికి సమయం పడుతుందని, కోడి నేరుగా పెట్టను పెట్టదని మంత్రి తన సమాధానంలో వివరించారు. ఏపీలో కోడి ఇప్పుడే గుడ్డును పెట్టిందనీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాదు వంటి నగరాన్ని తయారు చేసుకోవాల్సివుందనేది ఆయన ఉద్దేశం. విశాఖపట్నమే తమ రాజధాని అని ముఖ్యమంత్రి జగన్ ఇటీవలే స్పష్టం చేసినందున విశాఖలో ఫార్ములా రేసింగు వచ్చితీరుతుందని ఆయన చెప్పివుంటే ఏ సమస్య వచ్చివుండేదికాదు. అలా కాకుండా గుడ్డు, పెట్ట అని చెప్పటం వల్ల ట్రోల్స్ నిర్మాతలకు చేతినిండా పనిదొరికింది. సినిమాల్లోని కొడిగుడ్డు, కోడి పెట్ట సన్నివేశాలను అన్నింటిని వెతికి తీసి మంత్రి వ్యాఖ్యలను వాటికి జోడించి వాటితో యూట్యూబ్ ఛానల్ ను వారు నింపేస్తున్నారు.
గాడిద గుడ్డు నానుడి ఎలా ఆవిర్భవించిందో వివరించే యూట్యూబులోని కథనం ఇది
ఇదే సమయంలో అసలు ‘గాడిద గుడ్డు.. కంకర పీసు’ అనే నానుడి ఏలా వచ్చిందో ప్రస్తుత తరాల వారికి చెప్పితీరాలని మరికొందరు ఔత్సాహికులు నిర్ణయించుకొని సామాజిక మాధ్యమాలకు పనిపెడుతున్నారు. బ్రిటీష్ వారు పాలించిన ప్రాంతాల్లో.. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో గాడిద గుడ్డి.. కంకర పీసు అనేది కొన్నేళ్ల క్రితం వరకు విరివిగా వినిపించేది. అప్పట్లో బ్రిటీష్ వారి ప్రార్ధనలో ‘ గాడ్ ఈజ్ గుడ్.. కాంక్వెర్ పీస్ ’ అని ఉండేది. భగవంతుడు మంచివాడని, ఆయన్ని ప్రార్ధిస్తే శాంతిని సాధించవచ్చేది ప్రార్ధన సారాంశం. అయితే స్థానికులకు ఆ వాక్యాలను ఎలా పలకాలో తెలియకపోవటం వల్లో లేదా పరాయి వారు వచ్చి ఇక్కడ ప్రార్ధనలను నేర్పించటం ఏమిటనే తిరుగుబాటు ధోరణి వల్లో వాటిని ‘గాడిద గుడ్డు.. కంకర పీసు’ గా మార్చివేశారు. ఏదైనా జరగని పని గురించి చెబుతుంటే.. ‘గాడిద గుడ్డేమి కాదు?’ అనే నానుడి అన్ని ప్రాంతాల్లోను ఇప్పుడు స్థిరపడింది. ఏదేమైనా.. మంత్రి అమరనాథ్ కారణంగా మళ్లీ బ్రిటీష్ వారి ఏలుబడి గురించి, గాడిద గుడ్డు గురించి మననం చేసుకోవటానికి ఆస్కారం ఏర్పడింది.