‘బురుజు’: ఎప్పుడో పదవీ విరమణ అనంతరం అందుకొనే పింఛను కోసం సైతం ఉద్యోగులు ఆందోళన పడే పరిస్థితి ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోను నెలకొంది. అధికారంలోకి వస్తే.. కొత్త పింఛను విధానాన్ని (ఎన్.పి.ఎస్) రద్దు చేసి.. పాత పింఛను విధానాన్ని తెస్తామంటూ పాదయాత్రల్లో బ్యానర్లను చేతపట్టి మరీ నాటి ప్రతి పక్షనేతగా జగన్ హామీ ఇవ్వటంతో ఆంధ్రప్రదేశ్ లోని 1.93 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు సర్కారు ఉత్తర్వుల కోసం రెండేళ్లగా ఎదురు చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అటువంటి హామీని 2019 ఎన్నికల సమయంలో ఇవ్వకున్నప్పటికీ.. ఇక్కడి 1.32 లక్షల మంది ఉద్యోగులూ చాలా కాలంగా పాత పింఛను పద్దతి పునరుద్ధరణకు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సర్కారు చర్యల కోసం తెలంగాణ ఉద్యోగులూ ఆసక్తి కనబరుస్తున్నారు. కొత్త పింఛను విధానమంతా షేర్ మార్కెట్ల ఆధారంగా పనిచేయనుండటం వల్లనే ఉద్యోగులకు దీనిపై 17 సంవత్సరాలు దాటినా నమ్మకం కుదరటంలేదు. ఉద్యోగి నుంచి ప్రతి నెల అతని మూల వేతనం నుంచి మినహాయించే 10 శాతం మొత్తాన్ని, దానికి ప్రభుత్వం తన వాటాగా జోడించే మరో 10 శాతం మొత్తాన్ని షేర్ మార్కెట్లలో పెట్టుబడిగా పెట్టి అక్కడ వచ్చే లాభాలకు అనుగుణంగానే పింఛనను చెల్లిస్తారు. ఇటువంటి పద్దతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004, సెప్టెంబరు 1వ తేదీ నుంచి అమల్లోకి రాగా.. ఆ తర్వాత ఉభయ రాష్ట్రాల్లోనూ అదే కొనసాగుతోంది. పాత పింఛను విధానంలోనైతే ఉద్యోగి ఆఖరి మూల వేతనానికి అనుగుణంగా పింఛను అందుతుంది. దీనిలో ఇక ప్రతి నెల ఉద్యోగి తన వాటాను చెల్లించాల్సిన అవసరమే లేదు. పాత పింఛను విధానంలో ఇటీవల అందుబాటులోకి వచ్చిన.. ‘‘వయస్సు పెరిగే కొద్దీ అదనపు పింఛను’‘ అనే సదుపాయం కొత్త పింఛనుదారులను సహజంగానే మరింతగా పాతదానిపై మనస్సు మళ్లటానికి పురిగొల్పుతోంది. ప్రతి ఉద్యోగి జీవితంతో ముడిపడి ఉన్న పింఛనును సైతం రాజకీయ స్వప్రయోజనాలకు వాడుకోవాలనే భావన కారణంగానే దానిపై నాటి ప్రతిపక్ష నేత జగన్ ఎడాపెడా హామీలను ఇవ్వగలిగారు. అంతకు మందటి తెలుగుదేశం ప్రభుత్వం.. అప్పటి ఐఏఎస్ అధికారి టక్కర్ సారధ్యంలో ఒక కమిటీని వేసి, అదిచ్చిన నివేదిక ఆధారంగా కొత్త పింఛను విధానానికి కొన్ని మార్పులను తీసుకొచ్చింది. కుటుంబ పింఛను, గ్రాట్యుటీ వర్తింపు ఇటువంటి సంస్కరణల్లో ప్రధానమైనవి. పాత పింఛనుకు, కొత్త పింఛనుకు ఎంత వ్యత్యాసం ఉంటే అంత మొత్తాన్ని చెల్లిస్తామంటూ తెలుగుదేశం ప్రభుత్వం ఒక ప్రతిపాదన తేగా.. జగన్ అధికారంలోకి వస్తే ఏకంగా కొత్త పింఛను విధానమే రద్దై పోతుందంటూ ఉద్యోగ సంఘాలు ఆనాడు సమాధానమిచ్చాయి. దీంతో ఆనాడు నష్టాన్ని పూడ్చటంపై ఉత్తర్వులూ వెలువడలేదు..ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ తన హామీనీ నెరవేర్చటంలేదు. పైగా.. పరిశీలనకు కమిటీలు ఏర్పాటు చేశామని, తగిన సిఫార్సులు చేయాలంటూ ప్రైవేటు కన్సల్టెన్సీకి బాధ్యతలు అప్పగించామని వంటి కారణాలు చెబుతూ కాలయాపన చేస్తున్నారు. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తప్ప కాంగ్రెస్, భాజాపా తదితర పార్టీలన్నీ అధికారంలోకి వస్తే సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛనును పునరుద్ధరిస్తామంటూ 2019 ఎన్నికల్లో ప్రకటించాయి. నాటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తెరాస.. తాను అటువంటి ఎన్నికల హామీ ఏదీ ఇచ్చి ఉండకపోవటంతో సహజంగానే ఈ అంశంపై మౌనంగానే ఉంటోంది. ఉద్యోగుల నుంచి రాబడుతున్న మొత్తాలను సంబంధిత ఖాతాల్లో సక్రమంగా జమచేయటం లేదంటూ భారత కంప్ట్రోలర్ అడిటర్ జనరల్ (కాగ్ ) తరచు తన నివేదికల్లో ఎత్తి చూపుతున్నా అంతర్గత సమస్యల పరిష్కారానికి ఉభయ రాష్ట్రాలు చొరవ కనబర్చటంలేదు. షేర్ల మార్కెట్టుకు అనుగుణంగా పింఛను అందుకోవటమేమిటంటూ ఆందోళన చెందుతున్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు.. అసలు తమ నుంచి వసూలు చేస్తున్న సొమ్ము సకాలంలో నేషనల్ సెక్యురిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ ( ఎన్.ఎస్.డి.ఎల్)లో సక్రమంగా జమకావటంలేదని కాగ్ నివేదికల ద్వారా తెలుసుకొని మరింతగా కలవరపడుతున్నారు. ( కొత్త పింఛను విధాన్ని శరవేగంగా తీసుకొచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి సర్కారు : వచ్చేవారం ‘బురుజు’లో )