రామదాసు కాలంలోనే.. ఆలయ నిర్మాణానికి మహిళల విరాళాలు! (మూడో భాగం)
personBuruju Editor date_range2022-11-14
పురావస్తు శాఖ అధికారి వెంకోబారావు 1920లో వెళ్లేనాటికి భద్రాచలం ఆలయం ఇలా ఉండేది
బురుజు.కాం Buruju.com : ( భక్త రామదాసుగా Bhakta Ramadas పేరు పడ్డ కంచెర్ల గోపన్న జీవితంలోని వాస్తవ విషయాలను తెలుసుకోవటానికి పరిశోధనలను చేపట్టాల్సిన అవసరం ఎంత్తైనా ఉంది. ఆయనకు సంబంధించి కొంగ్రొత్త విషయాలతో Buruju.com అందిస్తున్న కథనాల్లో ఇది మూడోవది) పురావస్తు శాఖ అధికారి వెంకోబారావు.. వందేళ్ల క్రితం (1920లో) భక్త రామదాసుకు చెందిన ఆధారాల కోసం భద్రాచలం Bhadrachalam ఆలయానికి వెళ్లగా అక్కడ రామదాసువి కాకుండా మరికొందరి విషయాలు తెలిశాయి. ముగ్గురు మహిళలు భద్రాచలం ఆలయంలోని వివిధ నిర్మాణాలకు విరాళాలను అందజేసినట్టుగా తెలిపే శాసన మొకటి అప్పట్లో వెంకోబారావుకు కనిపించింది. ఆ ముగ్గురు మహిళలు భక్త రామదాసు కాలంనాటి వారిగా ఆయన తేల్చారు. ఆలయ నిర్మాణం కోసం సర్కారు సొమ్మును ఉపయోగించినందుకే రామదాసును 12ఏళ్లు ఖైదు చేశారనే కథ జన బాహుళ్యంలో ఉన్న నేపథ్యంలో.. వెంకోబారావు వెల్లడించిన విషయాలకు ఇప్పటికీ చాలా ప్రాధాన్యం ఉన్నట్టే.
రాముడికి తొలుత చిన్న గుడిని ఏర్పాటు చేసిన భద్రాచల వాసి పోకల దమ్మక్క
వెంకోబారావు తన నివేదికలో ఇలా రాశారు.. ‘‘ ఆలయంలోని అద్దాల మేడ వద్ద 17వ శతాబ్ధానికి చెందినదిగా భావించే ఒక విరిగిన స్థంభం కనిపించింది. దానిపై గల రాతలు అంతగా చదవటానికి వీలుకాకుండా ఉన్నాయి. ఒకామె పేరు పద్మనాయక. తండ్రి పేరు కనిపించటంలేదు. తల్లి పేరు సురప్ప . ఆమె భద్రాచల ఆలయంలోని ముఖ మండపం, రఘునాయక ఆలయ ప్రాకారాలను నిర్మించింది. నిత్య కైంకర్యాలు, పండగలకు , సేవకులకు కావాల్సిన సరుకులను అందజేసింది. స్థంభంపై అప్పలమ్మ గారి పేరుంది. ఆమె ముత్యాల రామక్క కుమార్తె. ఆమె పేరు పక్కన నమ్మళ్వార్ ప్రతిమ చిత్రించి ఉంది. అదే కుటుంబానికి ఛెందిన మరో మహిళ పేరు అక్కం అని ఉంది. రఘునాయక ఆలయ భోగ మండపాన్ని ఈమె నిర్మించింది. 17వ శతాబ్ధం తొలినాళ్లలో ఈ ముగ్గురు మహిళలు ఆలయ భవనాలకు విరాళాలను ఇచ్చినట్టుగా ఉంది. వీరిని భక్త రామదాసు కాలంనాటి పెద్దలుగా పరిగణించొచ్చు. దమ్మక్క అనే ఆమె తొలుత ఒక చిన్న గుడిని నిర్మించిన కథకు వారు ప్రేరేపితులై ఉండొచ్చు. పాత శాసనాలు లభించకపోవటం నిరుత్సాహం కలిగించింది’’ అని వివరించారు.
సర్కారు ఖజానాకు చేరాల్సిన సొమ్ముతో గుడిని కట్టించినందునే భక్త రామదాసును ఖైదు చేశారని ఇప్పటికి పలువురు పుస్తకాలను రాస్తూనే ఉన్నారు. మరి.. రామదాసు సమయంలోనే వివిధ కట్టడాల నిర్మాణాలకు విరాళాలు ఇచ్చిన వారి మాటెమిటి? ఇది మరింత పరిశోధన చేయాల్సిన అంశం
చరిత్రకారులకు వెంకోబారావు నివేదిక మంచి ఆధారమయ్యింది. రామదాసు.. గోల్కొండ చెరశాలలోనే చనిపోయారనే వాదనలను కొట్టిపాడేయ్యటానికి ఆ నివేదిక తోడ్పడింది. చరిత్రకారులు వంగూరు సుబ్బారావు.. 1957లో వెలువరించిన తన ‘శతక కవుల చరిత్ర’ అనే గ్రంధంలో కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చెరశాల నుంచి బయటకు రాకుండా గోపన్న అక్కడే చనిపోయినట్టుగా జిల్లా మాన్యువల్లో చూశానంటూ బ్రహ్మయ్య శర్మ అనే ఆయన తనకొక లేఖను రాశారని, వెంకోబారావు నివేదిక, మరికొందరు రాతలను బట్టి ఆ లేఖలోని విషయం వాస్తవం కాదని స్పష్టమవుతోందని వంగూరు సుబ్బారావు తన గ్రంధంలో తెలిపారు. 1922లో మద్దాలగురు బ్రహ్మశర్మ అనే ఆయన నర్సరావు పేట నుంచి తనకు రాసిన లేఖలో.. అక్షరాలు ధ్వసం చేసి ఉన్న శాసనం గురించి వివరించారని , ఆ శాసనం కోవెల దక్షిణం దిశలో నిలువు రాళ్లమీద ఉందని, దానిని అప్పటికి 80-90 ఏళ్లకిందట రాసినట్టుగా కనబడుతున్నట్టుగా ఆయన అభిప్రాయపడ్డారని తెలిపారు( నాలుగో భాగం వచ్చేవారం)