ప్రభుత్వోద్యోగికి 62.. మరి తిరుమలలో సేవ చేద్దామంటే 50 ఏళ్ల పరిమితేమిటి?
personBuruju Editor date_range2023-01-12
తిరుమలలో సేవలకు సిద్ధమవుతున్న శ్రీవారి సేవకులు
బురుజు.కాం Buruju.com : ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వోద్యోగి 62 ఏళ్లు దాటే వరకు ఉద్యోగం చేయొచ్చు. తిరుమలలో ఉచితంగా సేవలు అందిద్దామంటే మాత్రం.. భక్తులకు వయో పరిమితి 60 ఏళ్లు. పర్వదినాల్లోనైతే అటువంటి వయోపరిమితి 50 ఏళ్లే. జీవితంలో అనేక ఒడిదుడుకులను చవి చూసిన తర్వాత.. చాలా మంది ఆధ్యాత్మిక చింతన వైపు మళ్లుతుంటారు. అందుకే.. చాలా మంది తిరుమల కొండపై సేవలను అందజేసేందుకు తహతహలాడుతుంటారు. సరిగ్గా అటువంటి సమయంలోనే వయస్సును చూపించి ఆంక్షలు విధించటం సమంజసమేనా? ఇది చర్చనీయాంశం.
తిరుమల కొండపైకి వచ్చే భక్తులకు ఇలా నామాలు పెట్టటమూ సేవే
తిరుమలకు నిత్యం 55 వేల నుంచి 60 వేల మంది భక్తులు వస్తుంటారు. పర్వదినాల్లోనైతే వారి సంఖ్య ఒక లక్ష వరకు ఉంటుంది. దేశం నలు మూలల నుంచి ఇంతటి భారీ సంఖ్యలో వచ్చే భక్తులకు వివిధ రకాల సేవలను ఉచితంగా అందజేసే ‘శ్రీవారి సేవకులు’ విధానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) 2000 సంవత్సరంలో ప్రవేశపెట్టింది. రోజుకు దాదాపు వెయ్యి మంది, పర్వదినాల్లోనైతే దాదాపు మూడు వేల మంది వరకు సేవకులుగా ఉండేందుకు దేవస్థానం అనుమతి ఇస్తుంది. కొండపైన, దిగువన.. దాదాపు 60 ప్రాంతాల్లో వీరు ఉంటారు. ప్రధానంగా.. ఆలయం, విజిలెన్సు, వైద్యం, అన్న ప్రసాదాలు, లడ్డూ ప్రసాదం, రవాణా, కల్యాణకట్ట, బుక్ స్టాళ్లు.. వంటి చోట్ల సేవలు అందిస్తుంటారు. ఎవరిని ఏ సేవలకు పంపాలనేది కంప్యూటర్ నిర్ణయిస్తుంది. హుండీలోని కానుకలను లెక్కపెట్టే సేవలను మాత్రం ప్రభుత్వ కొలువుల్లోని వారికే అప్పగిస్తుంటారు.
పువ్వులు కుడుతున్న శ్రీవారి సేవకులు
సేవకులుగా వ్యవహరించదలచుకొన్నవారికి తితిదే పలు నిబంధనలను అమలు చేస్తోంది. వారు నిర్ధేశిత వయోపరిమితులతో పాటుగా ఆరోగ్యవంతులై ఉండాలి. తుది నిర్ణయం దేవస్థానం అధికారులదే. రోజులో ఎక్కువ సమయం పనిచేయాల్సివుంటుంది కనుకనే వారి శారీరక, మానసిక ఆరోగ్యాలు చాలా అవసరమని దేవస్థానం పేర్కొంటోంది. మామాలు రోజుల్లో సేవకుల వయస్స 18-60 ఏళ్లుగా నిర్ధేశించగా.. వైకుంఠ ఏకాదశి, రథ సప్తమి, వేసవి సెలవులు, బ్రహ్మోత్సవాల సమయంలో గరిష్ట వయస్సును 10 ఏళ్లు తగ్గించేసి.. 50కి పరిమితం చేస్తున్నారు. జీవిత కాలం పెరిగిందనే కారణాన్ని చూపించి.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉద్యోగుల వయోపరిమితిని 2022, జనవరిలో 62 ఏళ్లకు పెంచింది. విశ్వ విద్యాలయాల్లోనైతే 65 ఏళ్లు. శ్రీవారి సేవకులకు కనీసం 62 ఏళ్ల వరకైనా అనుమతించాలికదా? సేవలు అందిస్తామని ఎక్కువ మంది ముందుకొస్తున్నప్పుడు వారిని ఆహ్వానిస్తే.. దేవస్థానానికి ఇబ్బందేముంటుంది?
శ్రీవారి సేవకులకు డార్మిటరీలో కేటాయించే మంచాలు
సేవకులకు ప్రత్యేక గదులంటూ కాకుండా.. పెద్ద హాలు ( డార్మిటరీలు)లోనే వసతిని కల్పిస్తుంటారు. వాటిలోని మంచాలు.. పైన, కింద రెండేసి పడకలు చొప్పున కలిగి ఉంటాయి. సామూహిక స్నాన గదులనే సేవకులు ఉపయోగించుకోవాలి. సేవ చేయటమే మహా భాగ్యంగా పరిగణించే భక్తులు.. అక్కడి వసతుల కోసం ప్రాకులాడరు. అటువంటప్పుడు.. వయోపరిమితిని పెంచి ఎక్కువ మందిని అనుమతించినా దేవస్థానానికి వచ్చే ఇబ్బందులేవీ ఉండబోవు. శ్రీవారి సేవకులు విధానాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇంతవరకు 22 ఏళ్ల వ్యవధిలో.. 14 లక్షల మందికి పైగా భక్తులు సేవలను అందించినట్టు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ఇటీవల ఒక సందర్భంలో పేర్కొన్నారు. వసతి గదుల అద్దెలను విపరీతంగా పెంచటం వంటి అంశాలకు బదులు.. సేవకులను ఎక్కువ సంఖ్యలో అనుమతించటం వంటి కార్యక్రమాలకు పాలకమండలి ప్రాధాన్యమివ్వాలి.