ప్రధాని సమక్షంలో.. జగన్ ప్రస్తావించిన ముగ్గురు కవులూ అసలు చెప్పిందేమిటి?
personBuruju Editor date_range2022-11-13
నవంబరు 12వ తేదీన విశాఖపట్నం సభా వేదికపై ప్రధాని మోదీ, సీఎం జగన్
బురుజు.కాం Buruju.com : జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయంటూ లక్షలాది జనం విశాఖకు కదలి వచ్చారని అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వ్యాక్యానించారు. విశాఖపట్నంలో.. నవంబరు 12వ తేదీన ప్రధాన మంత్రి మోదీ పాల్గొన్న సభలో ఆయన తెలుగులో మాట్లాడుతూ.. శ్రీశ్రీ, గురజాడ, వంగపండు రచనలను ఉటంకించారు. సభకు వచ్చిన జనాన్ని చూసి ఆయన కవితలు, గేయాలను పేర్కొన్నప్పటికీ.. అసలు ఆయా కవులు ఎటువంటి నేపథ్యంతో వాటిని రాసిందీ పరిశీలిస్తే మాత్రం.. సీఎం వాటి గురించి పూర్తిగా తెలిసే ప్రస్తావించారా? అనే అనుమానాలు తప్పక వస్తాయి.
జగన్నాథ రథ చక్రాల గురించి రాసిన మహాకవి శ్రీశ్రీ
మహాకవి శ్రీశ్రీ 1940లో వెలువరించిన ప్రఖ్యాత ‘మహాప్రస్థానం’ లోని ఆఖరి కవితే ‘జగన్నాథుని రథ చక్రాలు’. ఆయన భావనలో.. జగన్నాథుని రథం ఆదర్శ సమాజానికి చిహ్నం. అటువంటి రథం ఆకాశపు దారులంటా హడావిడిగా వెళ్లిపోతోందని, దాన్ని భూ మార్గం పట్టిస్తానని శ్రీశ్రీ తన కవితలో పేర్కొన్నారు. రథ చక్రాలు ‘వొస్తున్నాయోస్తున్నాయి ’ అని చెప్పి చివరిలో ‘వచ్చేశాయోచ్చేశాయి’ అనీ రాశారు. అప్పట్లో సామ్యవాద దేశమైన సోవియట్ రష్యాను పరిగణనలోకి తీసుకొనే ఆయన ఈ కవిత రాసినట్టు సాహిత్యకారులు తేల్చారు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. జగన్ అధికారంలోకి వచ్చి మూడున్నర ఏళ్లు అయ్యింది. సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతూ ఇతర రాష్ట్రాల వారికి ఆదర్శంగా పాలిస్తున్నట్టుగా నిత్యం దిన పత్రికల్లో ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు. జనం ఇంకా ఎటువంటి ఉచిత పథకాలను కాంక్షించి.. జగన్నాధ రథ చక్రాలు వస్తున్నాయంటూ విశాఖకు తరలి వచ్చారో తెలియదు. ‘జగన్నాథ’లో తన పేరు ఉన్నందున ముఖ్యమంత్రి ఈ వ్యాక్యాన్ని ప్రస్తావించి ఉంటారనీ భావించొచ్చు.
ఏం పిల్లడో ఎల్దమొస్తువా? గీతాన్ని రాసిన వంగపండు ప్రసాదరావు
ఇక జగన్ పేర్కొన్న వాటిలో మరొకటి.. ‘ఏం పిల్లడో ఎల్దమొస్తువా? ’ గేయం. దీన్ని దివంగత విప్లవకవి వంగపండు ప్రసాదరావు రాశారు. ఉమ్మడి రాష్ట్రంలో.. 1980 ప్రాంతాల్లో ఎంతో మంది యువతీ యువకులు అడవి మార్గం పట్టటంలో ఈ పాట పాత్ర చాలానే ఉంది. ఆ పాటలో పొందుపర్చిన ప్రాంతాలన్నింటిలోను ఆనాడు నక్సలైట్ కార్యకలాపాలు చాలా ఎక్కువగా ఉండేవి. విశాఖపట్నం సభకు కదలివచ్చిన జనాన్ని చూస్తుంటే తనకు వంగపండు పాడిన ‘ఎంపిల్లడో ఎల్దమొస్తవా’ పాట గుర్తుకొస్తోందని జగన్ వ్యాక్యానించారు. ఆనాడు అడవుల దారి పట్టించేందుకు సాయపడిన పాట ఇప్పుడు విశాఖలోని మోడీ సభకు వచ్చన జనాన్ని చూసినప్పుడు మదిలో మెదిలిందంటే ఆ పాట నేపథ్యం సీఎంకు తెలిసివుండకపోవచ్చు. మరో విశేషమేమిటంటే.. అమరావతి రైతులు తమ అరసవెల్లి పాదయాత్ర సందర్భంగా ప్రత్యేకంగా రాయించుకొన్న పాటల్లో ‘ ఏం పిల్లో ఎల్దమొస్తవా?’ బాణీ పాట కూడా ఉంది.
దేశమంటే మునుషులని చాటి చెప్పిన గురజాడ అప్పారావు
‘దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్’ అంటూ గురజాడ మనందరికీ కర్తవ్యబోధ చేస్తున్నారని జగన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. గురజాడ గేయంలోని వ్యాక్యలకు ఆరుద్ర తన ‘ సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ నాలుగో సంపుటిలో ఇలా విశ్లేషించారు.. ‘‘ దేశ ప్రగతి ఆ దేశపు ఆర్థిక విధానంపై ఆధారపడి ఉంటుంది. ఉత్పత్తి పెరిగితేనే పాడి పంటలు పొంగిపొరలే అవకాశం దేశానికి వస్తుంది. దేశమంటే మట్టికాదు.. మనుషులు. కండకలవాడే మనిషి. కండతోనే కాయకష్టం చేయాలి. మనిషి డబ్బు తేగలగాలి..’’ ఇటువంటి భావాలతోనే గురజాడ అప్పారావు దేశభక్తి గీతాన్ని రచించారని ఆరుద్ర పేర్కొన్నారు. అంటే ప్రజలకు సొమ్మును పంచిపెట్టటం కాకుండా.. దాన్ని సంపాదించే మార్గాలను సూచించాలనేది గురజాడ గేయం సారాంశం. ఏపీలో అటువంటి విధానాలను తేవాల్సిన అవసరం ఉంది.