బురుజు.కాం Buruju.com : మునుగోడు munugodu ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను కీలక ములుపు తిప్పుతోంది. గవర్నరు తమిళిసై పై గత కొద్ది నెలలుగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ధ్వజమెత్తుతుండగా.. ఇప్పుడు ఉభయ కమ్యునిస్టులూ ఆ పార్టీకి తోడయ్యారు. ఏకంగా గవర్నరు వ్యవస్థనే రద్దు చేయాలని సీపీఐ, సీపీఎం డిమాండ్ చేస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో కమ్యునిస్టులతో జతకట్టటం వల్లనే అక్కడ తెరాస విజయాన్ని సాధించగలిగిందని రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే తేల్చారు. తెరాసతో పొత్తు కొనసాగింపు ద్వారా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తాము కొన్ని స్థానాలను పొందవచ్చని భావిస్తున్న కమ్యునిస్టులు.. ఇక నుంచి తెరాస చేపట్టే ప్రతి ఆందోళనలోను సహజంగానే భాగస్వాములు అవుతారు.
కమ్యునిస్టులకు కాలం చెల్లిందని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాక్యానించిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ బాగా బలహీన పడి.. భారతీయ జనతా పార్టీ (భాజపా) బలోపేతమవుతుండటంతో కేసీఆర్ కు ఇప్పుడు కమ్యునిస్టుల స్నేహం అవసరమయ్యింది. ముఖ్యంగా.. ఉమ్మడి నల్గొండ జిల్లా ఒకప్పుడు కమ్యునిస్టులకు కంచుకోటలా ఉండేది. ఇప్పటికీ ఆ పార్టీలను అభిమానించేవారు అక్కడ ఉండటం వల్లనే మునుగోడు ఉప ఎన్నికలో భాజపాను అధికార పార్టీ ఓడించగలిగింది. ఉప ఎన్నికల్లో తెరాస విజయాన్ని సాధించగానే కమ్యునిస్టులు అధికార పార్టీకి అండగా ప్రకటనలు ఇవ్వటం మొదలు పెట్టారు. ప్రధాన మంత్రి మోదీ పర్యటించే రోజున రామగుండంలో బందును పాటించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని ప్రధాని మోదీ ద్వంసం చేశారని ఆయన విమర్శించారు. సీఎం కేసీఆర్.. గత కొంత కాలంగా కేంద్రాన్ని ఢీకొంటూ.. దేశ రాజకీయాలను మార్చటానికంటూ ఏకంగా తెరాస పేరును భారత్ రాష్ట్ర సమితి (భారాస)గా మారుస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో ఇప్పుడు తెలంగాణలోని కమ్యునిస్టు నాయకులూ ప్రధానిపై బాణాలను ఎక్కుపెడుతున్నారు.
గవర్నరు తమిళిసైకి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు గత కొద్ది నెలలుగా ఏమాత్రం పొసగటం లేదు. తాను పర్యటనలకు వెళ్లినప్పుడు ప్రభుత్వం అసలు పట్టించుకోవటం లేదని తొలి దశలో వాపోయిన గవర్నరు.. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని వివిద సందర్భాల్లో విమర్శించటం మొదలు పెట్టారు. గవర్నరు గతంలో తమిళనాడులో భాజపాలో ఉండేవారని, ఇప్పుడూ ఆ పార్టీ నాయకురాలిగానే వ్యవహరిస్తున్నారని తెరాస నాయకులు విమర్శిస్తుండగా.. మునుగోడు ఎన్నిక తర్వాత కమ్యునిన్టులు ఏకంగా గవర్నరు వ్యవస్థే దండగంటూ తెరాసకు మరింత అండగా నిలుస్తున్నారు. గవర్నరు వ్యవస్థ రద్దునకు సీపీఐతో కలసి ఉద్యమిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. ఇలా ఇప్పుడు మూడు పార్టీలు జతకలసి దాడి చేస్తుండటంతో గవర్నరు తమిళిసై కూడా తన విమర్శలను తీవ్రతరం చేశారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో తననూ లాగవచ్చనే అనుమానాలు వస్తున్నాయని వాపోయారు. మొత్తం మీద మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెసును మరింత బలహీనపర్చగా.. కమ్యునిస్టులకు మాత్రం బలాన్ని ఇచ్చింది.