వైఎస్ వివేకానంద గురించి షర్మిల చెప్పింది నూరు శాతం నిజం
personBuruju Editor date_range2023-01-25
షర్మిల
పిళ్లా సాయికుమార్ Buruju.com : ప్రజల సమస్యల పరిష్కారానికి బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి YS Vivekandanda reddy ఎటువంటి చొరవ చూపించేవారో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ YSRTP అధినేత్రి షర్మిల చెప్పిన మాటలు నూటికి నూరు శాతం వాస్తవం. ఉన్నత స్థానంలో ఉండి కూడా వివేకానంద రెడ్డి.. దిగువ స్థాయిలోని అధికారుల వద్దకు వెళ్లి.. ఒక సామాన్యుడి మాదిరిగానే వినతులను సమర్పించేవారు. అధికారులను తమ ఇళ్ల చుట్టు తిప్పించుకొంటూ.. పలానా పని కాకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సివుంటుందంటూ హెచ్చరికలు చేసే ప్రస్తుత నాయక గణాలు.. వివేకానంద రెడ్డి వ్యవహార శైలి గురించి తప్పక తెలుసుకోవాలి.
షర్మిల.. ఆమె బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి
సమస్యలపై ప్రజల నుంచి వినతి పత్రాలను అందుకొని.. ‘పరిశీలిస్తాం’ అని చెప్పే నాయకులే మనకు అన్ని చోట్ల కనిపిస్తారు. వారిలో చాలా మంది.. ఆ తర్వాత అసలు ఆ పత్రాలనే పట్టించుకోరు. వివేకానంద రెడ్డి శైలి మాత్రం ఇందుకు భిన్నంగా ఉండేది. అందుకే ‘‘ ఆయన చాలా గొప్ప నాయకులు. కడప జిల్లాలో.. సమస్య చెప్పిన వ్యక్తుల్ని వెంటబెట్టుకొని అధికారుల వద్దకు వెళ్లి.. వారితో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కారాన్ని చూపించేవారు’’ అని షర్మిల.. 2023, జనవరి 24వ తేదీన హైదరాబాదులో విలేకర్ల సమావేశంలో కొనియాడారు.
ఎంపీగా వివేకానంద రెడ్డి
వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాదులో చోటు చేసుకొన్న ఒక సంఘటన షర్మిల వ్యాఖ్యలకు అద్దం పడుతోంది. అప్పట్లో..
భూ సమస్యలు చాలా ఎక్కువగా ఉండేవి. సమస్యలపై అప్పటి మంత్రి కోనేరు రంగారావు సారధ్యంలో.. ముఖ్యమంత్రి ఒక కమిటిని వేసి.. అది చేసిన సిఫార్సుల అమలకు జిల్లాల్లో ప్రత్యేకంగా యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. దీని రాష్ట్ర స్థాయి పర్యవేక్షక విభాగం హైదరాబాదు నాంపల్లిలో గల భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనరు ( సీసీఎల్ఏ-CCLA) కార్యాలయం ప్రాంగణంలో ఉండేది. ఇటువంటి నేపథ్యంలో.. ఒక సారి వివేకానంద రెడ్డి.. సీసీఎల్ఏ కార్యాలయానికి వచ్చారు. ఆయన వెంట ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వారిని బయట నిలబెట్టి .. అదే ప్రాంగణంలో.. ప్రధాన గేటుకు ఎడమవైపున గల ఆర్డీవో స్థాయి అధికారి గదిలోకి వచ్చారు. కోనేరు కమిటీ సిఫార్సుల అమలు విభాగంలో ఆ అధికారి ఉండేవారు. హైదరాబాదులో ‘ఈనాడు’ పత్రిక ప్రతినిధిగా పనిచేస్తున్న నేను.. ఆ సమయంలో ఆ అధికారికి ఎదురుగా కూర్చుని ఉన్నాను.
వివిధ కారణాల వల్ల.. ఏళ్లు గడుస్తున్నా సీబీఐ పరిశోధన కొలిక్కి రావటంలేదు
అప్పటికి వివేకానంద రెడ్డి.. కడప ఎంపీగా ఉన్నారు. మరో వైపు.. సోదరుడు ముఖ్యమంత్రి. అయినప్పటికి ఆయనలో ఎటువంటి అధికార దర్పం నాకు కనిపించలేదు. ఆ అధికారితో విధేయతతో మాట్లాడిన తీరు నన్ను చాలా ఆశ్చర్యపర్చింది. సమస్యను చెప్పి.. నిబంధనలు అనుకూలిస్తే కాస్త వేగంగా సమస్యను పరిష్కరించాల్సిందిగా చెప్పి.. ఒక వినతి పత్రాన్ని సైతం అందజేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలా వెళ్లిపోయాక ఆయన వ్యవహార తీరును ఆ అధికారి ఎంతగానో మెచ్చుకొన్నారు. అంతేకాదు.. అప్పటికప్పుడే నా ఎదురుగానే ఆ ఆ వినతి పత్రంలోని సమస్యపై తన సిబ్బందితో మాట్లాడారు. బాబాయిని తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డే ఇలా తయారు చేసుకొన్నారని షర్మిల Sharmila .. హైదరాబాదులోని విలేకర్ల సమావేశంలో కొనియాడారు. కడప జిల్లాలో అంతటి ప్రజాదారణ గల నాయకుడిని హత్య చేసిన వారిని వేగంగా పట్టుకొన్నప్పుడే సీబీఐపైన , వ్యవస్థలపైన ప్రజలకు నమ్మకం ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు.