తెరాస జాతీయ పార్టీగా మారటంతో తెలుగుదేశానికి పునర్జీవం?
personBuruju Editor date_range2022-10-22
కొత్త రూపంలో చంద్రబాబు.. ఇక తెలంగాణలోనూ జోరు చూపించొచ్చు
బురుజు.కాం Buruju.com : తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాసTRS) .. భారత రాష్ట్ర సమితి (భారాస BRS )గా పేరు మార్చుకొని జాతీయ పార్టీగా మారటంతో ఇక ఆంధ్రప్రదేశ్ తో సహా ఏ రాష్ట్రంలోనైనా సరే ఆ పార్టీ పోటీచేయవచ్చు. అదే సమయంలో.. ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు తెలంగాణలో పోటీచేసినా ఇంతకు ముందటి మాదిరిగా తెరాస నాయకులు విమర్శించేందుకు ఇప్పుడిక వీలుకాదు. అందువల్ల.. తెలుగు దేశం పార్టీ తెలంగాణలో మళ్లీ పుంజుకొనేందుకు తాజా పరిణామాలు తప్పక దోహదపడతాయనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. ఆ పార్టీ హైదరాబాదులో తిరిగి ప్రాణం పోసుకొంటే.. సీమాంధ్రుల ద్వారా ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైనా పడుతుంది. ఇటువంటి పరిణామాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అంచనావేసి ఉండకపోరని , భారాస ఏర్పాటు వెనుక భారీ రాజకీయ వ్యూహమే ఉంటుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
జాతీయ పార్టీ అధినేత కావటంతో ఇక మునుపటి మాదిరిగా తెలుగు దేశం పార్టీని ఆంధ్రుల పార్టీ అంటూ ధ్వజమెత్తే అవకాం కేసీఆర్ కు ఉండబోదు
తెలుగు దేశం పార్టీకి ఒకప్పుడు తెలంగాణలోని చాలా ప్రాంతాలు కంచుకోటలా ఉండేవి. తెరాస ఆవిర్భాం, తెలంగాణ అవతరణల నేపథ్యంలో ఆ పార్టీ క్రమేణా బలహీనపడుతూ వచ్చింది. పార్టీకి చెందిన పలువురు నాయకులు ఇతర పార్టీల్లో చేరిపోయారు. తెలంగాణ వాదం బలంగా వినిపించిన సమయంలో.. తెలుగుదేశం పార్టీ ఆంధ్రాకు చెందినదని, అటువంటి పార్టీకి తెలంగాణలో ఏమి పనని కేసీఆర్ తో సహా తెరాసకు చెందిన నాయకులు ధ్యజమెత్తుతూ ఉండేవారు. గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే అంశాన్ని కేసీఆర్ బలంగా వినిపించి.. తెలుగుదేశం నెగ్గితే ప్రతి పనికి అమరావతి వెళ్లాల్సివస్తుందని బహిరంగ సభల్లో ప్రజల్ని భయపెట్టారు. దీంతో 2018 ఎన్నికల్లో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను తెలుగుదేశం 15 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసి రెండు చోట్ల మాత్రమే విజయం సాధించగలిగింది. పోలైన మొత్తం ఓట్లలో ఆ పార్టీకి లభించినవి 3.5 శాతం మాత్రమే. అంతకు ముందు 2014లో ఆ పార్టీ 15 స్థానాలను గెలుచుకోగలిగింది.
తెలంగాణలో 2018 ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం
నాయకులు వివిధ పార్టీల్లోకి వెళ్లిపోయినా.. కొన్ని చోట్ల దిగువ స్థాయి శ్రేణుల్లో మాత్రం ఇప్పటికీ పార్టీ పట్ల ఆదరణ కనిపిస్తోంది. ఇటువంటి నేపథ్యంలో.. ప్రాంతీయ పార్టీ అయిన తెరాస.. ఇటీవల జాతీయ పార్టీగా మార్పు చెందింది. అందువల్ల మునుపటి మాదిరిగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ తో సహా ఎవరూ కూడా తెలుగుదేశాన్ని ఆంధ్రుల పార్టీ అని, ఆ పార్టీని ఆంధ్రప్రదేశ్ కు పరిమితం చేసుకోవాలని వంటి విమర్శలు చేయటానికి వీలుకాదు. దీంతో ఆ పార్టీలో మళ్లీ నాయకులు తయారయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. మరో వైపు.. భారాస ఆంధ్రప్రదేశ్ లోనూ బరిలోకి దిగొచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను రెండుగా చీల్చిన పార్టీగా కాంగ్రెస్ ను ఇప్పటికీ తప్పుపడుతున్న ఏపీ ప్రజానీకం.. భారత రాష్ట్ర సమితి విషయానికి వచ్చేసరికి మెతక వైఖరిని అవలంభిస్తుండటం విశేషం. తెరాసను జాతీయ పార్టీగా మారుస్తున్నట్టుగా కేసీఆర్ ప్రకటించీ ప్రకటించగానే ఏపీలో కొన్ని ప్రాంతాల్లో కేసీఆర్ ను అభినందిస్తూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి.
ఇటువంటి దరువులు తెలంగాణలో మళ్లీ వినిపించొచ్చు
నిజానికి.. ఉభయ రాష్ట్రాల మధ్య వివిధ సంస్థల విభజన, నదీ జలాల్లో వాటాలు వంటి పలు విషయాల్లో ఇంకా వివాదాలు పరిష్కారం కావాల్సివుంది. మొత్తం మీద.. తెరాస- భారాసగా మారటం వల్ల కేసీఆర్ కు లభించే ప్రయోజనాలు ఏలా ఉన్నప్పటికీ.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాత్రం ఇక్కడ ఇక ప్రతి ఘటనలు లేకుండా తన పార్టీని బలోపేతం చేసుకొనేందుకు మార్గం సుగమం అయ్యిందనే చెప్పాలి.