బురుజు.కాం Buruju.com : భారత్ రాష్ట్ర సమితి (భారాస)ని Bharat Rashtra Samithi తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు ఏర్పాటు చేసినట్టు? దేశమంతా పార్లమెంటు స్థానాలను గెలుచుకొని ప్రధాన పదవినీ కైవసం చేసుకొనే సత్తా కేసీఆర్ కు ఉందా? ఆ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో ఎవరితో పొత్తు పెట్టుకొంటుంది? దేశంలో సాధారణ ఎన్నికలకు ఇక ఆట్టే సమయం లేనప్పుడు.. హిమాచల్ ప్రదేశ్ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో భారాసాను పటిష్ఠం చేసి అభ్యర్ధులను ఎంపిక చేసేదెప్పుడు? ఇటువంటి అనేక ప్రశ్నలు తెలంగాణ ప్రజానీకం మెదళ్లను దొలిచేస్తున్నాయి. ఇప్పుడు.. భారాస అధిష్ఠానానికి కావాల్సింది కూడా ఇదే. అటువంటి ప్రశ్నలు ఎంతగా ప్రచారంలోకి వస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత అంతగా కనుమరుగవుతుందనే వ్యూహం భారాస ఏర్పాటు వెనుక ఉన్నట్టుగా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే.. ప్రతి ఎన్నికల సమయంలోను రాజేసే ఆంధ్రా, తెలంగాణ సెంటిమెంటుకు ఇప్పుడిక కాలం చెల్లింది.
ఖమ్మంలో.. జనవరి18న నిర్వహించిన భారాస సభలో.. పంజాబ్, దిల్లీ ముఖ్యమంత్రులను సత్కరిస్తున్న కేసీఆర్
భారాస నాయకత్వం ఇంత వరకు ఖమ్మంలోను, మహారాష్ట్రలోని నాందేడ్ లోను సభలను నిర్వహించింది. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు కొన్ని రోజుల పాటు నాందేడులో ఉండి అక్కడి సభా ఏర్పాట్లను చూసుకొన్నారు. వీరి వెంట అక్కడి ఒక స్థాయి గల నాయకులు ఉన్నట్టుగా పత్రికల్లో వార్తలేవీ వెలువడలేదు. భారాస గురించి ఆ రాష్ట్రం వారికి పరిచయం చేయటమే నాందేడ్ సభ లక్ష్యంగా కనిపిస్తోంది. పార్లమెంటు ఎన్నికలకు ఇక 14 నెలలు మాత్రమే వ్యవధి ఉంది. ఒక్కో రాష్ట్రంలోను ఒకటికి మించి సభలను నిర్వహించుకోవటానికైనా సమయం సరిపోదు. అంతగా ముద్ర వేయలేని గిరిధర్ గొమాంగో, కుమార స్వామి వంటి కొద్ది పాటి నాయకులు మాత్రమే ప్రస్తుతానికి భారాసాకు మద్దతు ప్రకటించారు. ఇన్ని అడ్డంకుల మధ్య భారాసను భాజాపా, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు ధీటుగా తయారు చేయటం అంత సులువైన పనేమికాదు.
వీటన్నింటిపైనా.. ఇప్పటికే తెలంగాణలో ఎక్కడపడితే అక్కడ చర్చలు కొనసాగుతున్నాయి. ఇటువంటి చర్చలన్నీ ఎన్నికల నాటికి.. కేసీఆర్ పట్ల సానుభూతిగా మారే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దేశమంతా ఏదో చేద్దామని కంకణం కట్టుకొంటున్న కేసీఆర్ ను సొంతగడ్డపై ఆదరించాలికదా? అనే వాతావరణాన్ని తీసుకు వచ్చి.. మూడో సారి అధికారంలోకి రావాలన్న వ్యూహంతోనే తెరాసను కేసీఆర్.. భారాసగా మార్చారని పరిశీలకులు చెబుతున్నారు.
తెరాస.. తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టి.. రానున్న 2024 ఎన్నికల నాటికి పదేళ్లు అవుతుంది. మునుపటి మాదిరిగా తెలంగాణ, ఆంధ్ర అనే సెంటిమెంటుతో ఓటర్లను ఆకట్టుకోవటం ఇప్పుడిక సాధ్యంకాదు. అటువంటి సెంటిమెంటు ఇప్పుడు కనుమరుగై పోయిందనే చెప్పాలి. అందుకు ప్రభల సాక్ష్యం.. తెలంగాణ వై.ఎస్.ఆర్ పార్టీ. ఆ పార్టీ తరపున షర్మిల.. తెలంగాణలో తిరుగుతూ ఇక్కడి నాయకులపై చాలా విమర్శలు చేస్తున్నారు. సెంటిమెంటు కనుక బలంగా ఉన్నట్లైతే.. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారికి ఇక్కడ పనేమిటంటూ కేసీఆరే గట్టిగా ప్రశ్నించి ఉండేవారు. ప్రస్తుతానికైతే భారాస అధిష్ఠానం ఆశించినట్టుగానే ప్రభుత్వంపై ప్రజల్లోగల వ్యతిరేకత.. తేలికపడుతోంది. భాజాపా, కాంగ్రెస్ నాయకత్వాలు కూడా ప్రస్తుతానికి భరాసాకు ధీటైన వ్యూహాలను అనుసరించలేదని పరిస్థితిలో ఉన్నాయి. మున్ముందు రాజకీయాలు ఎటువంటి మలుపుతిరుగుతాయోననే ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉంది. ఇదంతా.. భారాస వ్యూహంలో భాగమేనని చెప్పొచ్చు.