మోదీకి 13 ఏళ్ల ముందే.. ఆదర్శ గ్రామాలకు ఐఏఎస్ శాంతికుమారి రూపకల్పన
personBuruju Editor date_range2023-02-07
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
పిళ్లా సాయికుమార్ Buruju.com బురుజు.కాం : ( తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి.. 20 ఏళ్ల క్రితం అదిలాబాద్, మెదక్ జిల్లాల కలెక్టరుగా పనిచేసి.. ఆయా చోట్ల వినూత్న కార్యక్రమాలను చేపట్టారు. మెదక్ జిల్లా కలెక్టరుగా ఉన్నప్పుడు.. 2001, జనవరి1 వ తేదీన.. అభినందనలు చెప్పటానికి వచ్చిన వారి నుంచి ఆమె పుష్పగుచ్ఛాలు, స్వీటు బాక్సులకు బదులు.. పలకలు, బలపాలు స్వీకరించినట్టుగా బురుజు.కాం లో వెలువడిన కథనం ఎంతో మందిని విశేషంగా ఆకట్టుకొంది. అప్పట్లో ఆమె చేపట్టిన మరికొన్ని మంచి కార్యక్రమాలపై ఇది రెండోవ కథనం) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2014లో ప్రకటించిన ఆదర్శ గ్రామాల పథకానికి.. అప్పటికి 13 సంవత్సరాల ముందే కలెక్టరు హోదాలో శాంతికుమారి.. మెదక్ జిల్లాలో శ్రీకారం చుట్టటం విశేషం. గ్రామంలోని ఎవరి అవసరాలు ఏవనేది గుర్తించి.. ఆయా శాఖల ద్వారా వాటికి కావాల్సిన వనరులను సమకూర్చటం ఆమె రూపకల్పన చేసిన పథకం స్వరూపం.
జహీరాబాద్ మండలం హోతి (బి) గ్రామంలో 2001, సెప్టెంబరు 12వ తేదీన.. నేలపైనే కూర్చుని గ్రామ ప్రణాళికను తయారు చేస్తున్న శాంతికుమారి. చిత్రంలో అప్పటి జిల్లా కరవు ప్రాంత అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరక్టరు లవ్ అగర్వాల్ కూడా ఉన్నారు. కరోనా సమయంలో ఆయన కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శిగా దిల్లీలో ఉంటూ.. నిత్యం కరోనా కేసుల గురించి చెబుతూ టీవీల్లో కనిపించేవారు
ఒక గ్రామం అన్ని విధాల అభివద్ధి చెందితే.. దాని ప్రేరణతో మరిన్ని గ్రామాల వారు స్వశక్తితో ప్రగతి పథంలోకి వస్తారనేది శాంతికుమారి Shanthi kumari రూపకల్పన చేసిన కార్యక్రమం ఉద్దేశం. మొదక్ జిల్లాలోని (ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా) జహీరాబాద్ మండలం హోతి (బి) అనే గ్రామంలో ఆమె ఇటువంటి కార్యక్రమాన్ని 2001, సెప్టెంబరు 12వ తేదీన ఆచరణలోకి తెచ్చారు. అప్పట్లో నేను మెదక్ జిల్లా ‘ఈనాడు’ Eenadu పత్రిక ప్రతినిధిగా.. సంగారెడ్డిలో ఉండేవాడిని. ఆ రోజుల్లో.. జిల్లాలోని చాలా గ్రామాలు అత్యంత వెనుకబాటు తనంతో.. ఏ నిజాం కాలం నాటివనో భావన కలిగించేలా ఉండేవి. పొట్ట చేతపట్టుకొని అనేక గ్రామాల వారు సమీపంలోని హైదరాబాదుకు వలస వెళ్లిపోయేవారు. అంతెందుకు.. జిల్లా కేంద్రం సంగారెడ్డి.. సాయంత్రమైతే ఖాళీ అయిపోయేది. ఉద్యోగులంతా హైదరాబాదులో నివాసం ఉండేవారు.
ఉమ్మడి మెదక్ జిల్లా జహీరాబాద్ మండలం హోతి (బి)లో.. ఆదర్శ గ్రామ పథకం ప్రారంభమైన సందర్భంగా అప్పటి ‘ఈనాడు’ మెదక్ ఎడిషన్ లో వెలువడిన కథనం
ప్రధాన మంత్రి మోదీ 2014లో ప్రకటించిన ‘సన్సద్ ఆదర్శ గ్రామ యోజన’ పూర్తిగా.. అప్పటికి 13 ఏళ్ల క్రితం హోతి(బి) Hothi (B) గ్రామంలో శాంతికుమారి చేపట్టిన కార్యక్రమం మాదిరిగానే ఉంటుంది. ప్రతి పార్లమెంటు సభ్యుడు 2019 నాటికి మూడు గ్రామాలను, 2019-2024 మధ్య ఏడాదికి ఒకటి చొప్పున మరో అయిదు గ్రామాలను ఎంచుకొని వాటిని అన్ని విధాలా అభివృద్ధి చేయటం మోదీ.. ఆదర్శ యోజన లక్ష్యం. ఎంపీలు ప్రత్యేకంగా దృష్టి సారించిన చోట్ల కొన్ని పనులు పూర్తి కాగలిగాయి. శాంతికుమారి .. హోతి (బి) గ్రామంలో పథకం ప్రారంభం రోజున అన్ని శాఖల అధికారులను అక్కడికి రప్పించి.. వారి సమక్షంలో స్వయంగా గ్రామ సభను నిర్వహించారు. ప్రభుత్వం నుంచి ఎవరికి ఎటువంటి సాయం కావాలనేది అక్కడికక్కడే ఒక అంచనాకు వచ్చి.. కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. గ్రామంలో ఒక కిలోమీటరు దూరం కాలినడకన వెళ్లి చెరువును పరిశీలించారు. ఆ తర్వాత.. ఆ గ్రామంలో పథకం ఏవిధంగా అమలవుతున్నదీ ఆమె పర్యవేక్షిస్తూ వచ్చారు. హోతి (బి) గ్రామంలోని కార్యక్రమం బాగానే మొదలైనప్పటికీ.. కొద్ది నెలలకే శాంతికుమారికి బదిలీ కావటంతో ఆ తర్వాత దానిని పర్యవేక్షించేవారు కొరవడ్డారు. ఆమె మరికొద్ది నెలలు అక్కడ ఉన్నట్లైతే ఆ ఆదర్శ పథకం మంచి ఫలితాలను ఇచ్చివుండేది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 2023, జనవరి 11వ తేదీన బాధ్యతలను స్వకరించినప్పటి చిత్రం
స్వచ్ఛ భారత్ కింద.. మోదీ ప్రభుత్వం వందల కోట్లను ఖర్చుపెట్టి.. దేశంలోని నూరు శాతం ఇళ్లకు ఇప్పుడు మరుగుదొడ్లు ఉన్నట్టుగా ప్రకటించింది. మరుగుదొడ్లను నిర్మించి ఇచ్చినంత మాత్రాన సరిపోదని, వాటికి అవసరమైన నీటి సదుపాయం చాలా అవసరమని శాంతికుమారి అప్పట్లో భావించేవారు. మెదక్ జిల్లా కలెక్టరుగా ఆమె గ్రామాల్లో పర్యటించేటప్పుడు కొన్ని ఇళ్లల్లోకి ఆకస్మికంగా వెళ్లి మరుగుదొడ్లను పరిశీలించేవారు. ఒక సారి.. ఒక ఇంటిలో ఆమె పరిశీలించి వచ్చిన మరుగుదొడ్డిలోకి ఆ వెంటనే నేను వెళ్లి నివ్వెరపోయాను. నీటి సదుపాయం లేక.. ఆ మరుగుదొడ్డి అత్యంత అపరిశుభ్రంగా ఉంది. అటువంటి వాటిని కలెక్టరు హోదాలో ఆమె పరిశీలిస్తున్న వైనం.. నాకు ఆమెకు చేతులు ఎత్తి మొక్కేలా చేసింది. శాంతికుమారి ఇటువంటి అంకిత భావం గల అధికారిణి కావటం వల్లనే.. ఆమె అదిలాబాదు జిల్లా కలెక్టరుగా పనిచేస్తూ మెదక్ జిల్లాకు బదిలీ అయినప్పుడు అక్కడి గిరిజనులు ఆమె బదిలీని ఆపాలంటూ రోడ్లపైకి వచ్చి ధర్నాలను నిర్వహించటం సంచలనమయ్యింది. ( వ్యవసాయ భూములు ఫాం హౌసులుగా మారిపోవటంపై శాంతికుమారి ఆందోళన.. మూడో భాగం వచ్చేవారం Buruju.com లో.. )