ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంటు అలా వచ్చింది! ( సచివాలయం భేష్.. జర్నలిస్టుల పూర్వ వైభవం మాటేమిటి?-మూడో భాగం)
personBuruju Editor date_range2023-01-01
42 రోజుల సకలజనుల సమ్మె సమయంలో నిర్వహించిన సమావేశం ఇది. టీఎన్జీవోల సంఘం నాయకులు దేవీ ప్రసాద్, స్వామి గౌడ్, కారం రవీందర్ రెడ్డి ఇంకా వివేక్ తదితరులు చిత్రంలో ఉన్నారు
బురుజు.కాం Buruju.com : (తెలంగాణ సచివాలయ భవనాల నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. 2023, జనవరి నుంచి అక్కడకు వెళ్లి విధులను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. నూతన సచివాలయంలో మునుపటి మాదిరిగా అధికారులను, మంత్రులను కలవగలిగే స్వేచ్ఛ తమకు ఉంటుందా? అనే సందేహాలు విలేకర్లలో గూడుకట్టుకొన్నాయి. అసలు.. పాత సచివాలయంలో వార్తా సేకరణ ఎలా ఉండేది వివరిస్తూ రాస్తున్న కథనాల్లో ఇది మూడోవది) ఉభయ రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఉద్యోగులకు పదో పీఆర్సీ ఒక వర ప్రసాదమనే చెప్పాలి. ఎందుకంటే .. మూల వేతనంలో పెంపు (ఫిట్మెంటు)ను పదో వేతన సవరణ సంఘం Pay revision commission 29 శాతం మేర సిఫార్సు చేయగా.. తెలంగాణ ప్రభుత్వం దాన్ని 43 శాతానికి పెంచింది. తెలంగాణలో ఇలా ఇవ్వటంతో.. ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆదే రీతిలో అక్కడి ఉద్యోగులకూ మంజూరు చేశారు. అప్పట్లో 43 శాతం మేర పెంపునకు తెలంగాణ ఆర్థిక శాఖ అధికారులు.. ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద తీవ్రంగా అభ్యంతరం పెట్టిన సంగతి చాలమందికి తెలియదు. సచివాలయంలోని ఆనాటి విషయాలను ‘బురుజు’ ఇప్పుడు బహిర్గతం చేస్తోంది. అప్పట్లో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో పాటు.. పీఆర్సీ ఛైర్మన్లను సైతం కలసి వివరాలను రాబట్టగలిగే అవకాశాలు విలేకర్లకు ఉండేవి.
వేతన సవరణ కమిషనరుతో ఉద్యోగ సంఘాల భేటీలు, సిఫార్సులకు ఆమోద ముద్ర పడిన తర్వాత జోవోల జారీ వంటి ప్రక్రియలన్నీ పాత సచివాలయంలోని ‘డి’ బ్లాకులోనే చోటు చేసుకొనేవి (చిత్రంలో కనిపిస్తున్న భవనం)
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఇక్కడి ఉద్యోగులు 42 రోజుల పాటు ‘సకల జనుల సమ్మె’ పేరుతో ఉద్యమాన్ని నిర్వహించారు. సమ్మెకాలం 42 రోజులైనందున అంతటి స్థాయిలో ఫిట్మెంటు కావాలని టీఎన్జీవోల సంఘం ప్రభుత్వంపై గట్టిగా వత్తిడి తెచ్చేది. ఆర్థిక శాఖ మాత్రం.. పెంపు అనేది 30 శాతం లోపు ఉంటేనే వివిధ పథకాలను సక్రమంగా అమలు చేసుకోగలుగుతామనే ధోరణిలో ఉండేది. అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి, కార్యదర్శి రామకృష్ణారావు.. దీనిపై పలు విడతలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యి.. ఇప్పుడు పెంపు ఎక్కువగా ఉంటే భవిష్యత్తు పీఆర్సీల్లో అంతకంటే ఎక్కువగా ఫిట్మెంటును ఉద్యోగులు కోరతారని, ఇదంతా కొత్త రాష్ట్రానికి భారంగా పరిణమిస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి.. ఉద్యోగులు అడుగుతున్నట్టుగా 42 శాతం మేర ఇవ్వాలనే ధోరణినే ఆర్థిక శాఖ అధికారుల వద్ద కనబరస్తూ వచ్చేవారు. సరిగ్గా ఇదే సమయంలో.. ‘ఈనాడు’లో ఒక కథనం వెలువడింది..
నూతన సచివాలయం నిర్మాణం పూర్తయ్యాక ఇలా కనిపిస్తుంది
అదేమిటంటే.. ఉద్యోగులు 42 శాతానికి బదులుగా 43 శాతం కనుక పొందగిలితే ఆ ఒక్క శాతం పాయింటుతోనే పలువురికి వేతనాలు బాగా పెరగగలుగుతాయనేది ఆ కథనం సారాంశం. ప్రస్తుత మూల వేతానికి అనుగుణంగా.. మాస్టర్ స్కేలులోని స్టేజీల వద్ద ఉద్యోగిని కూర్చోపెట్టేటప్పుడు ఒక్క శాతం పాయింటుతోనే తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటాయని కథనంలో తెలపటంతో ఉద్యోగులు, ఉపాధ్యాయుల నేతలు దీనిపై అధ్యయనం చేశారు. అంతవరకు వారు 42 శాతాన్ని కోరుతూ వచ్చినప్పటికీ.. 43 శాతమే ఎక్కువ మందికి ప్రయోజనకారిగా ఉంటుందని వెల్లడైన తర్వాత.. అప్పటి టీన్జీవోల సంఘం అధ్యక్షులు దేవీప్రసాద్.. తదితరులు అదే విషయాన్ని ముఖ్యమంత్రికి నివేదించగలిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. అప్పట్లో రోజూ సచివాలయానికి వస్తుండేవారు. ఆయన 2015,జనవరి 5వ తేదీన ఉద్యోగ సంఘాల నేతలతో అక్కడే ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఆ వెంటనే విలేకర్లను పిలిచి.. ఫిట్మెంటును 43 శాతం మేర ఇస్తున్నట్టుగా ప్రకటించారు. ఆయన ఇంతటి స్థాయిలో మంజూరు చేయటం ఉద్యగులను సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. పదో పీఆర్సీ సిఫార్సులు 3013 జూలై నుంచి 2018 జూన్ వరకు అయిదేళ్లు అమలయ్యాయి.
ముఖ్యమంత్రికి పుష్కగుచ్ఛాన్ని అందజేస్తున్న నాటి ఉద్యోగుల నేతలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయం భవనాలను రెండు రాష్ట్రాల వారికి పంచి.. మధ్యలో ఒక ముళ్ల కంచెను ఏర్పాటు చేయటంతో.. తెలంగాణ ఫిట్మెంటు ప్రకటన నాటికి ఏపీ సచివాలయం ఇక్కడే ఉంది. అనంతరం నాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా 43 శాతం ఫిట్మెంటు ఇచ్చి అక్కడి ఉద్యోగులనూ సంతోషపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్టుగానే తమకు ఫిట్మెంటును ఇవ్వాలంటూ తెలంగాణలోని ఆర్టీసీ కార్మికులు వారం రోజుల పాటు సమ్మెచేయగా.. 2015, మే 13వ తేదీన వారికి 44 శాతం ఫిట్మెంటును మంజూరు చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి ప్రకటించి.. వారినీ ఆశ్చర్యపర్చారు. అప్పట్లో సచివాలయంలో.. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను కలసి తాజా వివరాలను తెలుసుకొనే అవకాశాలు విలేకర్లకు ఉండేవి. ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. దీనికి కరోనా తోడయ్యింది. కరోనా సమయంలో అధికారులకు, విలేకర్లకు మధ్య సంబంధాలు తగ్గిపోయాయి . ఇదే సమయంలో.. పాత సచివాలయ భవనాలను కూల్చివేసి.. కార్యాలయాలను భూర్గుల రామకృష్ణారావు భవనాల్లోకి తరలించాక విలేకర్లపై ఆంక్షలు ఎక్కువయ్యాయి(నాలుగో భాగం వచ్చేవారం)