మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుకు వినతి పత్రాన్ని అందజేస్తున్న పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షులు మధుసూదన రెడ్డి
బురుజు.కాం Buruju.com : తెలంగాణలోని జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు వారి ఉద్యోగాలు కొత్త సంవత్సరంలో ఖాయం కానున్నాయి. ప్రస్తుత వారి నాలుగేళ్ల ప్రొబేషన్ వ్యవధి ఏప్రిల్ నాటికి పూర్తికానుంది. ఆ వెనువెంటనే వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు ఇస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు వెల్లడించారు. వారికి పోస్టులను ఖాయపరుస్తూ ఉత్తర్వులు వెలువరించాలని రాష్ట్ర గ్రామ పంచాయతీ కార్యదర్శుల సంఘం విజ్ఞప్తి చేయటంతో మంత్రి సానుకూలంగా స్పందించారు. కొంత మంది పంచాయతీ కార్యదర్శుల స్థానికతకు అడ్డంకిగా మారిన జీవో నెంబరు 317ను వెంటనే రద్దు చేయాలని, పంచాయతీ కార్యాలయాల్లో సాంకేతిక పరమైన పనులకు అవసరమ్యే అంతర్జాలం, ట్యాబులు వంటి మౌలిక సదుపాయాలను సమకూర్చాలని సంఘ ప్రతినిధులు మంత్రిని కోరారు. రాష్ట్ర సంఘం అధ్యక్షులు పి.మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎ.రమేష్ తదితరులు డిసెంబరు 31వ తేదీన మంత్రిని కలసి.. కార్యదర్శుల సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. వినతి పత్రంలోని సమస్యలను పరిశీలించి తగు చర్యలు తీసుకొంటామని వారికి మంత్రి హామీ ఇచ్చారు.
పంచాయతీ కార్యదర్శుల సంఘం ముద్రించిన 2023 క్యాలండర్ ను ఆవిష్కరిస్తున్న మంత్రి దయాకరరావు
సంఘం తరపున ముద్రించిన 2023 క్యాలండరును ఈ సందర్భంగా మంత్రి ఆవిష్కరించారు. ఆ తర్వాత సంఘ ప్రతినిధులు పంచాయతీరాజ్ కమిషనరును కలసి ఆయనకూ వినతి పత్రాన్ని అందజేశారు. వినతి పత్రంలోని మరికొన్ని అంశాలు ఇలా ఉన్నాయి..‘‘రాష్ట్రంలోని 12,751 గ్రామ పంచాయతీలను పరిపాలన సౌలభ్యం కోసం జానాభా ప్రతిపదికన నాలుగు రకాల క్లస్టర్లగా పరిగణించాలి. దీర్గకాలంగా బదిలీలంటూ లేనందున కొందరు కార్యదర్శులు 14 ఏళ్లకు పైగా ఒకే చోట విధులను నిర్వహించాల్సివస్తోంది. కార్యదర్శలకు బదిలీల ప్రక్రియను చేపట్టాలి. ప్రస్తుత నాలుగు గ్రేడుల్లోని కార్యదర్శి పోస్టుల ఖాళీలను గుర్తించి అర్హులతో ఆ యా పోస్టులను భర్తీ చేయాలి. ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు వీలుగా సిబ్బంది నియామకాలను చేపట్టాలి. కార్యదర్శులపై ఎంపీడీవో లేదా ఎంపీవోలలో ఎవరో ఒకరికి మాత్రమే పర్యవేక్షణ బాధ్యతలు ఉండాలి.
పంచాయతీరాజ్ కమిషనరుకు వినతి పత్రం అందజేత
అధికారులు రాత్రి వేళల్లో నిర్వహించే సమావేశాలకు సైతం కార్యదర్శులు రావాల్సిందేనని ఆదేశాలు ఇస్తుండటంతో వారు వాటికి హాజరయ్యి తిరిగి గ్రామాలకు వచ్చే క్రమంలో ప్రమాదాల బారిన పడుతున్నారు. అందువల్ల.. పనివేళల్లో మాత్రమే సమావేశాల నిర్వహణ, నివేదికల సమర్పణ వంటి పనులు పూర్తయ్యేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలి. ప్రస్తుతం జిల్లాల్లో కార్యదర్శుల నియామకాలకు అనుసరిస్తున్న పొరుగు సేవల (అవుట్ సోర్సింగ్) పద్దతిని రద్దు చేయాలి. ఇప్పటికే ఉన్న పొరుగు సేవల కార్యదర్శులను జూనియర్ కార్యదర్శులుగా పరిగణించాలి.
పంచాయతీ కార్యదర్శుల సంఘం ముద్రించిన 2023 క్యాలండర్
నూతన పింఛను విధానాన్ని రద్దు చేసి.. ఉద్యోగులకు భద్రత కల్పించాలి. కార్యదర్శుల్లోని మహిళలు, దివ్యాంగులకు , అనారోగ్యంతో బాధపడుతున్నవారికి భౌతిక హాజరు నమోదు పద్దతిని తొలగించాలి. నూతన పంచాయతీరాజ్ చట్టానికి అనుగుణంగా కార్యదర్శులకు తగిన మార్గదర్శకాలను వెలువరించాలి’’ అని వినతి పత్రంలో కోరారు.