జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణపై పరిశీలిస్తాం
personBuruju Editor date_range2023-01-17
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) శాంతికుమారికి.. శుభాకాంక్షలు చెప్పి మొక్కను బహూకరిస్తున్న పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షులు పి.మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ఎం.ఎస్.ఎస్. వాణి
బురుజు.కాం Buruju.com : తెలంగాణలోని పంచాయతీ కార్యదర్శులు అంకిత భావంతో పనిచేయటం వల్లనే హరితహారం కార్యక్రమం పూర్తిగా విజయవంతం కాగలిగిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. శాంతికుమారి కొనియాడారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ (రెగ్యులరైజేషన్) తో సహా అన్ని అంశాలను త్వరలోనే పరిశీలిస్తామని ఆమె వెల్లడించారు.
పంచాయితీ కార్యదర్శులతో సహా ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన 317 జీవో పైనా పరిశీలిస్తామని, కార్యదర్శుల వల్లనే గ్రామాలు ప్రగతిని సాధిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. అన్ని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. తెలంగాణ తొలి మహిళా సీఎస్ గా ఇటీవల పదవీ బాధ్యతలను చేపట్టిన శాంతికుమారిని.. తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షులు పి. ముధుసూదన్ రెడ్డి, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ఎం.ఎస్.ఎస్. వాణి.. జనవరి 16వ తేదీన ఆమె ఛాంబరులో కలసి సంక్రాంతి, నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు. ఇదే సందర్భంలో.. కార్యదర్శుల సమస్యలను సీఎస్ కు తెలియజేశారు. సీఎస్.. 2001లో మెదక్ జిల్లా కలెక్టరుగా పనిచేసినప్పుడు.. పుష్పగుచ్ఛాలకు బదులుగా పలక, బలపాలను స్వీకరించి.. వాటిని వయోజన పాఠశాలల్లో పంపిణి చేసిన విషయాన్ని మధుసూదన రెడ్డి గుర్తు చేశారు. కార్యదర్శుల సంఘం తరపున.. ఆయన సీఎస్ కు ఒక మెుక్కను బహూకరించారు.