సచివాలయం భేష్.. మరి జర్నలిస్టుల గత వైభవం మాటేమిటి?(మొదటి భాగం)
personBuruju Editor date_range2022-11-28
తెలంగాణ సచివాలయ భవనాల నమూనా ఇది
బురుజు.కాం Buruju.com : తెలంగాణ నూతన సచివాలయంలోని Telangana secretariat ఒక బ్లాకుకు 2023, జనవరి 18వ తేదీన ప్రారంభోత్సవం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. అప్పటి నుంచి ఆయన నిత్యం సచివాలయానికి వస్తారనీ వార్తలు వెలువడుతున్నాయి. అన్ని బ్లాకులు పూర్తి స్థాయిలో రూపొందేందుకు మరో ఆరేడు నెలల సమయం పట్టొచ్చని సమాచారం. నూతన సచివాలయం ప్రస్తుతం విద్యుత్తు కాంతుల్లో భేషుగ్గా కనిపిస్తోంది. పెద్ద సైజు గోపురాల అమరిక వల్ల పురాతన భవనాలను చూస్తున్నామనే అనుభూతీ కలుగుతోంది. జర్నలిస్టులను మాత్రం కొన్ని అనుమానాలు కమ్మేస్తున్నాయి. మునుపటి మాదిరిగా వార్తా సేకరణకు అనుమతులు ఉంటాయా? లేక తామిచ్చే ప్రకటనలు రాసుకోవటమే తప్ప ఇక లోపలకు విలేకర్లకు ప్రవేశం ఉండబోదనే హుంకుం ఏమైనా జారీ అవుతుందా? అని ప్రస్తుతం వారు మదన పడుతున్నారు. సచివాలయంలో స్వేచ్ఛగా విహరించి మంచి స్కూప్ వార్తలకు కావాల్సిన సరంజామాను సేకరించుకొనే గత వైభవం మళ్లీ రావాలని ఆశగా ఎదురు చూస్తున్నారు.
పాత సచివాలయంలో.. ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న ‘సి‘ బ్లాకు ఇదే. దీనికి ‘సమత’ అనే పేరు ఉండేది
పరిపాలనకు సచివాలయం గుండెకాయ వంటిది. విధానపరమైన నిర్ణయాలను తీసుకొనేది, పథకాలకు రూపకల్పన చేసేది అక్కడే. ప్రభుత్వం తీసుకురాబోయే కొత్త పథకాల గురుంచి ముందుగానే తెలుసుకొని తాజా కథనాలను ప్రజలకు అందివ్వాలంటే విలేకరి ఆయా శాఖల్లో కలయతిరగటం తప్పనిసరి . ఇలా పది మందితో మాట్లాడేటప్పుడు ఆయా కార్యక్రమాల్లోని లొసుగులు సైతం బయటపడి ఒక్కోసారి అవి పత్రికలో పతాక శీర్షికల కథనాలుగానూ రూపొందుతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలంయలో విలేకర్లు స్వేచ్ఛగా విహరించేవారు. ముఖ్యమంత్రి కార్యాలయం.. ‘సి’ బ్లాకులో ఉండేది. దానిలోని పై అంతస్తులో గల ముఖ్యమంత్రి గది వరకు విలేకర్లు పెద్దగా అడ్డంకులంటూ లేకుండానే వెళ్లగలిగేవారు.
పాత సచివాలయం ఆవరణలో విలేకర్లు ఏళ్ల తరబడి సేద తీరిన చెట్టు ఇదే
ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా పాలన కొనసాగించిన నిజాం కాలం నాటి భవనం ఒకటి సచివాలయంలో ఉండేది. దానికి చేర్చి ఉన్న ఒక చెట్టుకింద జర్నలిస్టులు రోజూ కొంత సేపు సేదతీరే వారు. ఆ రోజు తాము ఏయే అధికారులను, మంత్రులను కలిసిందీ వెల్లడించకుండా .. తోటి విలేకర్లు మాత్రం ఎక్కడెక్కడికి వెళ్లారో తెలుసుకోవాలనే తాపత్రయం వారి సంభాషణల్లో తొణికిసలాడేది. అంతకు ముందైతే.. ఆ పాత భవనంలోనే గల గదిలో కూర్చొని పత్రికలను తిరగేసుకొనేవారు. ఆ తర్వాత.. ప్రభుత్వం సీ బ్లాకుకు ఎదురుగా ఒక హాలును నిర్మించి దానిని మీడియా వారికి కేటాయించింది. ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఎక్కువకావటంతో ఇలా ప్రత్యేకంగా ఒక హాలును నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. మంత్రులు, ఇతర ముఖ్యులు పత్రికల వారితో మాట్లాడదలచుకొన్నప్పుడు మీడియా హాలులోకి వచ్చి తాము చెప్పదలచుకొన్నది చెప్పి వెళ్లేవారు.
నిర్మాణంలో ఉన్న తెలంగాణ సచివాలయం
తెలంగాణ అవతరణ తర్వాత విలేకర్ల స్వేచ్ఛ క్రమేణా తగ్గుతూ వచ్చింది. ముఖ్యమంత్రి ఉండే భవనంలోని దిగువ ఫ్లోరులో గల ముఖ్య పౌర సంబంధాల అధికారి (సి.పి.ఆర్.ఓ) గదిలో అకస్మాత్తుగా అడ్డు చెక్కలు వచ్చిపడ్డాయి. మరో వైపు.. సచివాలయ భవనాలకు అడ్డుగా ముళ్ల కంచె ఏర్పాటయ్యింది. దీనికి అవతల వైపుగల భవనాలు ఆంధ్రప్రదేశ్ కు వెళ్లాయి. విలేకర్లు సేదతీరే చెట్టు.. క్యాంటిన్ ఏపీ పరిధిలోకి వెళ్లాయి . ఏపీ రాజధాని అమరావతికి మారిన తర్వాత.. కంచెకు రెండో వైపు గల భవనాలనూ తెలంగాణ వినియోగించుకొంటూ వచ్చింది. నూతన సచివాలయ నిర్మాణం కోసం రెండేళ్ల క్రితం సచివాలయ ఆవరణలోని మొత్తం భవనాలు అన్నింటిని కూల్చివేశారు. వాటితో పాటే జర్నలిస్టుల చెట్టూ అంతర్ధానమయ్యింది ( మిగతా వచ్చేవారం)