తెలంగాణ గ్రామాల్లో అత్యధికంగా 8.52 శాతం ద్రవ్యోల్భణం
personBuruju Editor date_range2023-01-12
2022, డిసెంబరు ద్రవ్యోల్భణం.. ఏపీలో.. గ్రామాల్లో 6.74 శాతం, పట్టణాల్లో 6.18 శాతం. మొత్తం మీద 6.53 శాతం
బురుజు.కాం Buruju.com : ద్రవ్యోల్భణం లెక్కల్లో వెనక్కి తగ్గేదేలే అన్నట్టుగా తెలంగాణ తన ప్రధమ స్థానాన్ని కొనసాగించుకొంటూనే ఉంది. కేంద్ర గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసిన వివరాలను బట్టి.. 2022, డిసెంబరు నెలలో.. తెలంగాణ రాష్ట్రం 7.81 శాతం ద్రవ్యోల్భణంతో.. దేశంలోనే ప్రధమ స్థానంలో నిలిచింది. మరో ముఖ్య విషయం ఏమిటంటే.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారీగా చూసినప్పుడు తెలంగాణ గ్రామాల్లోని ద్రవ్యోల్భణం inflation రికార్డు స్థాయిలో 8.52 శాతం మేర నమోదయ్యింది. దేశంలోని మరేఇతర రాష్ట్రం కూడా అసలు ఎనిమిది అంకె దరిదాపుల్లోకి రానేలేదు. గ్రామీణ ద్రవ్యోల్భణం జాతీయ సగటు 6.05 శాతం మాత్రమే. దీనిని బట్టి తెలంగాణ గ్రామీణులు.. రోజువారి ఆహార వస్తువులు, ఇంధనం తదితరాలకు ఎక్కువ మొత్తాలను చెల్లించాల్సివస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఆంధ్రప్రదేశ్ .. 6.74 శాతం గ్రామీణ ద్రవ్యోల్భణంతో దేశంలో అయిదో స్థానంలో ఉంది.
తెలంగాణ ద్రవ్యోల్భణం.. గ్రామాలు 8.52 శాతం, పట్టణాలు 7.25 శాతం, రెండూ కలిపి 7.81 శాతం. జాతీయ సగటు 5.72 శాతం మాత్రమే
తెలంగాణలోని గ్రామాలు, పట్టణాలు కలిపి చూసినప్పుడు.. ఇక్కడ 2021 డిసెంబరు నెలలో రూ.100కి లభించిన ఒక వస్తువును 2022, డిసెంబరులో రూ. 107.81 పెట్టి కొనుక్కోవలసి వస్తోంది. ఇలా ఏడాది కాలంలో పెరిగిన 7.81 శాతాన్నే ద్రవ్యోల్భణంగా వ్యవహరిస్తారు. పట్టణాల కంటే గ్రామాల్లో ద్రవ్యోల్భణం ఎందు వల్ల ఎక్కువగా ఉంటుందనే ప్రశ్నకు ఆర్థిక వేత్తల నుంచి రకరకాల వివరణలు వినిపిస్తుంటాయి. వారు చెప్పేదేమిటంటే.. గ్రామీణ ప్రాంతాల వారు తమ సంపాదనలో ఎక్కువ భాగాన్ని ఆహార వస్తువులు, ఇంధనం, విద్యుత్తులకు ఖర్చుపెడుతుంటారు. ద్రవ్యోల్భణం లెక్కింపునకు ప్రధానంగా పరిగణనలోకి తీసుకొనే వివిధ రకాల వస్తువుల్లో.. ఇలా గ్రామీణ ప్రాంతాల వారు వాడే వాటి వాటాయే అధికంగా ఉంటుంది. హౌసింగ్ వంటి వాటికి పట్టణాల్లో పెట్టే మాదిరి ఖర్చు గ్రామాల్లో ఉండదు. అందువల్లనే గ్రామీణ ద్రవ్యోల్భణం ఎక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు.