గవర్నరు ఇలా చెబుతుంటే తెలంగాణ పరువు పోయినట్టు కాదా?
personBuruju Editor date_range2022-10-20
తెలంగాణ గవర్నరు తమిళిసై
Buruju.com బురుజు.కాం : తెలంగాణ గవర్నరు తమిళిసై .. ఇప్పుడు తన స్వరాన్ని మరింత పెంచారు. తెలంగాణలో నిత్యం తాను చవిచూస్తున్న చేదు అనుభవాలను ఇతర రాష్ట్రాలకు వెళ్లి సైతం చెబుతున్నారు. తెలంగాణ గురుంచి ఎవరు ఏమాత్రం విమర్శించినా.. రాష్ట్రం బ్రాండ్ ను పాడుచేస్తున్నారంటూ ధ్వజమెత్తుతూ వచ్చిన అధికార పార్టీ అగ్రనాయకత్వం ..ఇప్పుడు ఏకంగా గవర్నరు ఇతర రాష్ట్రాలకు వెళ్లి చేస్తున్న వ్యాక్యలను పట్టించుకోకపోవటం విడ్డూరం. అమె కోరేదల్లా.. తాను తెలంగాణలోని ఆయా ప్రాంతాలకు వెళ్లేటప్పుడు అధికారికంగా తనకు లభించాల్సిన గౌరవ మర్యాదలు మాత్రమే. అవేవో ఆమెకు కల్పించి, అమె అడిగిన నివేదికలను పంపిస్తుంటే సమస్య ఇట్టే పరిష్కారమవుతుంది. రాష్ట్ర పరిస్థితులపై ప్రధానికి, కేంద్ర హోమంత్రికి ఆమె ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేయటమూ తగ్గుతుంది.
ఇటువంటి భేటీలు అంతర్ధానమయ్యి చాాలా కాలమయ్యింది
గవర్నరు తమిళిసై అక్బోబరు 20వ తేదీన చెన్నైలో మాట్లాడుతూ.. హైదరాబాదులోని తన అధికారిక నివాసమైన రాజభవన్ లో తన ఖర్చులను తాను చెల్లించుకొంటున్నానని వెల్లడించారు. రాజ్యాంగ పరిరక్షకురాలైన తనకు.. హెలికాప్టరు, విమానం వినియోగించుకొనే అవకాశం ఉన్నప్పటికీ వాటి జోలికి వెళ్లటం లేదని చెప్పారు. అంతే కాకుండా.. తాను భద్రాచలం వరద ముంపు ప్రాంతాలకు వెళ్ల నున్నట్టుగా తెలియటంతో ముఖ్యమంత్రి కేసీఆర్.. వెంటనే అక్కడికి వెళ్లారని చెబుతూ.. సీంఎం వ్యవహార తీరును ఉదహరించారు. తాను కనుక అక్కడికి వెళ్లి ఉండకపోతే సీఎం కూడా పర్యటించివుండేవారు కాదన్నది ఆమె పరోక్షంగా చెప్పదలచుకొన్న విషయం. తెలంగాణ గవర్నరుగా మూడేళ్లలో తాను చేసిన సేవలు, తన అనుభవాలతో స్వయంగా రాసిన పుస్తకాన్ని ఆమె చెన్నైలో ఆవిష్కరించారు. పుస్తక ఆవిష్కరణ వేదికపైనే తెలంగాణలో గవర్నరుగా తాను పడుతున్న ఇబ్బందులను వెల్లడించారు. ప్రముఖ పాత్రికేయులు నక్కిరన్ గోపాలన్ వంటి వారు ఆ సభకు హాజరయ్యి ఆమె చెప్పే విషయాలన్నీ విన్నారు.
గవర్నరు తమిళిసై.. తన ఆవేదనను విలేకర్ల వద్ద వ్యక్తంచేస్తూ వస్తున్నారు. ప్రధానిని కలసినప్పుడూ తప్పకుండా ఫిర్యాదు చేస్తూనే ఉంటారని అంచనావేయొచ్చు
తమళిసై ఇప్పుడు తెలంగాణతో పాటుగా పుదిచ్చెరి రాష్ట్రానికీ గవర్నరుగా ఉన్నారు. తెలంగాణలోని మూడేళ్ల అనుభవాలతో రాసిన పుస్తకాన్ని హైదరాబాదులో కాకుండా చెన్నైలో ఆవిష్కరించటానికి కారణాన్ని ఆమె వెల్లడించలేదు . హైదరాబాదులోని తన అధికారిక నివాసం రాజభవన్ లో నిర్వహించిన ఉగాది తదితర కార్యక్రమాలకు ప్రభుత్వంలోని పెద్దలెవరూ రాకపోతుండటం వంటివి కారణం కావచ్చు. రాజభవన్ లోని తనకు అయ్యే ఖర్చులను నెలనెలా తాను చెల్లించివేస్తున్నట్టుగా ఆమె చేసిన వ్యాక్యలను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకు ముందు ఏ గవర్నరుకు ఇటువంటి పరిస్థితి ఉత్పన్నంకాలేదు.బంగారు తెలంగాణను సాధిస్తున్నామని చెప్పే పాలకులు.. గవర్నరుకు ఆ మాత్రం ఖర్చులను భరించలేకపోతున్నారా? అనే సందేహాలు సామాన్యుల్లో ఉత్పన్నమవుతాయి.
ఎవైనా సంచలన సంఘటనలు చోటు చేసుకొంటున్నప్పుడు వాటిపై తనకు నివేదికలను పంపాల్సిందిగా ఆమె అడగటం తప్పేమీ కాదు. తాజాగా జూబ్లిహిల్సులోని ఒక పాఠశాలలో నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడి సంఘటనపై ఆమె నివేదికను కోరారు. పోలీసు అధికారులు పత్రికల వారికి చెప్పిన వివరాలనే నివేదిక రూపంలో అమెకు పంపితే సరిపోతుందికదా? అప్పుడు సమాచారాన్ని అడిగినా ప్రభుత్వం పంపటం లేదని ఆమె ఇతర రాష్ట్రాలకు వెళ్లి వాపోవవల్సిన పరిస్థితి ఉత్పన్నంకాదుకదా? ఎవరు వ్యతిరేకించినా తాను చేయదలచుకొన్న పనులను తాను చేసుకొంటూ వెళ్తానని చెన్నై సభలో ఆమె తేటతెల్లంచేశారు.