బురుజు.కాం Buruju.com : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైతెపా) అధినేత షర్మిలను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లిన సంఘటపై రాష్ట్ర గవర్నరు తమిళిసై స్పందించటం సరికాదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గవర్నరు ఇలా ప్రతి సంఘటనపైనా ప్రకటనలు ఇస్తుండటం వల్లనే.. తన ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందంటూ ఆమె ఆరోపించినా ఎవరూ పెద్దగా పట్టించుకోని పరిస్థితి ఏర్పడిందని వారు అంటున్నారు.
షర్మిల ఆరోగ్యంపై గవర్నరు ఆందోళన కనబర్చిన మరుసటి రోజే.. ఎమ్మెల్సీ కవితపై ట్విట్టర్ వేదికపై షర్మిల విమర్శలు చేశారు
గవర్నరు తమిళిసై.. Governor Tamilisai భాజపా ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేతలు ఇప్పటికే విమర్శిస్తున్నారు. ఇటువంటి కారణంగానే గవర్నరుకు, ప్రభుత్వానికి మధ్య దూరం బాగా పెరిగిపోయింది. తొలినాళ్లలో.. పత్రికల వారు అడిగినప్పుడు, కొన్ని వేదికలపైన మాత్రమే తన ఆవేదనను బహితర్గత పరుస్తూ వచ్చిన గవర్నరు.. ఆ తర్వాత ఏకంగా ప్రకటనలు ఇవ్వటమూ మొదలు పెట్టారు. తాజాగా.. షర్మిల అరెస్టు సంఘటననే తీసుకొంటే.. ఆమెను అరెస్టు చేసిన తీరును చూసి గవర్నరు తీవ్రంగా కలత చెందారని రాజ్ భవన్ వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. షర్మిల Sharmila భద్రత, ఆరోగ్యంపై గవర్నరు ఆందోళన చెందారని ఆ వర్గాలు తెలిపాయి.
షర్మిల.. కారులో కూర్చుని ఉన్నప్పటి చిత్రం
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పాద యాత్ర చేస్తున్న షర్మిలపై అక్కడ తెరాస కార్యకర్తలు నవంబరు 28వ తేదీన దాడి చేసి.. ఆమె వాహనాలను ధ్వసం చేశారు. దీంతో షర్మిల.. నవంబరు 29వ తేదీన హైదరాబాదు బేగంపేటలో గల ముఖ్యమంత్రి నివాసమైన Pragathi Bhavan ప్రగతి భవన్ కు తన ధ్వంసమైన వాహనాలతో సహా వెళ్లి నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. ఇటువంటి సందర్భంలోనే ఆమె తన కారు నుంచి కిందకు దిగకపోవటంతో పోలీసులు .. ట్రాఫిక్ క్రేనును రప్పించి దానితో ఆమె కారును లాక్కొంటూ పోలీస్ స్టేషనుకు తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆమె కారు డ్రైవింగ్ సీటులోనే ఉన్నారు. ఆ తర్వాత పోలీసులు బలవంతంగా కారు డోరును తొలగించి ఆమెను అరెస్టు చేయగా కోర్టు.. బెయిలు మంజూరు చేసింది. షర్మిల తన పాద యాత్రలో భాగంగా.. ఏ నియోజకవర్గానికి వెళ్తే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేను ఏదో ఒకటి అంటుంటారని ఇప్పటికే పేరుపడ్డారు. ఇందులో భాగంగానే.. వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపైనా విమర్శలు చేశారు. దీంతో అక్కడి తెరాస కార్యకర్తలు ఆమె పయనించే క్యారవాన్ పై పెట్రోల్ పోసి దగ్దం చేసే ప్రయత్నం చేశారు.
ఇక హైదరాబాదులో.. షర్మిల తన కారు నుంచి దిగకుండా కారులోనే కూర్చుని మొండికేయటంతో రద్దీ ప్రాంతమైన పంజాగుట్ట వద్ద ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక్కడ షర్మిల చేసిందీ రాజకీయమే. ఎవరి రాజకీయ ఎజెండాలు వారికి ఉన్నప్పుడు ఇటువంటి వ్యవహారాలను గవర్నరు పరిశీలిస్తూ ఉండాలే తప్ప ఒకరికి మద్దతుగా ప్రకటనలు ఇవ్వటం సమంజసం కాదనేది రాజకీయ పరిశీలకుల భావన. ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కవితను.. షర్మిల నవంబరు 30వ తేదీన ట్విట్టరులో విమర్శించగా.. ‘‘షర్మిల.. భారతీయ జనతా పార్టీ వదిలిన బాణం ’’అంటూ కవిత సమాధానం ఇచ్చారు. గవర్నరు తమిళిసైని ఇప్పటికే భాజపా ప్రతినిధి అంటూ అధికార పార్టీ నేతలు విమర్శిస్తూనే ఉన్నారు. షర్మిల భాజపాకు అనుకూలంగా ఉండేవారు కనుకనే గవర్నరు వెంటనే స్పందించారనే విమర్శలు మున్ముందు అధికార పార్టీ నాయకుల నుంచి వినిపించొచ్చు.