ప్రచారం కోసమే గవర్నరుపై ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లిందా?
personBuruju Editor date_range2023-01-30
తెలంగాణ గవర్నరు తమిళిసై
బురుజు.కాం Buruju.com : గవర్నరు వ్యవస్థ దండగంటూ దేశమంతా చాటి చెప్పటానికే తెలంగాణ ప్రభుత్వం.. గవర్నరు తమిళిసై పై హైకోర్టుకు వెళ్లిందా? తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయి. ఇలా హైకోర్టుకు వెళ్లటంతో.. తెలంగాణలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (భారాస)కి ఇతర రాష్ట్రాల్లో ప్రచారం లభించింది. హైకోర్టు సూచనల తర్వాత.. తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నరుకు మధ్య రాజీ కుదిరినప్పటికీ.. ఇప్పటికే పెరిగిపోయిన అంతరం.. ఇక ముందూ కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు పరిశీలకులు చెబుతున్నారు. ఎందువల్ల నంటే.. హైదరాబాదులోని రాజ్ భవన్ లో రాజీ చర్చలు కొనసాగుతున్న సమయంలోనే.. మంత్రి కేటీఆర్.. సిరిసిల్లలో విలేకర్లతో మాట్లాడుతూ.. బ్రిటీష్ కాలం నాటి గవర్నరు వ్యవస్థ దండగంటూ ధ్వజమెత్తారు. అంతగా గవర్నరు వ్యవస్థ ఉండాలనుకొంటే ప్రధాని హోదాను వైస్రాయిగా మార్చుకోవాలనీ సూచించారు.
గవర్నరు వ్యవస్థలోకి తనను ఎందుకు లాగుతున్నారంటూ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించాల్సివచ్చింది
తెలంగాణ గవర్నరు తమిళిసై..రాష్ట్ర పర్యటనలకు వెళ్లినప్పుడు ప్రభుత్వం కనుక తగిన గౌరవాన్ని ఇచ్చుంటే ఇప్పుడు వ్యవహారం హైకోర్టు వరకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేదికాదు. భద్రాచలం, మేడారం పర్యటనలకు వెళ్లినప్పుడు ప్రభుత్వం కనీస మర్యాదలను కూడా ఇవ్వకపోవటంతో ఇక అప్పటి నుంచి గవర్నరు తమిళిసై.. వేదిక లభించినప్పుడల్లా తన ఆవేదనను వెల్లడిస్తూనే ఉన్నారు. అంతే కాకుండా.. రాజ్ భవన్ ఆమోదించాల్సిన దస్త్రాలను పక్కన పెట్టి తన ప్రాధాన్యత ఏమిటో తెలియజెప్పుతున్నారు. రాష్ట్ర బడ్జెట్టుకు ఆమె ఆమోదం వెంటనే లభించాల్సివుండటంతో ప్రభుత్వం 2023, జనవరి 30వ తేదీన హైకోర్టును ఆశ్రయించగా.. గవర్నరు వ్యవస్థలోకి తమకు ఎందుకు లాగుతున్నారంటూ హైకోర్టు ప్రశ్నించాల్సివచ్చింది. అదే రోజున భోజన విరామ సమయంలో ఉభయులు కలసి మాట్లాడుకొని రావాల్సిందిగా కోర్టు సూచించటంతో ఉభయ వర్గాలు రాజీపడి అదే విషయాన్ని కోర్టుకు తెలిపాయి. దీంతో కేసును హైకోర్టు ముగించింది.
గవర్నరు ప్రస్తావిస్తున్న మర్యాదలను రాష్ట్ర ప్రభుత్వం సమకూరిస్తే వివాదాలు ఇంతవరకు వచ్చుండేవికావు
హైకోర్టు చెప్పేవరకు ఉభయులు కలసి మాట్లాడుకోరా? అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. ఇంతకూ రాజీ చర్చలు ఏమిటంటే.. బడ్జెట్టుకు, పెండింగు బిల్లులకు గవర్నరు ఆమోదాన్ని తెలపటం, ప్రభుత్వం ఆమెను అసెంబ్లీకి ఆహ్వానించి, ప్రసంగ ప్రతిని అందజేయటం. మిగతా రాష్ట్రాల్లోను, ఇంతకు ముందు ఇదే తెలంగాణలోను ఇవన్నీ అత్యంత సహజమైన వ్యవహారాలు. ఇప్పుడు మాత్రం అవే అత్యంత ప్రాధానాంశాలయ్యాయి. ఇప్పటికైనా గవర్నరుకు నిబంధనల ప్రకారం గౌరవ మర్యాదలను ప్రభుత్వం కల్పిస్తే ఆమె శాంతించవచ్చు. ఎందువల్లనంటే.. హైకోర్టులో గవర్నరు తరపున వాదించిన లాయరు కూడా ఆమెకు ప్రభుత్వం గౌరవం ఇవ్వటం లేదనే విషయాన్నే ప్రధానంగా చెప్పారు. అసెంబ్లీలో గవర్నరు ప్రసంగం ఉంటుందా? లేదా? అని రాజ్ భవన్ అడిగిన ప్రశ్నకు సైతం ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని, పైగా ఆమెపై ఒక ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన వెల్లడించారు. గవర్నరుతో వైరం ద్వారా దేశ వ్యాప్తంగా ప్రచారం పొందాలనుకొంటే మాత్రం అప్పుడు భారాస చేసే విమర్శలను భారతీయ జనతా పార్టీ (భాజపా) తిప్పికొడుతూ.. అదీ ఇటువంటి విషయాలను తన రాజకీయానికి తప్పక వాడుకొంటుంది. మరో వైపు.. వెంటనే అమల్లోకి రావాల్సిన ఆర్డినెన్సులు, బిల్లులు తదితరాలు గవర్నరు వద్ద పెండింగులో ఉండిపోతాయి.