రసాయన ఎరువులు వాడని కూరగాయలను భక్తులైన రైతులు తప్పక అందజేసే అవకాశముంది
బురుజు.కాం Buruju.com : భక్తుల కోసం తయారు చేసే వంటకాలకు సేంద్రీయ ఎరువులతో పండించిన కూరగాయలను వినియోగించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే TTD ) భావిస్తోంది. కూరగాయలను విరాళంగా అందజేసే దాతలకు ఇదే విషయాన్ని తెలపదలచింది. ప్రస్తుతం ప్రతి రోజు భక్తుల భోజనానికి ఏడు నుంచి ఎనిమిది టన్నుల కూరగాయలను అన్నదాన ట్రస్టు ఉపయోగిస్తోంది.. వీటిలో.. చాల వరకు మదనపల్లి, చిత్తూరు, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల రైతులు రోజు ఉచితంగా అందజేస్తుంటారు. ఇలా ఇచ్చేవాటిని.. రసాయన ఎరువులతో కాకుండా.. ప్రకృతి సిద్ధంగా లభించే సేంద్రీయ organic ఎరువులతో కనుక పండిస్తే వంటకాలకు రుచి పెరగటంతో పాటు.. భక్తుల ఆరోగ్యాల పట్ల జాగ్రత్తలు తీసుకొన్నట్లవుతుంది.
స్వామి సన్నదిలోని భోజనాన్ని భక్తులు అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు
తిరుమలలో అన్న ప్రసాదాలను సాధారణ రోజుల్లో రోజుకు 55 వేల నుంచి 60 వేల మందికి, పర్వ దినాలు ఇతర రద్దీ సమయాల్లో ఒక లక్ష మందికి అందిస్తుంటారు. ఒకే సారి నాలుగు వేల మంది కూర్చుని భోజనం చేయగల తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనం పదేళ్ల క్రితం అందుబాటులోకి వచ్చింది. వంటలకు రోజుకు 10 నుంచి 12 టన్నుల బియ్యాన్ని వినియోగిస్తుంటారు. వెంగమాంబ కాంప్లెక్స్ లో అన్నంతో పాటు కూర, చట్నీ, సాంబారు, రసం , మజ్జిగ , చక్కెర పొంగలి అందిస్తారు. ఇక్కడ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు అన్నదాన వితరణ ఉంటుంది. ఇంకా వైకుంఠం క్యూ కాంప్లెక్స్, వెలుపలి క్యూలైన్, ఫుడ్ కౌంటర్లలో.. సాంబారు బాత్, ఉప్మా, పొంగలి, పులిహోర లభిస్తాయి.
లక్షమందికైనా భోజనాన్ని సమకూర్చగల వెంగమాంబ అన్నప్రసాద భవనం
అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్.. నిర్ణయం మేరకు 1985 నుంచి అన్న ప్రసాదాలను తితిదే ఉచితంగానే భక్తులకు అందజేస్తోంది. అంతకు ముందు స్వల్పంగా రుసుములు ఉండేవి. భక్తులు భారీగా విరాళాలను ఇస్తుండటంతో అన్న ప్రసాదాలను సమకూర్చే అన్నదాన ట్రస్టు.. 2018లో ఆర్థికంగా స్వయం సమృద్దిని సాధించింది. ప్రస్తుతం ట్రస్టు వద్ద రూ.1,502 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఇక దేవస్థానం నుంచి ప్రత్యేకంగా నిధులను తీసుకోవాల్సిన అవసరం తప్పింది.
తిరుమలలో ఒకప్పుడు భక్తులకు భోజనాన్ని ఇలా పెట్టేవారు