తెలంగాణ సాధనలో కీలకంగా వ్యవహరించిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస).. ఇప్పుడు భారత్ రాష్ట్ర సమితి (భారాస) గా మారి దేశంలో రాజకీయ చక్రం తిప్పాలని భావిస్తోంది
బురుజు.కాం Buruju.com : ఉభయ తెలుగు రాష్ట్రాల్లోను ఇప్పుడు రాజకీయ పరిణామాలు ఊపందుకొంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పేరులోని తెలంగాణను తొలగించి ‘భారత్’ అని పెట్టటం వల్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏ భరోసాతో ఆయన ‘భారాస’ను పెట్టారో ఇప్పటికైతే స్పష్టత కొరవడింది. భారాస పేరుతో ఆయన దేశంలో ఏంచేయబోతున్నారో తెలియటానికి మరికొన్ని రోజులు పట్టొచ్చు. మరో వైపు.. ఆంధ్రప్రదేశ్ లో అమరావతి ఉద్యమానికి ప్రతిగా మూడు రాజధానుల ఉద్యమాన్ని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే మొదలు పెడుతున్నారు. హైకోర్టు నుంచి అనుమతి పొంది పాద యాత్ర చేస్తున్న అమరావతి రైతులను ఉత్తరాంధ్రలోకి అడుగు పెట్టకుండా అడ్డుకోవాలంటూ ఆ పార్టీ నేతలు పిలుపు ఇస్తుండటంతో.. సమైక్య ఆంధ్ర ఉద్యమం సమయంలో మాదిరిగా అక్కడ మూడు రాజధానుల ఐక్య కార్యాచరణ సమితి ( ఐకాస)లు ఏర్పాటవుతున్నాయి. ప్రాంతీయ వాదాలతో రానున్న ఎన్నికల్లో ఓట్లను సాధించటం అధికార పక్షం వ్యూహంగా ప్రస్తుతానికి భావించొచ్చు.
బీఆర్ఎస్ గా పేరు మారుస్తూ సంతకం చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. పక్కన కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2014లో రెండు రాష్ట్రాలుగా ఏర్పాటయ్యే సమయంలో తెలంగాణలో అనేక పరిణామాలు చోటు చేసుకొనేవి. అన్నింటా తెలంగాణ వాదమే ఉండాలని తెలంగాణలోని ఎక్కువమంది భావించేవారు. రాష్ట్ర విభజన జరగకముందే.. వాహనాల నెంబరు ప్లేట్లలోని ఏపీని చెరిపివేసి ‘టీజీ’ అని రాసుకొనేవారు. ఆంధ్ర పేరుతో గల పత్రికలు ఇక్కడ ఉండటమేమిటని వాదించేవారికి సమాధానంగా.. ఆంధ్ర అనే పదం ప్రాంతాలకు కాకుండా తెలుగువారు అందరికి చెందినదిగా ఆంధ్రజ్యోతి పత్రిక ఒక వ్యాసాన్ని సైతం రాయవలసి వచ్చింది. ‘ఈనాడు’ యాజమాన్యం ఈటీవీ తెలంగాణ పేరుతో ప్రత్యేక న్యూస్ ఛానల్ మొదలు పెట్టింది. అంతెందుకు.. అధికార పార్టీ తన పత్రికకు కూడా ‘నమస్తే తెలంగాణ’ అని నామకరణం చేసుకొంది. ఇలా ప్రతి అంశంలోను తెలంగాణ పేరు మమేకమయ్యి వస్తుండగా.. అకస్మాత్తుగా ముఖ్యమంత్రి కేసీఆర్.. తెరాస పేరును మార్చేటం అన్ని పార్టీల వారిని విస్మయానికి లోను చేసిందనే చెప్పాలి.
అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవెల్లికి పాద యాత్ర చేస్తున్న అమరావతి రైతులు
పేరును మార్చేముందు క్షేత్ర స్థాయిలో ఏమైనా చర్చలు జరిగివుంటే ఇటువంటి భారీ ప్రతిపాదనను ఎంత మంది ఆమోదిస్తున్నారు? ఎంత మంది వ్యతిరేకిస్తున్నారు? అనేది తెలిసుండేది. ముఖ్యమంత్రి తొలుత పార్టీ పేరు మార్పు, ప్రత్యేక విమానం కొనుగోలు యోచన వంటి వాటి జోలికి పోకుండా.. దేశ వ్యాప్తంగా రాజకీయ సమీకరణల కోసం ప్రయత్నించి ఉంటే దేశంలో ఆయన ఏంచేయబోతున్నారనేది తెలిసుండేది. పార్టీ పేరులోని తెలంగాణను తొలగించటం పట్ల ఇప్పటికే కాంగ్రెస్, భాజపాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో జరగనున్న నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికలో ఆ పార్టీలకు ఇదొక బలమైన ఆయుధంగానూ మారవచ్చు. మునుగోడు ఉప ఎన్నికలో గెలవటం అధికార పార్టీకి ఇప్పుడు అత్యంత కీలకమైనందున.. పార్టీ పేరును ఎన్నిక పూర్తయ్యేవరకు మార్చకుండా ఉండాల్సిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
మూడు రాజధానులు ముద్దంటూ ఏపీలో వెలుస్తున్న అధికార పార్టీ శ్రేణుల ఫ్లెక్సీలు
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ఏర్పాటుపై అధికారపార్టీ ఒక్క సారిగా స్వరాన్ని పెంచింది. అమరావతి కోసం పాదయాత్రలు చేయటం ఏమిటంటూ కొందరు మంత్రులు, పార్టీ నాయకులు మండిపతుండటంతో ఆ పార్టీ దిగువ స్థాయి శ్రేణులు కూడా ఇప్పుడు కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి. దీంతో రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్రలోకి అడుగు పెట్టేటప్పుడు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకొంటాయోననే ఆందోళన రాష్ట్రంలో నెలకొంది. తెలంగాణలోని సంగారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ సందర్భంగా గమనించతగినవి. ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల బదులు మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసుకొని ఒక దానికి జగన్, మరో దానికి జగన్ సోదరి షర్మిల, మరో దానికి విజయసాయి రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉండొచ్చని, అప్పుడు షర్మిల.. తెలంగాణలో తన రాజకీయ మనుగడకు ఎవర్నిపడితే వారిని తిట్టవలసిన అవసరం ఉండదని హితవు పలికారు. మూడు రాజధానుల అంశం చివరికి మూడు రాష్ట్రాలు అనే వాదనలకు ఊతమిచ్చే అవకాశం ఉన్నట్టుగా జగ్గారెడ్డి వ్యాఖ్యలను బట్టి అంచనా వేయొచ్చు. మొత్తం మీద ఉభయ తెలుగు రాష్ట్రాల్లోను ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయం మారిపోతూ.. ఇదంతా ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో పరీశీలకులకు సైతం అంతుపట్టకుండా ఉంది.