బురుజు.కాం Buruju.com : నేర పరిశోధన కథలతో సినిమాలను తీసేవారు తొలుత వివిధ అంశాలపై అవగాహన కలిగి ఉండాలి. అటువంటి అవగాహన కనుక లేకపోతే హిట్2 Hit2 సినిమాలోని మాదిరి లోపాలు చోటు చేసుకొంటాయి. హీరో అడవి శేషు.. విశాఖనగరంలో ఎస్పీ (సూపరింటెండెంటు ఆఫ్ పోలీస్ ) హోదాలో పనిచేసే అధికారిగా సినిమాలో చూపించారు. నిజానికి.. విశాఖనగరంలో కమిషనరు, జాయింట్, డిప్యూటీ, అసిస్టెంటు కమిషనర్లే తప్ప ఎస్పీ హోదాగల వారు ఎవరూ ఉండరు. అదే విధంగా విశాఖలో డీఐజీ ఉంటారే తప్ప ఏడీజీపీ అనే హోదా అధికారి ఉండరు. హిట్3లో.. హీరోగా నాని నటించబోతున్నట్టు ఇదే సినిమాలో వెల్లడించారు. కనీసం అప్పుడైనా పోలీసు అధికారుల సరైన హోదాలను పేర్కొంటే దర్శకుడికి విమర్శలు తప్పుతాయి.
హీరో.. స్పాట్ కు వచ్చి అంతా పరిశీలించినా.. వేరే వారు చెప్పేవరకు ఆ మృత దేహం ఒకరిది కాదని, నలుగురికి చెందిన అవయవాలతో కూడినదని తెలుసుకోలేకపోతాడు
హీరోగా విశ్వక్ సేన్ నటించిన ‘హిట్’ విజయవంతం కావటంతో ఇక ఆ పేరుతో వరసగా సినిమాలను తీయాలని నిర్ణయించి.. ఇటీవల విడుదల చేసిన చిత్రమే హిట్2. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఒక అమ్మాయి తల.. దానికి మరో ముగ్గురు అమ్మాయిలకు చెందిన మొండెం, చేతులు, కాళ్లు చేర్చివున్న మృత దేహం కేసును ఛేదించేందుకు ఎస్పీ అడవి శేషు రంగంలోకి దిగుతాడు. హిట్ అంటే.. ‘హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్’ అని చిత్ర దర్శకుడు నిర్వచించుకొన్నారు. సినిమాలో మాత్రం హీరోను ఎప్పుడూ ఎస్పీ అనే వ్యవహరిస్తుంటారు. అతను కూడా ‘నేను వైజాగ్ ఎస్పీని’ అని పరిచయం చేసుకొంటూ ఉంటాడు. సినిమా కల్పిత కథే అయినప్పటికీ.. హోదాలు వంటివి ప్రస్తావించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకతప్పదు. లేకుంటే సంబంధిత విషయాలు తెలిసిన వారి వద్ద దర్శకుడు నవ్వుల పాలు కావాల్సివస్తుంది..
హీరో, హీరోయిన్ల సహజీవనం చేస్తున్న కథాంశాలతో తెలుగులో ఇటీవల వరసగా సినిమాలు వస్తున్నాయి. హిట్2లో.. అటువంటి సహజీవన సన్నివేశాలు ఇవి
విశాఖ పోలీసు కమిషనరేటు పరిధికి ఆవల ఉండే గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే ఎస్పీ ఉంటారు. ఆయన్ని రూరల్ ఎస్పీ అని వ్యవహరిస్తారు. సినిమాలోని నేర ప్రాంతాలన్నీ విశాఖ నగర పరిధిలోనే ఉంటాయి. అంతేకాకుండా.. హీరో.. పోలీస్ కమిషనరు కార్యాలయానికి వెళ్తున్నట్టుగాను చూపిస్తారు. అంటే.. హీరో పనిచేసేది పోలీస్ కమిషనరేటు పరిధిలోనే. అటువంటప్పుడు అతన్ని ఎస్పీ అని సంబోధించకుండా.. డిప్యూటీ లేదా అసిస్టెంట్ కమిషనరు అని అనుంటే సరిపోయేది. ఎస్పీ నివాసాన్ని పోలీసు పరిభాషలో క్యాంపు కార్యాలయంగా వ్యవహరిస్తారు. అక్కడెప్పుడూ పోలీసు సిబ్బంది ఉంటారు. ల్యాండు ఫోనులూ ఉంటాయి. సినిమాలో మాత్రం హీరో ఎప్పుడు ఫోను చేసినా ఆయన భార్య సెల్ ఫోను తీయదు. దీంతో హీరో ఉరుకులు పరుగులు పెడుతూ ఇంటికి వెళ్తూ.. ప్రేక్షకుడి సహనానికి పరిక్ష పెడతాడు.
హిట్3 హీరో నాని అని హిట్2 చివరిలో వెల్లడించారు
ఒక నిందితుడిని ఎన్ కౌంటర్ చేయనున్న రహస్య విషయాన్ని పత్రికలకు చెప్పినందుకు గాను హీరోను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తున్నట్టుగా ఏడీజీపీ ( అంటే.. అడిషనల్ డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అని అనుకోవాలి) ప్రకటిస్తారు. ఇటువంటి సందర్భాల్లో తొలుత సస్పెండ్ చేస్తారే తప్ప నేరుగా ఎవరినీ డిస్మిస్ చేయరు. అసలు.. ఇటువంటి పరిపాలన విషయాల పర్యవేక్షణకు విశాఖలో డీఐజీ స్థాయి అధికారి ఉంటారే తప్ప ఏడీజీపీ అంటూ ఉండరు. నేరస్తుల్ని ఇట్టే పట్టేస్తానని చెప్పే హీరో.. చాలా సినిమా అయిపోయి.. మరెక్కడో బలమైన క్లూ దొరకే వరకు మృత దేహంపై గల ఒక పబ్ ముద్రను చూడకపోవటం విడ్డూరం. నేర పరిశోధన చిత్రాలను ఎన్నిమలుపులైనా తిప్పుకొనే స్వేచ్ఛ దర్శకుడికి ఉంటుంది. ఆ స్వేచ్చను హిట్2లో మరీ ఎక్కువగా ఉపయోగించుకొన్నట్టు అనిపిస్తుంది. హీరో చెత్త దర్యాప్తు కారణంగానే ఒక అమాయకుడి ప్రాణాలు గాలిలో కలసిపోతాయి. హీరో, హీరోయిన్లు సహజీవనం చేస్తున్నట్టుగా సినిమాలో చూపించారు. తన అమ్మానాన్నలు తరచు తగవులాడుకుంటున్నారంటూ.. తన సహజీవనానికి మద్ధుతుగా హీరో ఒక తర్కాన్ని లేవదీస్తాడు. అంటే.. పెళ్లికి ముందు సహజీవనం చేసి.. ఇద్దరి మధ్య గొడవలంటూ రాలేదని నిర్ధారించుకొన్నాకనే పెళ్లి చేసుకోవాలనే సందేశాన్ని హీరోగారు ఇచ్చినట్టుగా మనం గ్రహించాలి.