బురుజు.కాం Buruju.com :‘శాకుంతలం’ Shaakuntalam సినిమా త్వరలో విడుదల కాబోతోంది. సినిమాలోని కీలక విషయాన్ని ట్రైలరులోనే చూపించేశారు. అందుకు కారణం.. కథ అందరికీ తెలిసి ఉండటమే. ఇలా అందరికీ తెలిసిన పౌరాణిక కథను భారీ ఎత్తున ఖర్చుపెట్టి చిత్రంగా తీయటమంటే.. కత్తిమీద సాము చేసినట్టే. కథను నడిపించిన విధానమే ఇప్పుడు సినిమా విజయావకాశాలను నిర్ణయిస్తుంది. సన్నివేశాలను విజువల్స్ అద్భుతాలతో తీర్చిదిద్దినట్టు ట్రైలరును బట్టి స్పష్టమవుతోంది.
బాహుబలి కథ పూర్తిగా కల్పితం. పైగా.. బాహుబలి, మహిష్మతి వంటి చారిత్రక పేర్లను కల్పిత కథలో ఎడాపెడా వాడి ఒక విధంగా .. ఇదంతా నిజమైన కథ కాబోలు అనే భావన కలిగేలా సినిమాను రూపొందించారు. కల్పిత కథను దర్శకుడు ఎన్నిమలుపులైనా తిప్పుకోవచ్చు. చారిత్రక, పౌరాణిక గాథలను మాత్రం ఎలాపడితే అలా చూపించటానికి వీలుకాదు. ఆయా కథల చుట్టూ ఒక చట్రం ఉంటుంది. ఆ చట్రాన్ని దాటి కథను నడిపిస్తే.. దర్శకుడు తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సివస్తుంది. శాకుంతలం దర్శకుడు గుణశేఖర్.. ఇంతకు ముందు ‘రుద్రమదేవి’ సినిమా తీశారు. ఇది చారిత్రక సినిమా. రద్రమదేవి జీవితంలో అనేక ఘట్టాలు ఉండటంతో వాటన్నింటిని సినిమాలో బాగానే చూపించారు. అల్లు అర్జున్, రానా, అనుష్క, ప్రకాశరాజ్ వంటి అగ్రశ్రేణి నటులు ఉన్నప్పటికీ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేకపోవటంతో.. దాని తర్వాత తీయాలనుకొన్న ‘ప్రతాప రుద్ర’ ను దర్శకుడు నిలిపివేశారు.
శాకుంతలం చిత్ర దర్శకుడు గుణశేఖర్
ఇప్పుడు.. పురాణాల్లోని శకుంతల కథను గుణశేఖర్ ఎంచుకొన్నారు. దుష్యంతుడు వేటకు వెళ్లినప్పుడు అక్కడ తారసపడ్డ శకుంతలను వివాహమాడటం, గర్భవతిగా రాజ ప్రాసాదానికి వచ్చిన శకుంతలను.. దుష్యంతుడు గుర్తించకపోవటం, వీరి పుత్రుడు భరతుడి పేరుతోనే భరత ఖండం ఏర్పడటం.. అందరికీ తెలిసిన విషయాలు. ఇలా తెలిసిన విషయాలనే ఇప్పుడు తెరపై చూపించబోతున్నందున ప్రతి సన్నివేశంలోను దర్శకుడు అత్యంత ప్రతిభను కనబర్చకతప్పదు. హైదరాబాదులో.. ట్రైలరు విడుదల సందర్భంగా దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ.. తమ అమ్మాయి నీలిమ సూచనలతోనే శకుంతల కథను ఎంచుకొన్నట్టు పేర్కొన్నారు. పురాణాల్లో ఎన్నో అద్భుతమైన కథలు ఉన్నాయని, వాటిని ఇప్పటి తరాల వారికి తెలియజెప్పాల్సిన అవసరం ఉందని తన కుమార్తె అభిప్రాయపడినట్టు ఆయన చెప్పారు. శకుంతలగా నటించిన సమంతకు కథ ఎంతగానో నచ్చిందన్నారు.
ప్రస్తుతం సమంత మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఓపిక లేకపోయినా ట్రైలరు ఆవిష్కరణ వేడుకకు వచ్చినట్టుగా ఆమె వెల్లడించటంతో.. అక్కడికి వచ్చిన వారి కళ్లు చెమ్మగిల్లాయి. సినిమాలోని శకుంతల కూడా భర్త ఆదరణ కోసం ఎన్నో కష్టాలు పడుతుంది. ఆ సన్నివేశాలప్పుడూ ప్రేక్షకుడి కళ్లు తడవకమానవు.