రామ్ తిరిగొచ్చినా.. సీత గుర్తుపట్టలేనంతగా ఉండేవాడేమో
personBuruju Editor date_range2022-10-08
సీతారామం సినిమాలోని పాత్రలే తప్ప నటులు మనకు గుర్తుకు రారు
బురుజు.కాం Buruju.com : ఇటీవల కాలంలో వచ్చిన అద్భుత ప్రేమ కథా చిత్రం.. ‘సీతారామం’. సినిమా చూసిన తర్వాత కొన్ని రోజుల పాటు దానిలోని సన్నివేశాలు ప్రేక్షకుల మదిలో మెదులుతూనే ఉంటాయి. తానెవరో బహిర్గతపర్చకుండా.. హైదరాబాదుకు చెందిన రాజకుమారి నూర్జహాన్.. సీత పేరుతో కాశ్మీరులోని ఒక సైనికుడైన రామ్ ను ప్రేమించటం, రామ్ పాకిస్తాన్ సైనికులకు చిక్కి అక్కడే మృతి చెందిన విషయం 20 ఏళ్ల తర్వాత బయట పడటం సినిమా ఇతివృత్తం . అసలు కథ 1964నాటిది కాగా అప్పట్లో రామ్ పాకిస్తాన్ జైలు నుంచి రాసిన లేఖను సీతకు అందివ్వటం కోసం పాకిస్తానీ యువతి రష్మిక.. 1985లో భారత్ లోని ఊర్లను తిరుగుతూ ఉంటుంది. అంటే.. రెండు కాలాల సన్నివేశాలను ఇప్పుడు 2022లో మనం చూస్తాం . ప్రతి సన్నివేశం ప్రేక్షకుడిని కట్టిపడేసేవిగా ఉంటాయి. అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉన్న ‘సీతారామం’ను Seethramam ఎన్ని సార్లు చూసినా.. దానిలోని పాటలు, మాటలు మళ్లీమళ్లీ వినాలనిపిస్తాయి.
రామ్ తన లేఖలో రాసినట్టుగా నిజంగా అతను పాకిస్తాన్ సైనికుల చిత్ర హింసలకు చనిపోయాడా? భారత్ కు తిరిగి వచ్చే అవకాశాలు లేవా? అనే భావన ప్రేక్షకుడికి తప్పక కలుగుతుంది. ప్రేక్షకుడు సినిమాలోని పాత్రల్లో లీనమయ్యి.. వారితో పాటుగా తానూ భావోద్వేగాలకు లోనైనప్పుడే ఇటువంటి భావనలు ఏర్పడతాయి. రామ్ కొన్నేళ్ల తర్వాత నిజంగా విడుదలయ్యి తిరిగొచ్చినా సీత గుర్తుపట్టలేనంతగా ఉండేవాడేమో? అలా అనుకొంటేనే సినిమా విషాద ముగింపు నుంచి కొంత బయటపడగలం. ప్రస్తుతం రష్యాకు బందీలుగా ఉన్న ఉక్రెయిన్ సైనికులు చిక్కి శల్యమయ్యి రూపురేఖలను కోల్పోయి ఉన్నారు. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం మొదలయ్యి ఏడు నెలలు గడవగా.. రష్యా ఇటీవల తమ వద్ద బందీలుగా ఉన్న 205 మంది ఉక్రెయిన్ సైనికులను విడుదల చేసింది. విడుదలైనవారిలో చాలా మంది బక్కచిక్కిపోయి ఉన్నారు. వీరిలో మైఖైలోడయానోవ్ పరిస్థితైతే మరీ దారుణం. ఎముకల గూడుగా మారిపోయి ఉన్న అతని ఫొటోలను ఉక్రెయిన్ ఆర్మీ ఇటీవల తన ట్విటర్లో పెట్టింది.
రష్యా తన వద్ద బందీగా ఉన్న ఉక్రెయిన్ సైనికుడిని ఇటీవల విడిచిపెట్టింది. అతను రష్యా సైన్యానికి చిక్కటానికి ముందు ఆ తర్వాత ఎలా ఉన్నదీ తెలిపే ఫొటోలను ఉక్రెయిన్ ఆర్మీ తన ట్విటరులో పెట్టింది
సీతారామం సినిమాలో కూడా రామ్ ను, మరికొందరిని పాకిస్తాన్ లోకి పంపేటప్పుడు ఆర్మీ అధికారి ప్రకాశ్ రాజ్.. కొన్ని విషయాలను చెబుతాడు. పాకిస్థాన్ సైన్యం చేతికి చిక్కితే ఇక ప్రాణాలపై ఆశలు వదులు కోవల్సిందేనని, అలా చిక్కిన వారిని అక్కడ చిత్ర హింసలు పెడతారని, వారిని పరారైనవారిగా తాము పరిగణించాల్సిన పరిణామం ఏర్పడుతుందని చెబుతూ.. వీటికి ఇష్టమైన వారే ముందుకు రావాలని అంటాడు. రామ్ తో సహా అక్కడ ఉన్నవారంతా అందుకు సిద్ధమవుతారు. తనకు అప్పగించిన ఆపరేషన్ ను రామ్ దిగ్విజయంగా పూర్తి చేసినప్పటికీ.. ఒక పాకిస్తానీ పాపను రక్షించేందుకు మళ్లీ వెనక్కి వెళ్లి అక్కడి సైనికులకు చిక్కుతాడు. కాశ్మీర్ లోయలోని అత్యంత శీతల ప్రాంతాల్లో మన సైనికులు ఎటువంటి కష్టాలు పడతారో సినిమాలో చూడొచ్చు. పాకిస్తాన్ ఉగ్రవాదులు కాశ్మీరులోకి చొరబడి కాశ్మీరీలుగా నటించటం, వారిని సైనికులు మట్టుపెట్టినప్పుడు స్థానికులు అపోహతో సైనికులను నిందించటం వంటి విషయాలను మనం సినిమా ద్వారా తెలుసుకోవచ్చు. ఒక వైపు అనుక్షణం యుద్ధ వాతావరణం, ఆ నడుమనే ధనిక, పేద , మతం అనే తారతమ్యాలను పక్కన పెట్టి కొనసాగే ప్రణయ గాథ ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. అందుకే.. ‘ యుద్ధంతో రాసిన ప్రేమ కథ ’ అంటూ సీతారామంకు ఉప శీర్షిక పెట్టారు.