ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ పదేళ్ల వ్యవధి గల బాండ్లను అమ్మి అప్పులను తెచ్చేది. పదో ఏట ముగియగానే అసలును చెల్లించివేసేది.
బురుజు.కాం Buruju.com తెలంగాణ ఇక ముందు ఏకంగా 40 ఏళ్ల వ్యవధి ఉండే అప్పులనూ తేబోతోంది. దేశంలో ఇంత ఎక్కువ కాలానికి అప్పులను తెచ్చే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ పేరు తెచ్చుకోబోతోంది. వ్యవధి పెరిగే కొద్దీ ఆయా అప్పులపై చెల్లించాల్సిన వడ్డీల భారం పెరుగుతుంది. ఇటువంటి దీర్ఘ కాల అప్పుల లాభ, నష్టాలపై కాగ్ , రిజర్వు బ్యాంకు ఇంతవరకు ఎటువంటి అధ్యయనాన్ని చేపట్టలేదు. తెలంగాణ ఆర్థిక శాఖ మాత్రం.. ఇదో మంచి విధానమంటూ కితాబు ఇస్తోంది.
తెలంగాణ ఆర్థిక వ్యవహరాలను అయిదేళ్లకు పైగా పర్యవేక్షిస్తున్న ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు .. ముఖ్యమంత్రికి పుష్కగుచ్చాన్ని ఇస్తున్నప్పటి దృశ్యం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. బాండ్లను అమ్మి సేకరించే అప్పును పదేళ్లలో తిరిగి చెల్లించివేసేది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కొంత కాలం పాటు ఇదే పద్దతిని అనుసరించినా.. గత మూడేళ్లగా మాత్రం తమ అప్పు విధానాన్ని పూర్తిగా మార్చేసుకొంటున్నాయి. తెలంగాణ రాష్ట్రమైతే ఏకంగా 40 ఏళ్ల తర్వాత తన అప్పును తిరిగి చెల్లించేలా ఏర్పాట్లు చేసుకొంటోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమూ ఇటీవల కాలంలో 20 ఏళ్ల తర్వాత తిరిగి చెల్లించేలా రుణాలను తెస్తోంది. గతంలో మాదిరిగా పదేళ్ల కల్లా అప్పును తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు కనుక ప్రభుత్వాలకు ఆ మేరకు వెసులుబాటు ఉండనున్నప్పటికీ.. గడువు ముగిసే వరకు ప్రతి ఆరు నెలలకు ఒక సారి చొప్పున బాండ్ల కొనుగోలుదారులకు వడ్డీలను చెల్లించక తప్పదు. దీంతో ఏటా బడ్జెట్లపై వడ్డీల భారం అనూహ్యంగా పెరుగుతుంది.
రాష్ట్రాలు ఏటా సమీకరించే అప్పుల్లో సింహ భాగం బాండ్ల అమ్మకాల ద్వారానే సమకూరుతున్నాయి. రిజర్వు బ్యాంకు నిర్వహించే ఇ- వేలం ద్వారా బ్యాంకులు, మ్యుచువల్ ఫండ్ సంస్థలు వంటి వాటికి.. రాష్ట్రాలు తమ బాండ్లను అమ్ముకొంటాయి. అధికారికంగా.. వీటినే సెక్యురిటీలుగా వ్యవహరిస్తారు. ఆయా రాష్ట్రాలకు గల రుణ పరిమితులను అనుసరించి ఆర్బీఐ ఎప్పటికప్పుడు బాండ్ల అమ్మకాలకు అనుమతి ఇస్తుంది. దీర్ఘకాలానికి అప్పులను తేవటాన్ని ఒక మంచి ప్రక్రియగా తెలంగాణ ప్రభుత్వం తన 2022-23 ద్రవ్య విధాన పత్రంలో ప్రశంసించింది. వ్యవధిని 40 ఏళ్ల వరకు నిర్ధేశించుకొంటున్నట్టు ఇదే విధాన పత్రంలో వెల్లడించింది. ఇప్పటికే 30 ఏళ్ల వ్యవధి రుణాలను తెచ్చింది. పదేళ్ల వ్యవధి గల బాండ్లకు, అంతకు మించిన వ్యవధి గల బాండ్లకు మధ్య వడ్డీ రేట్లలో కొన్ని తేడాలు ఉంటాయని ఆర్బీఐ ఉత్తర్వులు పేర్కొంటున్నాయి. ఉదాహరణకు 2021, జూలై నెలలో తెలంగాణ ప్రభుత్వం 30 ఏళ్ల వ్యవధిగల బాండ్లపై 7.24 శాతం వడ్డీ రేటుపై రూ. రెండు వేల కోట్లను సేకరించగా.. అదే సమయంలో రాజస్థాన్ అయిదేళ్ల వ్యవధి గల బాండ్లపై కేవలం 6.29 శాతానికి రూ. 500 కోట్లను తెచ్చుకొంది. అదే నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం14 ఏళ్లకు తెచ్చిన రూ. వెయ్యి కోట్లకు 7.12శాతం వడ్డీ పడింది. దీర్ఘకాలిక రుణాల కారణంగానే ప్రస్తుత రుణాల్లో 49 శాతం మేర 2036 తర్వాత మాత్రమే తిరిగి చెల్లించుకొనే సౌలభ్యం ఏర్పడినట్టు ఆర్థిక శాఖ చెబుతోంది.
బాండ్ల వ్యవధి ఎంత ఉంటే అంత కాలం కూడా అదే వడ్డీ రేటులో ప్రభుత్వాలు వడ్డీ మొత్తాలను చెల్లించాల్సివుంటుంది. అంటే తెలంగాణ 40 ఏళ్లకు అప్పును తెచ్చినప్పుడు.. ఒక వేళ మధ్యలో వడ్డీ రేట్లు తగ్గినా ఆ అప్పుపై దీర్ఘకాలం పాటు ఎక్కువ రేటులో వడ్డీలను చెల్లించుకొంటూనే వెళ్లాల్సివుంటుంది. దీర్ఘకాలిక వ్యవధికి రుణాలను తేవటం రాష్ట్రాలకు మంచిదా? కాదా? అనే అంశంపై ఇంతవరకు భారత కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ (కాగ్ ) , రిజర్వు బ్యాంకుతో సహా ఎవరూ అధ్యయనమంటూ చేపట్టలేదు. ఎందువల్లనంటే.. ఇంతటి భారీ వ్యవధులకు అప్పులను తెస్తున్న వాటిలో ప్రస్తుతం తెలంగాణ అగ్ర స్థానాన్ని ఆక్రమించగా ఆ తర్వాత తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ వంటి కొన్ని మాత్రమే ఇటువంటి జాబితాలో ఉన్నాయి. ఎక్కువ రాష్ట్రాలు అయిదు నుంచి పదేళ్ల వ్యవధికే బాండ్లను విక్రయించుకొంటున్నాయి. వడ్డీల భారం ఎక్కువగా ఉండనున్నప్పటికీ ఇప్పట్లో అసలును చెల్లించాల్సిన అవసరం ఉండదు కనుకనే కొన్ని రాష్ట్రాలు ఎక్కువ వ్యవధి ఉండే బాండ్ల బాట పడుతున్నాయి. ఇటువంటి అప్పుల మంచి, చెడులపై అధ్యయన నివేదికలు వెలువడటం ఇప్పుడు చాలా అవసరం.