విశ్వనాధ్ దర్శకత్వం వహించిన అన్ని సినిమాల్లోని పాటలూ మనస్సును హత్తుకొని.. ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి
బురుజు.కాం Buruju.com :
కళాతపస్వి విశ్వనాథ్ సినిమాల్లోని అన్ని పాటలు వినసొంపుగా ఉంటాయి. వాటిలో కొన్నింటిలోనైతే అద్భుతమైన అంతరంగమేదో ఆవిష్కృతమై ఉంటుంది. అటువంటి అంతరంగాన్ని శ్రోత అందిపుచ్చుకున్నప్పుడు.. ఒడలు పులకించి.. దర్శకుడు, గీత రచయితలకు ప్రణమిల్లాలనిపిస్తుంది. 1968లో.. కృష్ణ , జమున నటించిన ‘ఉండమ్మా బొట్టు పెడతా’ సినిమాలోని ‘ చుక్కలతో చెప్పాలని’ అనే పాటలో.. శృంగారం గురించి భార్య,భర్త ఎంతో సుకుమారంగా మాట్లాడుకొంటారు. పాటలోని పదాల అర్ధాలను గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం .. దాదాపు మూడేళ్ల క్రితం ‘ఈటీవీ’ స్వరాభిషేకం కార్యక్రమంలో వివరించినప్పుడు.. 70వ దశకం తరం వారు సైతం నివ్వెరపోయారు. పాటకు అభినయించిన కథానాయకుడు కృష్ణ.. 2022, నవంబరు 15న, కథానాయకి జమున .. 2023, జనవరి 23న చుక్కల వద్దకు చేరిపోయారు. అటువంటి అద్భుత పాటను తెలుగు ప్రజల గుండెల్లో భద్రపర్చి.. దర్శకుడు విశ్వనాథ్.. ఇప్పుడు ‘ఆది బిక్షువు నిన్ను ఏదీ కోరేది ’ అనుకొంటూ వెళ్లిపోయారు.
1968లో వచ్చిన ఉండమ్మా బొట్టుపెడతా సినిమాలో ‘చుక్కలతో చెప్పాలని’ పాటను ఆలపిస్తున్న కృష్ణ, జమున
పాట ప్రస్తుతం యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. ‘ చుక్కలతో చెప్పాలని’ అని భర్త అనగా.. ‘ఏమని’ అని భార్య అడుగుతుంది. ‘ఇటుచూస్తే తప్పు అని ’ అని భర్త అంటాడు . ‘ఎందుకని’ అని భార్య అడుగుతుంది. ‘ ఇక్కడ ఏకాంతంలో ఏమోఏమేమోనని’ అని భర్త అంటాడు. తమ ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందని, వాటిని మీరు ఎందుకు చూస్తారని చుక్కల్ని ప్రశ్నిస్తూ.. అలా జరుగుతున్నదాన్ని ‘ఏమోఏమేమో’ అని రాయటం.. విశ్వనాధ్ దర్శకుడు కావటం వల్లనే దేవులపల్లి కృష్ణ శాస్త్రికి సాధ్యమయ్యింది. ‘ ఆ..ఏమోఏమేమో’ ద్వారానే అసలు విషయాన్ని శ్రోత గ్రహిస్తాడు. వారిద్దరి మధ్య ప్రేమానురాగం పెనవేసుకొన్న సమయంలో తాము అసలు సవ్వడి చేయకూడదని చిగురాకుల్లోని గాలి సైతం భావిస్తుందట. ఎంత చక్కటి వర్ణణ!
‘చుక్కలతో చెప్పాలని’ పాటను ‘ఈనాడు’ స్వరాభిషేకం వేదికపై ఆలపిస్తున్న సునీత, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
చిగురాకులే చాలా చిన్నవిగా లేతగా ఉంటాయి. అవి గాలికి ఊగటమే చాలా తక్కువ. అటువంటి వాటిలోని చిరుగాలిని కూడా దేవులపల్లి గారు ‘ చిగురాకుల గాలులే ఒదిగొదిగేను ’ అని రాస్తారు. ‘చెదిరే ముంగరులు, కాటుకలు.. నుదరంతా పాకేటి కుంకుమలు.. అని భర్త అంటే .. ‘సిగపాయల పువ్వులే సిగ్గుపడేనూ’ అని భార్య అంటుంది.పాటలోని వర్ణణంతా వారిద్దరి మధ్య ఆ రాత్రి బంధాన్ని తెలియజేస్తుంది. పాట చరణంలో .. ‘ చెవిలో ఒక చిన్నమాట చెప్పే‘సే’వేళ’ అని భార్య అంటుంది. ఇలా ‘చెప్పేసే ’అనే పదం గురించి బాలసుబ్రహ్మణ్యం చేసిన విశ్లేషణ.. శ్రోతలను ఆశ్చర్యచికుతుల్ని చేస్తుంది.
దర్శకుడు కె.విశ్వనాథుకు ‘ ఉండమ్మా బొట్టుపెడతా’ చిత్రం.. ఆయన తీసిన వాటిలో మూడోవది . ఆయన సినిమాల్లోని పాటలన్నీ సాహిత్య గుభాళింపుతో వీనుల విందుచేస్తుంటాయి
భర్తకు ఏంకావాలో కనిబెట్టిన భార్య.. తన అభిమతాన్ని కూడా భర్తకు చెప్పాలని అనుకుంటూ.. ఇక ఉండబట్టలేక చివరికి.. చెప్పేసిందట. చెవిలో ‘చెప్పేవేళ’ అని రాయవచ్చని, అయితే ‘చెప్పేవేళకు’ , ‘చెప్పే‘సే’ వేళకు’ చాలా తేడా ఉందని ఎస్పీ విడమర్చిచెబుతుంటే అవును కదూ? అని శ్రోతలు తప్పక విశ్మయం చెందుతారు. ఆ విషయాన్ని భర్తకు ఎలా చెప్పాలా అని అనుకుంటూ ఇక ‘ చెవిలో చెప్పేశా’ అని భార్య అంటుందని ఆయన విశిదీకరిస్తారు.పాటను దేవులపల్లి ఎంతగొప్పగా రాశారో.. అంతే గొప్పగా కేవీ మహదేవన్ సంగీతాన్ని సమకూర్చారు. సినిమాను దర్శకులు విశ్వనాథ్
అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇది విశ్వనాథ్ గారికి మూడో సినిమా. విశ్వనాధ్ కారణంగానే ఇంతటి గొప్ప పాట తయారవ్వగలిగిందని బాలు తన విశ్లేషణలో పేర్కొన్నారు. బాలు, విశ్వనాథ్ కలసి చాలా కాలం ఒక స్థిరాస్తి సంస్థ ప్రకటనలో కనిపిస్తూ వచ్చారు. ప్రకటనలోని ఆ ఇద్దరు ఒక్కొక్కరిగా తరలివెళ్లిపోయారు.