నిబంధనలకు అనుగుణంగా నిజమైన అర్హులను ఎంపిక చేయటం కీలకం
Buruju.com తెలంగాణలో వృద్ధాప్య పింఛను అందుకోవటానికి ఇక 57 ఏళ్లు నిండితే సరిపోతుంది. ఇంతవరకు ఇటువంటి అర్హత వయస్సు 65 ఏళ్లు. ఇలా వయస్సును ఒకే సారి ఎనిమిదేళ్లు తగ్గించటం వల్ల ఒక్క సారిగా 10 లక్షల మంది వ్యక్తులు అదనంగా వృద్ధాప్య పింఛను జాబితాలోకి చేరతారు. దీంతో బడ్జెట్లపై ఆర్థిక భారం పెరుగుతుంది. దేశంలో మరే ఇతర రాష్ట్రం కూడా ఇంత తక్కువ వయస్సు వారికి పింఛన్లను ఇవ్వటంలేదు. వయస్సును తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం.. ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో చర్చనీయాంశమవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వయస్సు తగ్గింపుపై రాజకీయ పార్టీలు తమ వైఖరిని వెల్లడించి హామీలను ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు.
తపాల ఉద్యోగి నుంచి పింఛన్లను అందుకోవటానికి హాజరైన పింఛనుదారులు
ఆరోగ్యంపై అవగాహన పెరగటం వల్ల ప్రజల జీవిత కాలం ఇప్పుడు మునుపటికంటే పెరిగింది. ఇటువంటి కారణంగానే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును తెలంగాణ 61 ఏళ్లకు, ఏపీ 62 ఏళ్లకు పెంచాయి. అంటే.. అప్పటి వరకు కూడా ఆయా ఉద్యోగులు బాగా పనిచేయగలుగుతారనేది ప్రభుత్వ భావన. పేదలకు వృద్ధాప్య పింఛను మంజూరు చేసేందుకు అవసరమయ్యే వయస్సును 57 ఏళ్లకు తగ్గించటానికి గల కారణాలను మాత్రం ప్రభుత్వం ఎక్కడా వెల్లడించలేదు. ఇటువంటి హామీని 2018 ఎన్నికల సమయంలో ఇచ్చామని, దాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నామని మాత్రమే అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. చాల రాష్ట్రాల్లో వృద్ధాప్య పింఛను అందుకొనే కనీస వయస్సు 60 ఏళ్లుగానే ఉంది. మహారాష్ట్రలో 65 ఏళ్లకు ఇస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో ఇటీవల వరకు 70 ఏళ్లకు ఇచ్చి.. ఇటీవలనే అక్కడా 60 ఏళ్లకు కుదించారు.
పింఛన్లలో కేంద్రం వాటా చాలా స్వల్పమంటూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన
కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులు పదవీ విరమణ చేశాక.. వారి వయస్సు పెరిగే కొద్దీ పింఛను పెరిగే విధానాలు ఇప్పుడు అమల్లో ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు.. పేదల పింఛన్లకూ దీనిని అనుసరిస్తున్నాయి. కేరళలో 60 ఏళ్లు దాటిన పేదలకు రూ.1,600 ఇచ్చి.. వయస్సు 75 దాటితే అదనంగా రూ.1,500 చొప్పున ఇస్తారు. అక్కడ దివ్యాంగుల పింఛన్లకూ ఇదే పద్దతి ఉంది. కర్ణాటకలో 64-65 మధ్య వయస్సు వారికి రూ.600, వయస్సు 65 దాటితే రూ.1,000 నుంచి రూ.1,200 వరకు ఇస్తున్నారు.
తెలంగాణలో ఇక 57 ఏళ్లు దాటితే వృద్ధుల జాబితాలోకి చేరతారు. వారు ప్రతి నెలా రూ.2,016 పింఛను అందుకోవచ్చు
ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో సహా అన్ని రాష్ట్రాలు ఇస్తున్న పింఛన్లలో కొంత మేరకు కేంద్ర ప్రభుత్వం వాటాలూ ఉంటున్నాయి. కేంద్రం.. 60-79 ఏళ్ల మధ్య వారికి రూ.200 చొప్పున, వయస్సు 80 దాటితే రూ.500 చొప్పున ఇస్తోంది. హర్యానాలో 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లను ఇవ్వటం కాకుండా అటువంటి వారిని ఎంపిక చేసి.. వారి జాబితాలను వారి వయస్సు 60 నిండే సరికల్లా సిద్ధం చేసి ఉంచుతారు. కొన్ని రాష్ట్రాలు.. పింఛను అందుకోవటానికి ప్రాతిపదికగా తీసుకొనే వార్షిక ఆదాయ పరిమితిని మాత్రం సవరిస్తున్నాయి. దీని వల్ల మరింత మంది వ్యక్తులు అర్హుల జాబితాల్లోకి రావటానికి వీలువుతుంది. ఎటువంటి ఆసరా ఉండని నిరుపేదలకు వారి వయస్సు తక్కువగా ఉన్నప్పటికీ పింఛను ఇచ్చి ఆదుకోవచ్చు. అటువంటి అర్హులను ఎంపిక చేసే యంత్రాంగమంటూ ప్రస్తుతం కొరవడి.. అనర్హులు పెద్ద సంఖ్యలో పింఛన్లను అందుకోగలుగుతున్నారు. వృద్ధాప్య పింఛన్లకు అర్హత వయస్సును 57 ఏళ్లకు కుదించే ముందు తెలంగాణ పాలకులు మిగతా రాష్ట్రాల్లో అధ్యయనం చేయించి.. 57 నుంచి 60 వయస్సు వరకు ఒక తరహా పింఛను, ఆ తర్వాత వయస్సు వారికి మరో రకం పింఛను పద్దతిని ప్రవేశ పెట్టివుంటే ఆర్థిక భారం కొంత మేర తగ్గివుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.